భారత యుద్ధ విమానాల పైలట్లుగా మహిళలు
న్యూఢిల్లీ: విమాన, హెలికాప్టర్ల పైలట్లుగా సేవలందిస్తున్న మహిళలు.. ఇక యుద్ధ రంగంలో కదంతొక్కబోతున్నారు. భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్లుగా మహిళలను నియమించనున్నారు. శనివారం రక్షణ మంత్రిత్వ శాఖ ఇందుకు ఆమోద ముద్ర వేసింది.
ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మహిళా పైలట్లను యుద్ధ విమానాల పైలట్లుగా ఎంపిక చేయనున్నారు. 2016 జూన్లో తొలి బ్యాచ్ను ఎంపిక చేస్తారని, ఆ తర్వాత ఏడాది పాటు వారికి శిక్షణ ఇస్తారని, 2017 జూన్ నుంచి యుద్ధ విమానాల పైలట్లుగా మహిళలు సేవలు అందిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం పేర్కొంది. 'రవాణ విమాన, హెలికాప్టర్ పైలట్లుగా మహిళలు పనిచేస్తున్నారు. ఆసక్తిగల యువతులను ఫైటర్ పైలట్లుగా నియమించాలని భావిస్తున్నాం' అని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా ఇటీవల చెప్పారు. ఎయిర్ ఫోర్స్ పంపిన ప్రతిపాదనను తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది.