
చైనా మళ్లీ అదే పాట
భారత్-చైనా సరిహద్దు ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్లో ఎవరూ పర్యటించినా చైనా పాడిందే పాటగా తన అక్కసును వెళ్లగక్కుతూ వస్తోంది.. అంతకముందు అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించిన చైనా.. నేడు బౌద్ద మత గురువు దలైలామా పర్యటనపై కూడా మండిపడింది.. టిబెటిన్ మత గురువు దలైలామా అరుణాచల్ప్రదేశ్లో పర్యటించడాన్ని తాము తీవ్రంగా తప్పుబడుతున్నామని, ఈ పర్యటన వల్ల సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి నష్టం వాటిల్లి, అస్థిరత ఏర్పరుడుతుందని వ్యాఖ్యానించింది. "ఇరుదేశాల మధ్య వివాదాస్పదమైన ప్రాంతంలో దలైలామాను పర్యటనకు ఆహ్వానించడం, శాంతికి, స్థిరత్వానికి నష్టం వాటిల్లుతుంది. దీంతో పాటు చైనా, భారత్ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయి" అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ సీఎం ప్రేమ్ ఖండు ఇచ్చిన ఆహ్వానం మేరకు వచ్చే ఏడాది దలైలామా భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతంలో సందర్శించనున్నారు. దలైలామా పర్యటనను కేంద్ర విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పష్టంచేశారు. దక్షిణ టిబెట్లో అరుణాచల్ ప్రదేశ్ ఓ భాగమని పేర్కొంటూ, ఆ సరిహద్దులో సుమారు 4వేల కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతమంతా వివాదస్పదమైందనిగా చైనా చెబుతోంది.. గతవారం అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తవాంగ్లో పర్యటించినప్పుడు కూడా బీజింగ్ ఈ విధమైన రీతిలోనే స్పందించింది. చైనా, భారత్కు ఉన్న వివాదాస్పదమైన సరిహద్దు ప్రాంతంలో అమెరికాను తలదూర్చవద్దని హెచ్చరించింది.