Women pilots
-
గగన్‌యాన్‌లో మహిళా పైలట్లకు ప్రాధాన్యం
తిరువనంతపురం: గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా చేపట్టే మానవసహిత అంతరిక్ష కార్యక్రమంలో మహిళా పైలట్లు, మహిళా శాస్త్రవేత్తలకే ఇస్రో ప్రాధాన్యం ఇస్తుందని, భవిష్యత్తులో మహిళా వ్యోమగాములనే అంతరిక్షంలోకి పంపుతామని సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రయోగించే మానవ రహిత గగన్‌యాన్ అంతరిక్ష నౌకలో మనిషిని పోలిన మహిళా హ్యూమనాయిడ్‌ను ఇస్రో పంపుతుందని తెలిపారు. 2025 నాటికి మానవ సహిత మిషన్‌ను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ కక్ష్యలోకి పంపుతామని, అది మూడు రోజుల తర్వాత సురక్షితంగా భూమికి తిరిగి చేరుకుంటుందని వివరించారు. ప్రస్తుతానికి మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లు దొరకనందున ఎయిర్ ఫోర్స్ ఫైటర్ టెస్ట్ పైలట్లనే అంతరిక్ష యాత్రకు ఎంపిక చేస్తున్నాం. మహిళా పైలట్లు అందుబాటులోకి వస్తే వారినే ఎంపిక చేసుకుంటాం. ఆ తర్వాత మహిళా సైంటిస్టుల వంతు. అప్పుడిక మహిళలకు ఎక్కువ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’ అని సోమనాథ్ చెప్పారు. 2035 నాటికి పూర్తి స్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. శనివారం గగన్‌యాన్ యాత్రలో సన్నాహక పరీక్షల్లో భాగమైన క్రూ ఎస్కేప్ మాడ్యూల్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. -
IAF Combined Graduation Parade: ఈ పైలట్లు ఫైటర్లు
పోరాటాలంటే మక్కువ ఉన్నవారు ఏ సవాల్‌నైనా ఇట్టే అధిగమిస్తారు. ఫైటర్ జెట్ పైలెట్‌గా ఎంపికైన మైత్రేయ నిగమ్, మెహర్ జీత్ కౌర్‌లను చూస్తే ఆ మాట నూటికి నూరుపాళ్లు నిజం అంటారు. 22 మంది మహిళల్లో ఫైటర్లుగా ఎంపికైన వీరి ప్రతిభ, కృషి నవతరానికి స్ఫూర్తి. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో (ఏఎఫ్ఏ) జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ అది. వాయుసేనలో ఉన్న ఖాళీలు, శిక్షణ సమయంలో అభ్యర్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా వారిని ఫైటర్లుగా ఎంపిక చేస్తారు. మొత్తం 164 మంది శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ ఆఫీసర్లు పట్టాలు పొందారు. వీరిలో 22 మంది మహిళలు ఉండగా మైత్రేయ నిగమ్, మెహర్ జీత్ కౌర్‌లు ఫైటర్ జెట్ పైలట్లుగా నిలిచారు. మైత్రేయ నిగమ్ ఆమె కుటుంబంలో మూడో తరం ఫైటర్. వదలని కృషి గ్రూప్ కెప్టెన్‌గా పదవీ విరమణ పొందిన పీకే నిగమ్ ప్రస్తుతం ఏవియేషన్ డొమైన్ సంస్థలో పని చేస్తుండగా, ఆయన కుమారుడు అమిత్ నిగమ్ వింగ్ కమాండర్ హోదాలో రిటైర్ అయి ఇండిగో విమానయాన సంస్థలో సీనియర్ కెప్టెన్‌గా పని చేస్తున్నారు. మైత్రేయ నిగమ్ ఢిల్లీలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో విద్యనభ్యసించారు. అహ్మదాబాద్‌లోని ముద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్‌లో (మికా) ఎంబీఏ కోర్సులో చేరారు. అదే సమయంలో తనకు ఆసక్తి ఉన్న వైమానిక దళంలోకి ఎంపికయ్యారు. ‘మా తాత, తండ్రిని చూసి స్ఫూర్తి పొందాను. ఫైటర్ జెట్ పైలట్ కావాలనే ఆశయంతో కృషి చేశా. తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎవరైనా అనునిత్యం శ్రమించాల్సిందే. వెంట వెంటనే విజయాలు లభించవు. కల నెరవేరాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. కానీ, ఆగిపోవద్దు. కృషిని మధ్యలోనే వదిలేయకుండా కష్టపడితే విజయం తథ్యం’ అని చెబుతోంది మైత్రేయ. పోరాటాలంటే ఇష్టం ఢిల్లీకి చెందిన మెహర్ జీత్ కౌర్ బీఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తి చేశారు. ఆది నుంచీ మెహర్‌కి మిలటరీ బలగాలు చేసే పోరాటాలంటే మక్కువ. దీంతో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్... ఏదో ఒకదాంట్లో చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏఎఫ్ఏలో శిక్షణలో ప్రతిభ చూపించి ఫైటర్ జెట్ పైలట్‌గా ఎంపికయ్యారు. ‘జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వెనక్కు రాకూడదు. మహిళలు ఈ విషయంలో మరింత పట్టుదలతో ఉండాలి. ఏ సాయుధ బలగంలో అయినా అతివలు దూసుకుపోగలరని గుర్తుంచుకోండి. బీదర్ లో అదనపు శిక్షణ అనంతరం విధుల్లో చేరుతా’ అని పేర్కొన్నారు. నావిగేటర్.. మా నాన్న గుర్దీప్ సింగ్ గుర్దాస్పూర్ సిటీ పోలీసు విభాగంలో అసిస్టెంట్ సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. తాత గురుబచన్ సింగ్ ఆర్మీలో పని చేసి పదవీ విరమణ పొందారు. వారు ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఈ స్థాయికి చేర్చింది. పంజాబ్‌లోని గుర్దాస్పూర్ నుంచే పన్నెండో తరగతి పూర్తి చేశాను. 2016లో భారత వాయుసేనలోకి ముగ్గురు మహిళా ఫైటర్లు తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన వార్త చూసి వారి బాటలోనే నడవాలనుకున్నాను. ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లి ఏఎఫ్ఏలో శిక్షణ పూర్తి చేసుకుని, నావిగేటర్‌గా ఎంపికయ్యాను. – కోమల్ ప్రీత్ కౌర్, పంజాబ్ కఠినమైన శిక్షణ ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో శిక్షణ ఎంతో కఠినంగా ఉంటుంది. ఇక్కడ శిక్షణ పొందే ప్రతి ఒక్కరూ నెవర్ గివిట్ అప్ ధోరణిలోనే ఉంటారు. స్త్రీ, పురుష తేడాలు ఉండవు. ప్రతి ఒక్కరూ విధుల్లో ఉన్నట్టుగానే శిక్షణలో పాల్గొనాలి. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, త్యాగాల కారణంగానే ఈ స్థాయికి చేరా. 12వ తరగతి వరకు సైన్స్ చదివినా డిగ్రీ మాత్రం ఆర్ట్స్‌లో పూర్తి చేశాను. నా తండ్రి రణ్‌బీర్ సింగ్ ఢిల్లీ కేంద్రంగా టెరిటోరియర్ ఆర్మీలో పని చేస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత హోదా అయిన సుబేదార్ మేజర్‌గా పని చేస్తున్నారు. ఆర్మీ జీవితాన్ని వారి ద్వారా ఇప్పటికే చూశాను. అందుకే వైమానిక దళాన్ని ఎంపిక చేసుకున్నా. ఎదగాలి, ఎగరాలనే కోరిక బలంగా ఉంది. – సహజ్ప్రీత్ కౌర్, అమృత్సర్ ఈ శిక్షణలో పాల్గొన్న కోమల్‌ప్రీత్‌కౌర్, సహజ్ప్రీత్కౌర్లు కూడా తమ శిక్షణ అనుభవాలను పంచుకున్నారు. – శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో, హైదరాబాద్ -
Indian Women Pilots: ఆకాశమే ఆమె హద్దు..
మహిళల భాగస్వామ్యానికి సంబంధించి మిగిలిన రంగాల పరిస్థితి ఎలా ఉన్నా.. విమానయాన రంగంలోని పైలట్ల విషయంలో మాత్రం ప్రపంచంలో భారతే నంబర్ వన్ అట. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ వుమెన్ ఎయిర్‌లైన్ పైలట్స్ విడుదల చేసిన గణాంకాల(2021) ప్రకారం.. దేశంలోని వివిధ ఎయిర్‌లైన్స్ పైలట్లలో 12.4 శాతం మహిళలే. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ స్థాయిలో వారి ప్రాతినిధ్యం లేదు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్త సగటు 5.8 శాతం మాత్రమే. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలైతే.. ప్రపంచ సగటు కన్నా కిందనే ఉండటం గమనార్హం. కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో మహిళా పైలట్ల భర్తీ గణనీయంగా పెరిగిందని బ్లూంబర్గ్ మీడియా తెలిపింది. -
Women In Aviation: యూఎస్, యూకే కంటే మన దేశంలోనే అధికం!
