వచ్చే ఏడాది వృద్ధి 6% పైనే: చిదంబరం
దావోస్: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరణ(ట్యాపరింగ్) ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మాట్లాడుతూ విదేశీ ఇన్వెస్టర్లకు ఆయన ఈమేరకు భరోసానిచ్చారు. భారత్‌లో ఆర్థిక వ్యవస్థ గాడిలోపడుతోందన్న విత్తమంత్రి... ఈ ఏడాది(2013-14) 5% వృద్ధి రేటు సాధించగల విశ్వాసం వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది 6% పైగానే వృద్ధి ఉండొచ్చని చెప్పారు. 2012-13లో వృద్ధి దశాబ్దపు కనిష్టమైన 5%కి పడిపోవడం తెలిసిందే. కొద్ది సంవత్సరాల్లో కచ్చితంగా 8%వృద్ధిరేటును అందుకోగల సత్తా ఉంది’ అని చిదంబరం పేర్కొన్నారు. నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్ల కొనుగోలు(సహాయ ప్యాకేజీ)లో ఈ నెల నుంచి 10 బిలియన్ డాలర్ల కోతను ఫెడ్ ప్రకటించడం విదితమే.
ఇంకా చిదంబరం ఏమన్నారంటే...
సబ్సిడీల కోత ఇతరత్రా ఆర్థిక క్రమశిక్షణపై భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది.
సంస్కరణల ప్రభావంతో భారత్‌లోకివిదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) జోరందుకోనున్నాయి.
ఆర్థికవేత్తగా పేరొందిన ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్.. గొప్ప ఆలోచనా పరుడు కూడా. పాలసీ నిర్ణయాల్లో సమర్ధంగా వ్యవహరిస్తారు.