మెహర్ జీత్ కౌర్, మైత్రేనిగమ్, కోమల్ ప్రీత్ కౌర్, సహజ్‌ప్రీత్ కౌర్
పోరాటాలంటే మక్కువ ఉన్నవారు ఏ సవాల్‌నైనా ఇట్టే అధిగమిస్తారు. ఫైటర్ జెట్ పైలెట్‌గా ఎంపికైన మైత్రేయ నిగమ్, మెహర్ జీత్ కౌర్‌లను చూస్తే ఆ మాట నూటికి నూరుపాళ్లు నిజం అంటారు.
22 మంది మహిళల్లో ఫైటర్లుగా ఎంపికైన వీరి ప్రతిభ, కృషి నవతరానికి స్ఫూర్తి.
హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో (ఏఎఫ్‌ఏ) జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ అది. వాయుసేనలో ఉన్న ఖాళీలు, శిక్షణ సమయంలో అభ్యర్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా వారిని ఫైటర్లుగా ఎంపిక చేస్తారు. మొత్తం 164 మంది శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ ఆఫీసర్లు పట్టాలు పొందారు. వీరిలో 22 మంది మహిళలు ఉండగా మైత్రేయ నిగమ్, మెహర్ జీత్ కౌర్‌లు ఫైటర్ జెట్ పైలట్లుగా నిలిచారు. మైత్రేయ నిగమ్ ఆమె కుటుంబంలో మూడో తరం ఫైటర్.
వదలని కృషి
గ్రూప్ కెప్టెన్‌గా పదవీ విరమణ పొందిన పీకే నిగమ్ ప్రస్తుతం ఏవియేషన్ డొమైన్ సంస్థలో పని చేస్తుండగా, ఆయన కుమారుడు అమిత్ నిగమ్ వింగ్ కమాండర్ హోదాలో రిటైర్ అయి ఇండిగో విమానయాన సంస్థలో సీనియర్ కెప్టెన్‌గా పని చేస్తున్నారు. మైత్రేయ నిగమ్ ఢిల్లీలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో విద్యనభ్యసించారు. అహ్మదాబాద్‌లోని ముద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్‌లో (మికా) ఎంబీఏ కోర్సులో చేరారు. అదే సమయంలో తనకు ఆసక్తి ఉన్న వైమానిక దళంలోకి ఎంపికయ్యారు. ‘మా తాత, తండ్రిని చూసి స్ఫూర్తి పొందాను. ఫైటర్ జెట్ పైలట్ కావాలనే ఆశయంతో కృషి చేశా. తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎవరైనా అనునిత్యం శ్రమించాల్సిందే. వెంట వెంటనే విజయాలు లభించవు. కల నెరవేరాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. కానీ, ఆగిపోవద్దు. కృషిని మధ్యలోనే వదిలేయకుండా కష్టపడితే విజయం తథ్యం’ అని చెబుతోంది మైత్రేయ.
పోరాటాలంటే ఇష్టం
ఢిల్లీకి చెందిన మెహర్ జీత్ కౌర్ బీఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తి చేశారు. ఆది నుంచీ మెహర్‌కి మిలటరీ బలగాలు చేసే పోరాటాలంటే మక్కువ. దీంతో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్... ఏదో ఒకదాంట్లో చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏఎఫ్‌ఏలో శిక్షణలో ప్రతిభ చూపించి ఫైటర్ జెట్ పైలట్‌గా ఎంపికయ్యారు. ‘జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వెనక్కు రాకూడదు. మహిళలు ఈ విషయంలో మరింత పట్టుదలతో ఉండాలి. ఏ సాయుధ బలగంలో అయినా అతివలు దూసుకుపోగలరని గుర్తుంచుకోండి. బీదర్ లో అదనపు శిక్షణ అనంతరం విధుల్లో చేరుతా’ అని పేర్కొన్నారు.
నావిగేటర్..
మా నాన్న గుర్దీప్ సింగ్ గుర్‌దాస్‌పూర్ సిటీ పోలీసు విభాగంలో అసిస్టెంట్ సబ్–ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. తాత గురుబచన్ సింగ్ ఆర్మీలో పని చేసి పదవీ విరమణ పొందారు. వారు ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఈ స్థాయికి చేర్చింది. పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్ నుంచే పన్నెండో తరగతి పూర్తి చేశాను. 2016లో భారత వాయుసేనలోకి ముగ్గురు మహిళా ఫైటర్లు తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన వార్త చూసి వారి బాటలోనే నడవాలనుకున్నాను. ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లి ఏఎఫ్‌ఏలో శిక్షణ పూర్తి చేసుకుని, నావిగేటర్‌గా ఎంపికయ్యాను.
– కోమల్ ప్రీత్ కౌర్, పంజాబ్
కఠినమైన శిక్షణ
ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో శిక్షణ ఎంతో కఠినంగా ఉంటుంది. ఇక్కడ శిక్షణ పొందే ప్రతి ఒక్కరూ నెవర్ గివిట్ అప్ ధోరణిలోనే ఉంటారు. స్త్రీ, పురుష తేడాలు ఉండవు. ప్రతి ఒక్కరూ విధుల్లో ఉన్నట్టుగానే శిక్షణలో పాల్గొనాలి. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, త్యాగాల కారణంగానే ఈ స్థాయికి చేరా. 12వ తరగతి వరకు సైన్స్ చదివినా డిగ్రీ మాత్రం ఆర్ట్స్‌లో పూర్తి చేశాను. నా తండ్రి రణ్‌బీర్ సింగ్ ఢిల్లీ కేంద్రంగా టెరిటోరియర్ ఆర్మీలో పని చేస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత హోదా అయిన సుబేదార్ మేజర్‌గా పని చేస్తున్నారు. ఆర్మీ జీవితాన్ని వారి ద్వారా ఇప్పటికే చూశాను. అందుకే వైమానిక దళాన్ని ఎంపిక చేసుకున్నా. ఎదగాలి, ఎగరాలనే కోరిక బలంగా ఉంది.
– సహజ్‌ప్రీత్ కౌర్, అమృత్‌సర్
ఈ శిక్షణలో పాల్గొన్న కోమల్‌ప్రీత్‌కౌర్, సహజ్‌ప్రీత్‌కౌర్‌లు కూడా తమ శిక్షణ అనుభవాలను పంచుకున్నారు.
– శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment