
సిట్టింగ్ వేసి మందు బాటిల్ ఓపెన్ చేయబోతే..
పాడేరు రూరల్: సిట్టింగ్ వేసిన మందుబాబు.. తీరా బాటిల్ తెరవబోయేసరికి షాక్ తిన్నాడు. మందుతాగాలన్న కోరిక సంగతేమోగానీ ఒక్కక్షణం.. ‘బతికిపోయానురా దేవుడా’ అనుకున్నాడు. విశాఖపట్నం జిల్లా పాడేరులో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
పట్టణానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక శ్రీనివాస లాడ్జి ఎదురుగా ఉన్న వైన్ షాపులో సోమవారం హాఫ్‌బాటిల్ మద్యం కొన్నాడు. ఇంటికెళ్లి గ్లాసు, వాటర్ ప్యాకెట్, స్టఫ్.. సిద్ధం చేసుకుని తీరా మందుబాటిల్ ఓపెన్ చేయబోతు ఆగిపోయాడు. బాటిల్ లోపల పెద్ద పెద్ద సాలె పురుగులు చనిపోయి ఉండటాన్నిచూసి షాకయ్యాడు.
కొద్దినిమిషాల తర్వాతగానీ తేరుకున్న మందుబాబు.. ఆ బాటిల్‌ను తీసుకెళ్లి వైన్‌షాప్ యజమానికి చూపించాడు. అయితే సదరు బాటిల్ తన షాపులో కొన్నది కాదని ఆ యజమాని వాదించాడు. దీంతో ఇద్దరి మధ్య కాసుపు వాగ్వాదం నడిచింది. ఇంతలోనే విషయం తెలుసుకున్న పోలీసులు వైన్‌షాప్ వద్దకు చేరుకుని బాధితుడిని అక్కడి నుంచి పంపేశారు.
ఇంతకీ బాటిల్‌లోకి పురుగులు ఎలా వచ్చాయి?
స్థానికంగా కలకలం రేపిన ఈ వ్యవహారంపై ఎక్సైజ్ సీఐ రాజారావును ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘పురుగులు కనిపించిన మద్యం బాటిల్ సీల్ వేసే ఉంది. అంటే, స్థానికంగా కల్తీ అయినట్లు కాదు. ఖచ్చితంగా మద్యం తయారీ కేంద్రం(కంపెనీ)లోనే తేడా జరిగి ఉండొచ్చు’ అని సమాధానమిచ్చారు. కాబట్టి మద్యం ప్రియులూ.. కాస్త జాగ్రత్త. ఏ బాటిల్‌లో ఏముందో జర చూసుకొని..