women fighters
-
స్త్రీ శక్తి: సూపర్ ఫైటర్
సవాలుకు దీటైన సమాధానం విజయంలోనే దొరుకుతుంది. ‘అమ్మాయిలు బైక్ నడపడం కష్టం’ అనే మాట విన్నప్పుడు పట్టుదలగా బైక్ నడపడం నేర్చుకుంది. ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశించడం చాలా కష్టం’ అనే మాట విన్న తరువాత ఫైటర్ పైలట్ కావాలనుకునే లక్ష్యానికి బీజం పడింది. ‘మిగ్–21 బైసన్’ యుద్ధ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించిన స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది జపాన్‌లో జరగబోయే ఎయిర్ కంబాట్ ఎక్సర్‌సైజ్‌లలో పాల్గొనబోతోంది... ఇండియా, జపాన్ దేశాలు కలిసి ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్లు నిర్వహించనున్నాయి. ఎయిర్ డిఫెన్స్‌కు సంబంధించి పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకునే లక్ష్యంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్), జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్(జేఎఎస్డీఎఫ్)లు గగనతల విన్యాసాలకు శ్రీకారం చుట్టనున్నాయి. జపాన్‌లో హైకురీ ఎయిర్‌బేస్ కేంద్రంగా జరిగే ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్లు (వీర్ గార్డియన్ 2023) ఈ నెల 12 నుంచి 26 వరకు జరగనున్నాయి. మన దేశానికి సంబంధించి సుఖోయ్–30 ఎంకేఐ, సీ–17 హెవీ–లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు దీనిలో భాగం అవుతాయి. ఈ కార్యక్రమంలోపాల్గొంటున్న ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్‌గా స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది చరిత్ర సృష్టించనుంది. మన దేశంలో జరిగిన కంబాట్ ఎక్సర్‌సైజ్‌లలో మహిళా ఫైటర్ పైలట్లుపాల్గొన్న సందర్భాలు ఉన్నప్పటికీ, వేరే దేశంలో జరిగే దానిలో ఒక మహిళా ఫైటర్ పైలట్పాలుపంచుకోడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్‌కు చెందిన అవని చతుర్వేది జైపూర్‌లో బీటెక్ చేసింది. విమానాలపై ఉన్న ఆసక్తితో రాజస్థాన్‌లోని వనస్థలి యూనివర్శిటీ ‘ప్లయింగ్ క్లబ్’లో చేరింది. అక్కడ మొదలైన ఆమె ప్రయాణం విజయపరంపరలతో సాగుతూనే ఉంది. ‘మిగ్–21 బైసన్’ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా 2018 చరిత్ర సృష్టించింది అవని. రాష్ట్రపతి చేతుల మీదుగా 2020లో ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందుకున్న అవని, వైమానిక రంగంలో పనిచేయాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇచ్చింది. అవని తండ్రి నీటిపారుదలశాఖలో ఇంజనీరు. సోదరుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. సోదరుడి స్ఫూర్తితోనే సైన్యంలోకి వచ్చింది అవని. భారతీయ వైమానికదళంలో పనిచేయాలనే తన లక్ష్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు ‘ఫ్లైయింగ్ క్లబ్లో చేరినంత సులువు కాదు’ అని వెక్కిరించిన వాళ్లూ ఉన్నారు. అయితే వాటిని అవని సీరియస్‌గా తీసుకోలేదు. ఎఎఫ్సిఎటీ పరీక్షలో రెండో స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంది. దుండిగల్(హైదరాబాద్)లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందింది. సాహసాలతో చెలిమి చేసింది. అవనికి బాస్కెట్‌బాల్, చెస్ ఆడడం, పెయింటింగ్ అంటే ఇష్టం. బాస్కెట్‌బాల్ వల్ల తెగువ, చెస్‌తో లోతైన ఆలోచన, పెయింటింగ్‌తో సృజనాత్మక శక్తులు తనలో వచ్చి చేరాయి. ‘ప్రతిరోజూ ఒక కొత్త విషయం నేర్చుకోవాలనేది నా విధానం. మంచి ఫైటర్ పైలట్‌గా పేరు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం’ అంటోంది అవని చతుర్వేది. ‘కఠినమైన ఫైటర్–ఫ్లయింగ్ షెడ్యూల్స్’ అంటూ ఒకప్పుడు ఐఏఎఫ్ మహిళలను కంబాట్ స్ట్రీమ్‌లోకి తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు ఐఏఎఫ్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. దీనికి తాజా ఉదాహరణ జపాన్‌లో జరిగే ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్కు అవని చతుర్వేదిని ఎంపిక చేయడం. -
IAF Combined Graduation Parade: ఈ పైలట్లు ఫైటర్లు
పోరాటాలంటే మక్కువ ఉన్నవారు ఏ సవాల్‌నైనా ఇట్టే అధిగమిస్తారు. ఫైటర్ జెట్ పైలెట్‌గా ఎంపికైన మైత్రేయ నిగమ్, మెహర్ జీత్ కౌర్‌లను చూస్తే ఆ మాట నూటికి నూరుపాళ్లు నిజం అంటారు. 22 మంది మహిళల్లో ఫైటర్లుగా ఎంపికైన వీరి ప్రతిభ, కృషి నవతరానికి స్ఫూర్తి. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో (ఏఎఫ్ఏ) జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ అది. వాయుసేనలో ఉన్న ఖాళీలు, శిక్షణ సమయంలో అభ్యర్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా వారిని ఫైటర్లుగా ఎంపిక చేస్తారు. మొత్తం 164 మంది శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ ఆఫీసర్లు పట్టాలు పొందారు. వీరిలో 22 మంది మహిళలు ఉండగా మైత్రేయ నిగమ్, మెహర్ జీత్ కౌర్‌లు ఫైటర్ జెట్ పైలట్లుగా నిలిచారు. మైత్రేయ నిగమ్ ఆమె కుటుంబంలో మూడో తరం ఫైటర్. వదలని కృషి గ్రూప్ కెప్టెన్‌గా పదవీ విరమణ పొందిన పీకే నిగమ్ ప్రస్తుతం ఏవియేషన్ డొమైన్ సంస్థలో పని చేస్తుండగా, ఆయన కుమారుడు అమిత్ నిగమ్ వింగ్ కమాండర్ హోదాలో రిటైర్ అయి ఇండిగో విమానయాన సంస్థలో సీనియర్ కెప్టెన్‌గా పని చేస్తున్నారు. మైత్రేయ నిగమ్ ఢిల్లీలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో విద్యనభ్యసించారు. అహ్మదాబాద్‌లోని ముద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్‌లో (మికా) ఎంబీఏ కోర్సులో చేరారు. అదే సమయంలో తనకు ఆసక్తి ఉన్న వైమానిక దళంలోకి ఎంపికయ్యారు. ‘మా తాత, తండ్రిని చూసి స్ఫూర్తి పొందాను. ఫైటర్ జెట్ పైలట్ కావాలనే ఆశయంతో కృషి చేశా. తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎవరైనా అనునిత్యం శ్రమించాల్సిందే. వెంట వెంటనే విజయాలు లభించవు. కల నెరవేరాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. కానీ, ఆగిపోవద్దు. కృషిని మధ్యలోనే వదిలేయకుండా కష్టపడితే విజయం తథ్యం’ అని చెబుతోంది మైత్రేయ. పోరాటాలంటే ఇష్టం ఢిల్లీకి చెందిన మెహర్ జీత్ కౌర్ బీఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తి చేశారు. ఆది నుంచీ మెహర్‌కి మిలటరీ బలగాలు చేసే పోరాటాలంటే మక్కువ. దీంతో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్... ఏదో ఒకదాంట్లో చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏఎఫ్ఏలో శిక్షణలో ప్రతిభ చూపించి ఫైటర్ జెట్ పైలట్‌గా ఎంపికయ్యారు. ‘జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వెనక్కు రాకూడదు. మహిళలు ఈ విషయంలో మరింత పట్టుదలతో ఉండాలి. ఏ సాయుధ బలగంలో అయినా అతివలు దూసుకుపోగలరని గుర్తుంచుకోండి. బీదర్ లో అదనపు శిక్షణ అనంతరం విధుల్లో చేరుతా’ అని పేర్కొన్నారు. నావిగేటర్.. మా నాన్న గుర్దీప్ సింగ్ గుర్దాస్పూర్ సిటీ పోలీసు విభాగంలో అసిస్టెంట్ సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. తాత గురుబచన్ సింగ్ ఆర్మీలో పని చేసి పదవీ విరమణ పొందారు. వారు ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఈ స్థాయికి చేర్చింది. పంజాబ్‌లోని గుర్దాస్పూర్ నుంచే పన్నెండో తరగతి పూర్తి చేశాను. 