ప్రపంచంలోని అగ్రదేశాలతో పోల్చితే మన దేశంలో మహిళా పైలట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సంఖ్యాపరంగానే కాదు... పనితీరు, ప్రతిభ విషయంలోనూ ఇతర దేశాలకు స్ఫూర్తి ఇస్తున్నారు... మూడు దశాబ్దాల వెనక్కి వెళితే... వైమానికరంగంలోకి నివేదిత భాసిన్ పైలట్‌గా అడుగు పెట్టినప్పుడు ఆమె ప్రయాణం అంత సజావుగా సాగలేదు. అడుగడుగునా అహంకారపూరిత అనుమానాలు ఎదురయ్యాయి. అయితే అవేమీ తన ప్రయాణానికి అడ్డుకాలేకపోయాయి. ‘మహిళలు విమానం నడపడం ఏమిటి!’ అనే అకారణ భయం, ఆందోళన ప్రయాణికులలో కనిపించేది. అయితే ఇప్పుడు ఆ దృశ్యం పూర్తిగా మారిపోయింది. ‘వైమానిక రంగంలో మహిళలు’ అనే అంశం ముందుకు వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు మన దేశం వైపే చూస్తున్నాయి. మన దేశంలోని స్ఫూర్తిదాయకమైన మహిళా పైలట్ల గురించి ప్రస్తావిస్తున్నాయి. తాజాగా... ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఉమెన్ ఎయిర్‌లైన్స్ పైలట్’ గణాంకాల ప్రకారం ప్రపంచంలోని ఎన్నో దేశాలతో పోల్చితే మన దేశంలో మహిళా పైలట్(కమర్షియల్, ఎయిర్‌ఫోర్స్)లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఉదా: యూఎస్–5.5 శాతం యూకే–4.7 శాతం ఇండియా–12.4 శాతం.. ‘సంస్థల ఆలోచన తీరులో మార్పు రావడం, స్ఫూర్తిదాయకమైన మహిళా పైలట్లు, కుటుంబ సభ్యుల మద్దతు, ఔట్రీచ్ ప్రోగ్రామ్స్, సోషల్ మీడియా... ఎలా ఎన్నో కారణాల వల్ల మన దేశంలో మహిళా పైలట్ల సంఖ్య పెరుగుతుంది. మహిళలు వైమానిక రంగంలో రాణించడానికి అనుకూలమైన వాతావరణం ఇప్పుడు బాగా కనిపిస్తుంది’ అంటుంది ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చిన నివేదిత భాసిన్. నిజానికి వైమానికరంగంలో మహిళల ఆసక్తి నిన్నా మొన్నటిది కాదు. వెనక్కి వెళితే... 1948లో ఏర్పాటైన యూత్ ప్రొగ్రామ్ ‘నేషనల్ క్యాడెట్స్ కాప్స్ ఎయిర్ వింగ్’ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపడంలో శిక్షణ ఇచ్చేది. మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. కొన్ని రాష్ట్రప్రభుత్వాలు, హోండా మోటర్లాంటి సంస్థలు శిక్షణ తీసుకునేవారికి ఆర్థిక సహాయం చేసేవి. వర్తమానానికి వస్తే... ఇండిగోలాంటి విమాన సంస్థలు మహిళా పైలట్లకు సంబంధించిన సదుపాయాలు, సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ప్రత్యేక సందర్భాలలో వెసులుబాటు ఇస్తున్నాయి. పికప్, డ్రాప్ కోసం గార్డ్‌తో కూడిన వాహన సౌకర్యం కలిగిస్తున్నాయి. విధి నిర్వహణలో తమను ముందుకు నడిపిస్తున్నది ‘కుటుంబ మద్దతు’ అంటున్నారు మహిళా పైలట్లు. జోయా అగర్వాల్ పైలట్ కావడానికి మొదట్లో తల్లిదండ్రులు సుముఖంగా లేరు. అయితే కూతురు పట్టుదల చూసి పచ్చజెండా ఊపారు. వైమానికరంగ చరిత్రలో జోయా సాధిస్తున్న విజయాలు వారికి గర్వకారణంగా నిలుస్తున్నాయి. చిన్నవయసులోనే బోయింగ్ విమానాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యపరిచిన జోయా నలుగురు మహిళా పైలట్లను తోడుగా తీసుకొని పదిహేడుగంటల పాటు ఉత్తరధృవం మీదుగా విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది. ‘కల కనడం ఒక్కటే కాదు ఆ కలను నిజం చేసుకోవడానికి ధైర్యంగా ముందడుగు వేయాలి. ప్రతికూలతల గురించి ఆలోచించవద్దు. విజయాలు అందించడానికి ఈ ప్రపంచమే మీకు తోడుగా ఉంటుంది’ అంటుంది జోయా అగర్వాల్. జోయాలాంటి ప్రతిభ, సాహనం మూర్తీభవించిన మహిళల వల్లే ఇప్పుడు ప్రపంచ వైమానికరంగ చరిత్రలో భారతీయ మహిళా పైలట్లకు ప్రశంసనీయమై, స్ఫూర్తిదాయకమైన ప్రత్యేకత ఏర్పడింది. చదవండి: Vidya Nambirajan: తండ్రి వారసురాలు.. ‘మా నాన్న కోసమే ఈ గ్యారేజ్‌లోకి వచ్చాను’ -
Women In Aviation: అమ్మాయిలకు ఈ విషయాలు ఎవరు చెప్తారు? అందుకే..
