
ఊపిరాడక.. ఉక్కిరిబిక్కిరి!
నిలోఫర్‌లో కరెంట్ ‘కట్’కటా
ఉదయం నుంచి చీకట్లోనే మగ్గిన నవజాత శిశువులు
వైద్య పరీక్షలకు, చికిత్సలకు తీవ్ర అంతరాయం
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సహా సర్జికల్, సాధారణ వార్డుల్లో కరెంట్ లేకపోవడంతో వైద్యాధికారులు, నవజాత శిశువులు తీవ్ర ఇబ్బం దిపడాల్సి వచ్చింది. వార్డుల్లో గాలి, వెలుతురు లేక ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వార్మర్లు, ఫొటోథెరపీ యూనిట్స్ పని చేయక రోగు లు మరింత అస్వస్థతకు గురయ్యారు. ఎక్స్‌రే, సిటీస్కాన్, అల్ట్రాసౌండ్, రక్త, మూత్ర పరీక్షలకు అంతరాయం ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో శిశువులు, వార్డుల్లోని బాలింతలు, గర్భిణులు పగలంతా చీకట్లోనే మగ్గాల్సి వచ్చింది.
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడం వల్లే...
ఆస్పత్రిలో ఇటీవల విద్యుత్ ఉపకరణాల వాడకం రెట్టింపైంది. ట్రాన్స్‌ఫార్మర్‌ను అప్‌గ్రేడ్ చేయక పోవడంతో పాటు ఆయిల్ లీకేజీలను అరికట్టక పోవడం వల్ల కాలిపోయింది. ఆస్పత్రిలో రెండు జనరేటర్లు ఉన్నా రోగుల అవసరాలు తీర్చలేకపోయాయి. విద్యుత్‌లేక కొత్త అడ్మిషన్లు సహా ఆరోగ్యశ్రీ సర్వీసులకు తీవ్ర విఘాతం కలిగింది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం..
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడం వల్ల ఆస్పత్రిలో కరెంట్ సరఫరా ఆగిన మాట వాస్తవమే. అయితే అత్యవసర విభాగం సహా ఆపరేషన్ థియేటర్స్, లేబర్ వార్డు, ఎన్‌ఐసీయూ విభాగాల్లోని రోగులకు ఇబ్బందులు త లెత్తకుండా జనరేటర్ సాయంతో విద్యుత్ సరఫరా చేశాం. జనరల్ వార్డులో మాత్రమే సరఫరా నిలిచింది. దీన్నీ సాయంత్రం పునరుద్ధరించాం.
- డాక్టర్ జయకృష్ణ, ఆర్ ఎంఓ, నిలోఫర్