తిరిగి పంపించేస్తామన్న కేంద్రం తీరుపై రోహింగ్యాల ఆవేదన
న్యూఢిల్లీ: బర్మాలో మేం ప్రశాంతంగా పడుకున్న రోజు ఒక్కటి కూడా లేదు. ఎప్పుడైనా ఆర్మీ వచ్చి విరుచుకుపడేది.. ఇక్కడ చెత్తకుప్ప పక్కన నివసిస్తున్నా రాత్రి ఎలా గడుస్తుందన్న ఆందోళన మాకు లేదు.. దక్షిణ ఢిల్లీ షహీన్‌బాగ్‌లో చెత్తకుప్ప పక్కన నివసిస్తున్న నూర్ ఆలం మాట ఇది. ఇక్కడ 74 రోహింగ్యా కుటుంబాలు శరణార్థులుగా జీవిస్తున్నాయి. 12మంది కుటుంబసభ్యులతో బతుకు వెళ్లదీస్తున్న నూర్ ఆలం.. ఇక్కడ పేదరికంలో ఉన్నా ఆనందంగానే ఉన్నామని చెప్తున్నారు.
మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో రోహింగ్యా తిరుగుబాటుదారులకు, ఆర్మీకి మధ్య ఏళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధాన్ని తప్పించుకొని.. ప్రాణాలు అరచేత పట్టుకొని పొరుగుదేశాలకు వలస వచ్చిన వేలాదిమంది రోహింగ్యాలలో నూర్ ఆలం ఒకరు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన కిరాతకమైన తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్‌ను తప్పించుకొని నూర్ ఆలం బర్మాను వీడారు. ఈ రక్తపాతంలో ఆయన దూరపు కుటుంబసభ్యులంతా మృతిచెందారు. 15రోజులపాటు నడిచి బంగ్లాదేశ్ చేరుకొని.. అక్కడి నుంచి భారత్‌లోకి ప్రవేశించారు. 'తూటా నుంచి ఎవరైతే తప్పించుకున్నారో వారే బర్మా నుంచి బయటపడ్డారు' అని నూర్ ఆలం గుర్తుచేసుకుంటారు.
తాజాగా రఖైన్ రాష్ట్రంలో రోహింగ్యాలకు, ఆర్మీకి మధ్య ఘర్షణలు ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో రోహింగ్యాలను దేశంలోకి అనుమతించకూడదని, దేశంలోని 40వేల మంది శరణార్థులను తిరిగి మయన్మార్ పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. రోహింగ్యాలను తిరిగి స్వదేశానికి పంపిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనపై నూర్ ఆలం ఆవేదన వ్యక్తం చేశారు.
'మయన్మార్ తిరిగి వెళ్లేందుకు మాకు అభ్యంతరం లేదు. కానీ మాకో పరిష్కారం కావాలి. అది మా దేశం. మా ఇల్లు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం కంటే ఇక్కడ చావడమే ఉత్తమం' అని 41 ఏళ్ల ఆయన అన్నారు. రోహింగ్యాలను తిరిగి పంపించేయాలని కేంద్రం భావిస్తున్నప్పటికీ అది వీలుపడే అవకాశం కనిపించడం లేదు. మయన్మార్ సర్కారు రోహింగ్యాలను అసలు తమ పౌరులుగానే గుర్తించకపోవడంతో వారిని తిరిగి స్వదేశంలోకి అనుమతిస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మయన్మార్‌లో రోహింగ్యాల రోదన..!
అక్కడికి వెళ్లడం కంటే ఇక్కడే చచ్చిపోతాం!
Published Thu, Sep 7 2017 9:45 AM | Last Updated on Tue, Sep 12 2017 2:10 AM
Advertisement