పదేళ్ల పాపాయి వర్షం కురిస్తే నాన్న చేత కాగితంతో పడవలు చేయించుకుని నీటిలో వదులుతూ మురిసిపోతుంది. వర్షం రాని రోజు కాగితంతో విమానాన్ని చేసే ఏటవాలుగా గాల్లోకి విసురుతుంది. ఎండాకాలం సెలవులు వచ్చాయంటే చాలు... జరిగిపోయిన క్లాసు నోట్‌బుక్‌ల పేజీలన్నీ గాల్లోకి ఎరిగే విమానాలయిపోతాయి. మరి ఈ అమ్మాయిల్లో ఎంతమంది విమానయాన రంగంలో అడుగుపెడుతున్నారు? కాగితంతో విమానం చేయడం నేర్పించిన నాన్న విమానయానరంగం గురించి చెప్పడెందుకు? ఇక అమ్మకైతే ఒకటే భయం. మహిళాపైలట్లు, ఎయిర్ హోస్టెస్‌ల జీవితాల మీద వచ్చిన సినిమాలే గుర్తు వస్తాయామెకి. ఏవియేషన్ ఫీల్డ్‌లో ఆడపిల్లలు అనగానే పైలట్, ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగాలు తప్ప మరో ఉద్యోగాలుంటాయని కూడా పాతికేళ్ల కిందటి తల్లి ఊహకందకపోయి ఉండవచ్చు. ఇక అమ్మాయిలకు ఎవరు చెప్తారు? విమానం ఎగరాలంటే రకరకాల విభాగాలు పని చేస్తాయని, ముప్పైరకాల విభాగాలు మహిళలకు అనువైన విభాగాలున్నాయని చెప్పేది ఎవరు? మనకు చదువులంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్)లే అనే ఒక పరదాలోపల జీవిస్తున్నామని తల్లిదండ్రులకు ఎవరు చెప్పాలి? మెటలర్జీ చదివితే విమానరంగంలో ఉద్యోగం చేయవచ్చని చెప్పగలిగిన వాళ్లే లేకపోతే పిల్లలు ఆ చదువుల వైపు ఎలా వెళ్లగలుగుతారు. ఆకాశంలో ఎగిరే విమానాన్ని నియంత్రించే విభాగం నేలమీద ఉంటుందని, ఆ పనిని మహిళలు సమర్థవంతం గా నిర్వహిస్తున్నారని తెలిస్తే కదా... ఆడపిల్లలు ఆయా రంగాల్లో కెరీర్ కలలు కనేది. కనీసం కలలు కనడానికి తగినంత సమాచారం కూడా వాళ్ల దగ్గర లేకపోతే ఇక కలను నిజం చేసుకుంటారని ఎలా ఆశించాలి? ఇన్ని ప్రశ్నలు తలెత్తిన తర్వాత రాధా భాటియా ఆ ప్రశ్నలన్నింటికీ తనే సమాధానం కావాలనుకుంది. బర్డ్ అకాడమీ ద్వారా కొత్తతరాన్ని చైతన్యవంతం చేస్తోంది. పాతికేళ్ల కిందట ఆమె మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ద్వారా యాభైవేల మందికి పైగా అమ్మాయిలు ఆకాశంలో కెరీర్‌ను నిర్మించుకున్నారు. ఆకాశాన్ని నియంత్రించే శక్తిగా భూమ్మీద నిలిచారు. ప్రోత్సాహం చాలదు! దారి చూపించాలి!! బర్డ్ అకాడమీ బాధ్యతకు ముందు రాధా భాటియా స్కూల్ టీచర్. ఓ సారి స్కూల్లో వర్క్‌షాప్ సందర్భంగా ఎనిమిది, తొమ్మిది తరగతుల పిల్లలను పెద్దయిన తర్వాత ఏమవుతారని అడిగినప్పుడు ఒక్కరు కూడా ఏవియేషన్ గురించి చెప్పలేదు. అందరూ చదువంటే డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్... వంటివే చెబుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలైతే టీచర్, డాక్టర్ల దగ్గరే ఆగిపోయారు. పిల్లలకు తెలిసిన రంగాలకంటే తెలియని రంగాలే ఎక్కువగా ఉన్నాయనిపించింది భాటియాకి. మహిళను అవనిలో సగం, ఆకాశంలో సగం అని చెప్పే మోటివేట్ స్పీకర్లు, కథకులు ప్రోత్సహించడంతో తమ బాధ్యత పూర్తయిందనుకుంటున్నారు. అంతేతప్ప ఒక మార్గాన్ని సూచించే ప్రయత్నం జరగడం లేదని తెలిసింది అందుకే ఆ పని తనే∙మొదలు పెట్టారామె. అప్పటివరకు బర్డ్ అనేది ట్రావెల్ అండ్ టూరిజమ్, ఎయిర్‌ఫేర్ అండ్ టికెటింగ్, పాసెంబజర్ అండ్ బ్యాగేజ్ హ్యాండిలింగ్, ఎయిర్ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ హ్యాండిలింగ్, డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్ అండ్ కన్సెల్టెంట్ వంటి సర్టిఫికేట్ కోర్సులు, డిప్లమో కోర్సుల్లో శిక్షణ ఇచ్చే సంస్థ. ఆ తర్వాత దాదాపుగా ముప్పైవిభాగాల్లో శిక్షణ ఇచ్చేటట్లు మెరుగుపరిచారు రాధాభాటియా. ఈ సంస్థ ద్వారా బాలికల్లో ఏవియేషన్ పట్ల చైతన్యం కలిగించడంతోపాటు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో బర్డ్ సంస్థ నుంచి ఏడాదికి మూడు వేల మందికి శిక్షణ ఇస్తున్నారు. ఏవియేషన్ రంగంలో విజయవంతంగా కెరీర్‌ను అభివృద్ధి చేసుకున్న మహిళలు కొత్తతరానికి మార్గదర్శనం చేస్తున్నారు. బర్డ్ కార్పొరేట్ ఆఫీస్ ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని కన్నాట్ హౌస్‌లో ఉంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కొచ్చిలలో శిక్షణ విభాగాలున్నాయి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి కల గనడానికి కూడా సాధ్యం కాని విమానయాన రంగం అమ్మాయిల కళ్ల ముందు వాలింది. ఒకప్పుడు గగన కుసుమంగా