ఆర్మీ చీఫ్‌గా జనరల్ సుహాగ్
న్యూఢిల్లీ: సైనికదళాల కొత్త ప్రధానాధికారిగా జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ గురువారమిక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జనరల్ బ్రికమ్ సింగ్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. 26వ ఆర్మీ చీఫ్‌గా నియమితులైన 59 ఏళ్ల సుహాగ్.. 30 నెలలపాటు ఆ పోస్టులో కొనసాగుతారు. గతేడాది డిసెంబర్‌లో ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా నియమితులైన ఆయన్ను యూపీఏ సర్కారు గద్దె దిగే ముందు హడావుడిగా ఆర్మీ చీఫ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇలాంటి కీలక నియామకాల విషయంలో అంత తొందర ఎందుకని, ఎన్నికలు పూర్తయ్యాక వచ్చే కొత్త ప్రభుత్వం ఇలాంటి అంశాలను చూసుకుంటుంది కదా అంటూ యూపీఏ నిర్ణయాన్ని బీజేపీ అప్పుడు తప్పుబట్టింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్ సుహాగ్ నియామకాన్ని కొనసాగిస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.