
పాపం.. ఎడాపెడా వాయించి, తోసేసింది
వృద్ధురాలు అని జాలి చూపలేదు. సాటి మహిళ అన్న మానవత్వం లేనేలేదు. కాటికి దగ్గరైన అత్తపై... కోడలు రాక్షసిలా ప్రవర్తించింది. పక్షవాతంతో మంచానికే పరిమితమై లేవలేని స్ధితిలో ఉన్న అత్తను అమానుషంగా కొట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కోడలు ఎడాపెడా వాయించి, మంచంపై నుండి కిందకు తోసేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబిలో జరిగిన ఈ అమానవీయ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. వివరాలిలా ఉన్నాయి.
వృద్థురాలు తన కొడుకు, కోడలు వద్ద ఉంటోంది. ఆమెకు పక్షవాతం రావడంతో మాట్లాడలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. కాగా తల్లి వంటిపై గాయాలు ఉండటాన్ని కొడుకు గుర్తించాడు. అయితే ఏం జరిగిందో చెప్పే పరిస్థితిలో ఆమె లేదు. కొడుకుకు తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దాంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా సీసీటీవీ కెమెరాను అమర్చాడు. దాంతో భార్య బండారం బయటపడింది. సీసీటీవీ ఫుటేజీలో తన భార్య విచక్షణ రహితంగా తల్లిని కొడుతున్న దృశ్యాలను చూసి చలించిపోయాడు. పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్యపై ఫిర్యాదు చేశాడు. దేశంలో వృద్దుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.