ఉన్న ఈ రంగం ఇప్పుడు స్నేహహస్తం చాచింది. అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఇక అమ్మాయిల వంతు. ఇన్ని ఉద్యోగాలా! విమానయాన రంగంలో పైలట్, ఎయిర్‌లైన్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ విభాగం, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్, టెక్నీషియన్, ఫ్లైట్ అటెండెంట్, క్యాబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్, కమర్షియల్ మార్కెటింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫ్లైట్ డిస్పాచర్, ఎయిర్ స్టేషన్ ఏజెంట్, పాసింజర్ సర్వీస్ ఏజెంట్, రాంప్ స్కిప్పర్ అండ్ ఎగ్జిక్యూటివ్, ఏవియేషన్ మెటలర్జిస్ట్, క్రూ షెడ్యూల్ కో ఆర్డినేటర్, ఎయిర్ టికెట్ ఏజెంట్, మీట్ అండ్ గ్రీట్ ఏజెంట్, ఏవియేషన్ డాక్టర్, ఏవియేషన్ సైకాలజిస్ట్, ఏవియేషన్ ఆటార్నీ, సీఆర్ఎమ్ ఎగ్జిక్యూటివ్, క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్, ఎయిర్‌లైన్స్ ఫుడ్ సర్వీసెస్, సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్... ఇన్ని రకాల ఉద్యోగాలుంటాయి. ఇవన్నీ మహిళలు చేయడానికి అనువైన ఉద్యోగాలే. హైదరాబాద్‌లో ఈ నెల చివరి వారంలో నాలుగు రోజుల పాటు జరిగిన వింగ్స్ ఇండియా 2022లో భాగంగా ఏవియేషన్ రంగంలో ఉద్యోగాల పట్ల బాలికలు, యువతులకు అవగాహన కల్పించడానికి హైదరాబాద్‌కి వచ్చింది బర్డ్ అకాడమీ. -రాధా భాటియా బాలికల విమానయానం ఉమన్ ఇన్ ఏవియేషన్ ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా ఇండియా విభాగాన్ని 2016లో ప్రారంభించారు. కెరీర్ చాయిస్ ఎంతలా ఉందో వివరించడానికి, కొత్త తరాన్ని చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించిన అనుబంధ విభాగం ఇది. ఉమెన్ ఇన్ ఏవియేషన్ 2015 నుంచి ఏటా ‘గర్ల్స్ ఇన్ ఏవియేషన్ డే (జిఐఏడి)’ నిర్వహిస్తోంది. మొదటి ఏడాది 32 ఈవెంట్లలో 3,200 మంది పాల్గొన్నారు. 2019 నాటికి జిఐఏడిలో 18 దేశాల నుంచి ఇరవై వేలకు పైగా పాల్గొన్నారు. 119 ఈవెంట్లు జరిగాయి. 2020లో ‘ఏవియేషన్ ఫర్ గర్ల్స్’ యాప్ రూపొందించింది. 60 దేశాల నుంచి వేలాది మంది అమ్మాయిలు ఈ యాప్ ద్వారా వేడుకల్లో పాల్గొన్నారు. 2022లో సెప్టెంబర్ 24వ తేదీన జరగనుంది. – వాకా మంజులారెడ్డి -
గగనంలో ఘన చరిత్ర
సాక్షి బెంగళూరు: పూర్తిగా మహిళా పైలట్ల సారథ్యంలోనే అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సుదీర్ఘ ప్రయాణం తర్వాత బెంగళూరుకు చేరుకుంది. తద్వారా వారు సరికొత్త చరిత్ర లిఖించారు. కెప్టెన్ జోయా అగర్వాల్, కెప్టెన్ పాపగారి తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష సోనావరే, కెప్టెన్ శివానీ మన్హాస్ అనే నలుగురు పైలట్లు ఈ విమానాన్ని విజయవంతంగా నడిపించారు. సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు. పాపగారి తన్మయి తెలుగు యువతి కావడం విశేషం. విమానం శాన్ఫ్రాన్సిస్కోలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30 గంటలకు బయలుదేరింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అత్యంత క్లిష్టమైన ఉత్తర ధ్రువం గుండా ఎక్కడా ఆగకుండా(నాన్‌స్టాప్) ప్రయాణించి బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ల్యాండయ్యింది. మొత్తం 13,993 కిలోమీటర్ల దూరాన్ని 17 గంటల్లో అధిగమించింది. మహిళలకు సాధ్యం కానిది ఏదీ లేదు పూర్తిగా మహిళా పైలట్లతోనే ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపి చరిత్ర సృష్టించామని పైలట్ జోయా అగర్వాల్ అన్నారు. ఈ మార్గంలో ప్రయాణం ద్వారా 10 టన్నుల ఇంధనాన్ని ఆదా చేసినట్లు పేర్కొన్నారు. మహిళలకు సాధ్యం కానిది ఏదీ లేదని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు చేరుకున్న విమానం -
నార్త్‌పోల్ మీదుగా..!
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన మహిళా పైలట్ల బృందం చరిత్ర సృష్టించనుంది. బోయింగ్ 777 విమానంలో సాన్ ఫ్రాన్సిస్కో నుంచి ప్రారంభమై ఉత్తర ధృవం మీదుగా అత్యంత సుదూర వైమానిక మార్గంలో ప్రయాణించి నేడు(జనవరి 9)న బెంగళూరు చేరుకోనుంది. ఈ ప్రయాణంలో మొత్తం 16 వేల కిలోమీటర్లు ఈ బృందం పయనిస్తుంది. ఉత్తర ధృవం మీదుగా విమానాన్ని నడపడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయం. ఈ మార్గంలో వైమానిక సంస్థలు సహజంగా ఎంతో అనుభవం ఉన్న, అత్యుత్తమ పైలట్లనే పంపుతారు. ఈ సారి ఎయిర్ఇండియా ఈ బాధ్యతను ఒక మహిళా పైలట్‌కు అప్పగించింది. ఈ విమానాన్ని ఎయిర్ ఇండియా మహిళా కెప్టెన్ జోయా అగర్వాల్ నాయకత్వంలోని మహిళా పైలట్ల బృందం నడుపుతోంది. ‘పౌర విమానయాన శాఖ, ఎయిర్ ఇండియా నాపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఉత్తర ధృవం మీదుగా అత్యంత సుదూర మార్గంలో బోయింగ్ 777 విమానాన్ని నడిపే అద్భుత అవకాశం నాకు లభించింది’అని జోయా అగర్వాల్ పేర్కొన్నారు. తన్మయి పాపగిరి, ఆకాంక్ష సోనావానే, శివానీ మన్హాస్ వంటి అత్యంత అనుభవజ్ఞులైన మహిళా పైలట్ల బృందం తనకు సహకరిస్తోందని తెలిపారు. -
అవని మోహన భావన విజయం
ముదితల్ నేర్వగ రాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్... చాలా పాతకాలపు మాటే. కానీ... ఈ కాలంలో అది వాళ్లను కించపరచడమే! అవకాశం దొరకాలేగానీ.. మహిళలు రాణించని రంగమంటూ లేదనేందుకు చరిత్రే సాక్ష్యం! ఓ ఇందిరాగాంధీ.. ఇంకో సునీతా విలియమ్స్.. మరో ఇంద్ర నూయీ! ఒకటా రెండా.. చెప్పుకుంటూ పోతే స్త్రీ శక్తి విజయాలకు తార్కాణాలు కోకొల్లలు! తాజా ఉదాహరణలు కావాలా... అవని.. మోహన... భావనల జైత్రయాత్ర చూడండి!!! హైదరాబాద్ శివార్లలోని హకీంపేట్... ఆకాశంలో రయ్యి రయ్యి మంటూ విమానాలు దూసుకెళుతున్నాయి!! ఆకాశంలో సగమే కాదూ... అంతా మాదేనన్న ఆత్మవిశ్వాసంతో.. ఈ ముగ్గురు మూలపుటమ్మలు ముందడుగేశారు!! అభినందన్ వర్ధమాన్ నడిపిన మిగ్ – 21 బైసన్.. ధ్వనివేగంతో పోటీపడే సుఖోయ్–ఎంకే21, మిరాజ్ –2000లనూ అలవోకగా చక్కర్లు కొట్టిస్తున్నారు! ఇంకో కొన్ని నెలలు గడిస్తే.. పుల్వామా తరహా ఉగ్రదాడులకు దీటైన సమాధానం చెప్పే వాయుసేనలో అవనీ చతుర్వేదీ, భావనా కాంత్, మోహన సింగ్‌లు ఉన్నా ఆశ్చర్యపోవద్దు! దశాబ్దాల నిషేధాలు, ఆంక్షలను తోసిరాజంటూ 2016లో అవని చతుర్వేది భారతీయ వాయుసేనలో తొలి యుద్ధవిమాన పైలట్‌గా చరిత్ర సృష్టించగా.. ఆ తరువాత కొద్ది కాలానికే భావనా కంఠ్... మోహన సింగ్‌లు చేరారు. ప్రస్తుతం ఈ ముగ్గురు వీర వనితలు హకీంపేటలోని వాయుసేన శిక్షణ కేంద్రంలో తమ నైపుణ్యాలకు తుదిమెరుగులు దిద్దుకుంటున్నారు. ఇప్పటికే పలు యుద్ధవిమానాలను నడపడంలో సిద్ధహస్తులైన ఈ ముగ్గురు ఎప్పుడెప్పుడు సుఖోయ్, మిరాజ్ కాక్పిట్లలోకి చేరిపోయి.. భారతీయ మహిళల సత్తాను ఆకాశానికి చేర్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. భారత త్రివిధ దళాల్లో మహిళల పాత్ర ఏమిటన్నది ఒక్కసారి చూసుకుంటే కొంచెం నిరాశ ఆవహించక మానదు. ఆర్మీ, నేవీల్లో ఇప్పటికే మహిళల ప్రమేయం కేవలం వైద్య, దంత సేవలకు పరిమితం కాగా.. ఒక్క వాయుసేనలో మాత్రం 13 శాతం మహిళలు పనిచేస్తున్నారు. మూడు రక్షణ దళాలను పరిగణనలోకి తీసుకున్నా సరే.. మహిళల శాతం చాలా తక్కువ. వైద్య, దంత సేవల్లో 21.63, 20.75 శాతం మహిళలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. యుద్ధరంగంలో తుపాకీ పట్టేందుకూ మహిళకు అవకాశమివ్వాలన్న వాదన చాలాకాలంగా నడుస్తున్నా.. 2015 అక్టోబరులో ఇందుకు అనుమతిస్తూ భారతీయ వాయుసేన చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్‌లో ఉండే ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఉన్న మొత్తం 120 మంది కేడెట్ల నుంచి యుద్ధవిమానాల శిక్షణ కోసం 37 మందిని ఎంపిక చేయగా.. కఠినాతి కఠినమైన పరీక్షలకు ఓర్చి ఈ ముగ్గురు తుదిజాబితాలో స్థానం సంపాదించుకున్నారు. మిగిలిన వారిలోనూ ముగ్గురు మహిళలు ఉండగా.. వారిని హెలికాప్టర్, రవాణా విమానాలు నడిపేందుకు సిద్ధం చేస్తున్నారు. అవని చతుర్వేది ఫ్లైట్ లెఫ్టినెంట్ పుట్టింది: అక్టోబరు 27, 1993 కుటుంబం: తండ్రి దినకర్ చతుర్వేది మధ్యప్రదేశ్ నీటివనరుల విభాగంలో ఇంజినీర్. తల్లి గృహిణి, అవని అన్న కూడా ఆర్మీలోనే పనిచేస్తున్నారు. విద్య: షాడోల్ జిల్లాలోని డియోలాంగ్లో పాఠశాల విద్య, రాజస్తాన్‌లోని బనస్థలి విశ్వవిద్యాలయం నుంచి బీటెక్. ఘనతలు: సూరత్‌గఢ్‌లోని వాయుసేన 23వ స్క్వాడ్రన్‌లో చేరారు. మిగ్ –21 బైసన్‌ను నడిపిన తొలి మహిళా పైలట్. ఇష్టాఇష్టాలు: చదరంగం, టేబుల్ టెన్నిస్లపై మక్కువ ఎక్కువ. స్ఫూర్తి: అన్నే. కాలేజీ ఫ్లైయింగ్ క్లబ్లో చిన్నసైజు విమానాలను నడిపిన అనుభవమూ ఉంది. ఏ వాయుసేనకైనా అందులోని యోధులే కీలకం. యుద్ధవిమాన పైలట్ కావాలన్నది నా కల. ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధవిమానాలను నడపాలని.. ప్రతిరోజూ కొత్తకొత్త విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటున్నా. – అవని చతుర్వేది భావన కంఠ్ ఫ్లయింగ్ ఆఫీసర్ పుట్టింది: 1992, బిహార్‌లోని దర్భంగ జిల్లాలో కుటుంబం: తండ్రి తేజ్ నారాయణ్ కంఠ్.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్. విద్య: రాజస్తాన్‌లోని కోటలో ఇంజినీరింగ్ ఎంట్రన్స్ శిక్షణ పొందారు. మహిళలకు అనుమతి లేకపోవడంతో అప్పట్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్ష రాయలేకపోయారు. బెంగళూరులోని బీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెడికల్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ చదివారు. యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలో ఎంపికై వాయుసేనలో చేరారు. తొలిదశ శిక్షణలో భాగంగా యుద్ధవిమానాలు నడిపేందుకు ఎంపికయ్యారు. ఘనతలు: అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే మక్కువ ఎక్కువ. వాయుసేనలో రెండో దశ శిక్షణలో భాగంగా హకీంపేటలోని శిక్షణ కేంద్రంలో కిరణ్ విమానాలను నడిపారు. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్న అనుభవమూ భావన కంఠ్ సొంతం. మోహన సింగ్ ఫ్లైట్ ఆఫీసర్ పుట్టింది: రాజస్తాన్‌లోని ఝున్ఝును జిల్లాలో. కుటుంబం: తండ్రి వాయుసేనలోనే వారంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తాత లాడూ రామ్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్లో ఫ్లైట్ గన్నర్. 1948 భారత్ – పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. వీర్ చక్ర అవార్డు గ్రహీత కూడా. విద్య: అమృత్‌సర్‌లోని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో గ్రాడ్యుయేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ చేశారు. 2013లో 83.7 శాతం మార్కులతో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఘనతలు: తండ్రి ప్రతాప్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్న చోటే ట్రెయినీ కేడెట్‌గా చేరడం. -
ఆకాశమంత.. సాహసం!
ఆమె ఆకాశంలో సగం.. సాహసంతో సావాసం..అవకాశాలను అందిపుచ్చుకుంటూ పైలట్లుగా రాణిస్తున్న మహిళలు..మహిళా పైలట్లలో భారత్ నంబర్ వన్ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా మహిళా పైలట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఎక్కువ మంది మహిళా పైలట్లు ఉన్న దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. దేశంలోని మొత్తం 8,797 మంది పైలట్లలో మహిళల సంఖ్య 1,092 (12.4%) మందికి చేరింది. వీరిలో 355 మంది కెప్టెన్లు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ విమెన్ ఎయిర్‌లైన్ పైలట్స్ (ఇస్వాప్) ఇటీవల ఈ గణాంకాలు వెలువరించింది. వీటి ప్రకారం.. మహిళా పైలట్ల ప్రపంచ సగటు 5.4% మాత్రమే. ఇండిగోలోని మొత్తం 2,689 మంది పైలట్లలో 351 మంది (13.9%) మహిళలు. జెట్ ఎయిర్‌వేస్‌లోని 1,867 మందిలో 231 మంది మహిళా పైలట్లే (12.4%). 853 మంది పైలట్లు వున్న స్పైస్ జెట్ (113మంది – 13.2%), 1710 మంది పైలట్లు ఉన్న ఎయిర్ ఇండియాలో (217–12.7%) కూడా మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. ఢిల్లీకి చెందిన ‘జూమ్ ఎయిర్’అత్యధిక మహిళా పైలట్లకు ఉద్యోగాలిచ్చింది. ఇక్కడ పని చేసే మొత్తం 30 మంది పైలట్లలో 9 మంది మహిళ లు. అమెరికాలో మహిళా పైలట్ల సంఖ్య ప్రపంచ సగటు కంటే తక్కువే (4.4%). అమెరికాలోని యు నైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో అత్యధికంగా 7.5% మంది, డెల్టాలో 4.7% మంది మహిళా పైలట్లు పని చేస్తున్నారు. యూకేలో 4.77% మహిళా పైలట్లే ఉన్నారు. భారత్.. బిగ్ మార్కెట్ మధ్య తరగతి అంతకంతకు పెరుగుతున్న భారతదేశంలో విమాన ప్రయాణాలూ పెరుగుతాయని బోయింగ్ కంపెనీ వెలువరించిన కమర్షియల్ మార్కెట్ అవుట్ లుక్ రిపోర్ట్– (2018– 2037) చెబుతోంది. రానున్న 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 7,90,000 మంది పైలట్లు అవసరమని ఆ కంపెనీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పైలట్ల కొరత ఏర్పడే పరిస్థితి ఉన్నందున భారతీయ కంపెనీలు మహిళల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయని అంటోంది ఇస్వాప్. సమాన వేతనాలు స్త్రీ పురుషుల మధ్య వేతన వ్యత్యాసాలు లేని రంగాలు అరుదే. అలాంటి వాటిలో విమానయాన రంగమొకటి. ఇండిగో కంపెనీ పిల్లలున్న తల్లిదండ్రులకు డే కేర్ సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు గర్భిణులకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తోంది. మెటర్నిటీ లీవ్ విధానాన్ని తప్పనిసరి చేసింది. ‘నిర్భయ’ఘటన తర్వాత ఎయిర్‌లైన్ కంపెనీలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. రాత్రి ఆరు– తెల్లవారు జాము ఆరు గంటల మధ్య మహిళా పైలట్లను ఇళ్ల నుంచి స్వయంగా తీసుకెళ్లడం.. తిరిగి దిగబెట్టడంతో పాటు, బాడీ గార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇది సురక్షిత ఉద్యోగమని, ఇతర చోట్ల కంటే మహిళలను ఇక్కడ మరింత భద్రంగా చూసుకుంటారని జెట్ ఎయిర్వేస్ సీనియర్ ట్రైనర్ శ్వేతా సింగ్ చెప్పారు. ప్రస్తుతం విమానయాన మార్కెట్ మంచి ఊపు మీద ఉందని, అక్కడ సులువుగా పని దొరుకుతుందని అంటున్నారు ఇండిగో పైలట్ రూపీందర్ కౌర్. సాహసమే శ్వాసగా.. అనుపమ కోహ్లీ.. ఎయిర్ ఇండియా కెప్టెన్. గత ఫిబ్రవరిలో ఆమె కనబరచిన సమయస్ఫూర్తి పెద్ద ప్రమాదాన్ని తప్పించగలిగింది. ఆమె నడుపుతున్న ఎయిర్ ఇండియా 631 విమానం.. విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానం అతి సమీపంలో ఎదురెదురుగా వచ్చాయి. పైలట్లను హెచ్చరిస్తూ ఆటోమేటిక్ వార్నింగ్‌లు వెలువడ్డాయి. అనుపమ రెజల్యూషన్ అడ్వయిజరీ సూచనల మేరకు క్షణాల్లో అప్రమత్తమై విమానాన్ని ఎత్తుకు తీసుకెళ్లడం ద్వారా భారీ ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. ‘ఎయిర్ ఇండియా’సహా పలువురి అభినందనలందుకున్నారు. ఆ సమయంలో విస్తారాలో 152 మంది, ఎయిర్ ఇండియా విమానంలో 109 మంది ప్రయాణిస్తున్నారు. -
భారత యుద్ధ విమానాల పైలట్లుగా మహిళలు
న్యూఢిల్లీ: విమాన, హెలికాప్టర్ల పైలట్లుగా సేవలందిస్తున్న మహిళలు.. ఇక యుద్ధ రంగంలో కదంతొక్కబోతున్నారు. భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్లుగా మహిళలను నియమించనున్నారు. శనివారం రక్షణ మంత్రిత్వ శాఖ ఇందుకు ఆమోద ముద్ర వేసింది. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మహిళా పైలట్లను యుద్ధ విమానాల పైలట్లుగా ఎంపిక చేయనున్నారు. 2016 జూన్‌లో తొలి బ్యాచ్‌ను ఎంపిక చేస్తారని, ఆ తర్వాత ఏడాది పాటు వారికి శిక్షణ ఇస్తారని, 2017 జూన్ నుంచి యుద్ధ విమానాల పైలట్లుగా మహిళలు సేవలు అందిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం పేర్కొంది. 'రవాణ విమాన, హెలికాప్టర్ పైలట్లుగా మహిళలు పనిచేస్తున్నారు. ఆసక్తిగల యువతులను ఫైటర్ పైలట్లుగా నియమించాలని భావిస్తున్నాం' అని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా ఇటీవల చెప్పారు. ఎయిర్ ఫోర్స్ పంపిన ప్రతిపాదనను తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. -
యుద్ధవిమానాలకు త్వరలో మహిళా పైలట్లు
గయ: భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) యుద్ధవిమానాలకు త్వరలో మహిళలను పైలట్లుగా నియమించే అవకాశం ఉందని వైమానిక దళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా చెప్పారు. గయలో శనివారం రహా మాట్లాడుతూ, వైమానిక దళంలోని అన్ని విభాగాల్లో మహిళలు ఇప్పటికే పనిచేస్తున్నారని, భవిష్యత్తులో వారిని యుద్ధవిమానాల పైలట్లుగా నియమించే అవకాశం ఉందని అన్నారు. యుద్ధవిమానాల పైలట్లుగా మహిళలకు తగిన శారీరక అర్హతలేదని, ప్రత్యేకించి గర్భిణీలుగా ఉన్నపుడు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు వారు ఇబ్బంది పడతారని అరూప్ రహా ఈ ఏడాది ప్రారంభంలో అన్నారు. అయితే ఆయన తాజాగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.