2016లో భారత వాయుసేనలోకి ముగ్గురు మహిళా ఫైటర్లు తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన వార్త చూసి వారి బాటలోనే నడవాలనుకున్నాను. ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లి ఏఎఫ్ఏలో శిక్షణ పూర్తి చేసుకుని, నావిగేటర్‌గా ఎంపికయ్యాను. – కోమల్ ప్రీత్ కౌర్, పంజాబ్ కఠినమైన శిక్షణ ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో శిక్షణ ఎంతో కఠినంగా ఉంటుంది. ఇక్కడ శిక్షణ పొందే ప్రతి ఒక్కరూ నెవర్ గివిట్ అప్ ధోరణిలోనే ఉంటారు. స్త్రీ, పురుష తేడాలు ఉండవు. ప్రతి ఒక్కరూ విధుల్లో ఉన్నట్టుగానే శిక్షణలో పాల్గొనాలి. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, త్యాగాల కారణంగానే ఈ స్థాయికి చేరా. 12వ తరగతి వరకు సైన్స్ చదివినా డిగ్రీ మాత్రం ఆర్ట్స్‌లో పూర్తి చేశాను. నా తండ్రి రణ్‌బీర్ సింగ్ ఢిల్లీ కేంద్రంగా టెరిటోరియర్ ఆర్మీలో పని చేస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత హోదా అయిన సుబేదార్ మేజర్‌గా పని చేస్తున్నారు. ఆర్మీ జీవితాన్ని వారి ద్వారా ఇప్పటికే చూశాను. అందుకే వైమానిక దళాన్ని ఎంపిక చేసుకున్నా. ఎదగాలి, ఎగరాలనే కోరిక బలంగా ఉంది. – సహజ్ప్రీత్ కౌర్, అమృత్సర్ ఈ శిక్షణలో పాల్గొన్న కోమల్‌ప్రీత్‌కౌర్, సహజ్ప్రీత్కౌర్లు కూడా తమ శిక్షణ అనుభవాలను పంచుకున్నారు. – శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో, హైదరాబాద్ -
Indian Air Force: సవాలుకు సై
‘ఎగిరించకు లోహ విహంగాలను’ అన్నారు శ్రీశ్రీ ‘సాహసి’ కవితలో. ఈ సాహసులు మాత్రం రకరకాల లోహవిహంగాలను ఎగిరించడంలో తమ సత్తా చాటుతున్నారు. చండీగఢ్, అస్సాంలోని మోహన్బరీ చినూక్ హెలికాప్టర్ యూనిట్లలో తొలిసారిగా ఇద్దరు మహిళా ఫైటర్ పైలట్లు విధులు నిర్వహించబోతున్నారు.... మూడు సంవత్సరాల క్రితం... ‘ఇది చిరకాలం గుర్తుండే పోయే శుభసందర్భం’ అనే ఆనందకరమైన మాట ఫ్లైట్ లెఫ్టినెంట్ పారుల్ భరద్వాజ నోటి నుంచి వినిపించింది. రష్యా తయారీ ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ను నడిపిన తొలి ‘ఆల్ ఉమెన్ క్రూ’లో పారుల్ భరద్వాజ్ ఒకరు. ఆమెతోపాటు ఫ్లైట్ లెఫ్టినెంట్ హీన జైస్వాల్, ఫ్లైయింగ్ ఆఫీసర్ అమన్ నిధి ఉన్నారు. ‘ఆల్ ఉమెన్ క్రూ’కు ఎంపిక కావడం అంత తేలికైన విషయం కాదు. రకరకాల పరీక్షలలో విజయం సాధించి దీనికి ఎంపికయ్యారు. మొదట సికింద్రాబాద్‌లోని హకీంపేట్ హెలికాప్టర్ ట్రైనింగ్ సెంటర్లో, ఆ తరువాత బెంగళూరులో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ‘ఎంఐ–17వీ5 నడిపే మహిళా బృందంలో నేను భాగం అయినందుకు గర్వంగా ఉంది. దేశం కోసం ఏదైనా చేయాలనుకునేవారికి స్ఫూర్తినిచ్చే విషయం ఇది’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది పారుల్ భరద్వాజ్. పంజాబ్‌లోని ముకేరియన్ పట్టణానికి చెందిన పారుల్ రకరకాల హెలికాప్టర్లను నడపడంలో సత్తా చాటింది. తాజాగా... అధిక బరువు ఉన్న ఆయుధాలు, సరుకులను వేగంగా మోసుకెళ్లే మల్టీ–మిషన్ ‘చినూక్’ సారథ్య బాధ్యతను తొలిసారిగా ఇద్దరు మహిళలకు అప్పగించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. వారు... పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్. చండీగఢ్, అస్సాంలోని మోహన్బరీలో ఈ ఇద్దరు విధులు నిర్వహిస్తారు. గత సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఫ్లై– పాస్ట్’ లీడ్ చేసిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించిన స్వాతి రాథోడ్ రాజస్థాన్‌లోని నగౌర్ జిల్లాలో జన్మించింది. పైలట్ కావాలనేది తన చిన్నప్పటి కల. ఎన్సీసీ ఎయిర్‌వింగ్‌లో చేరడం తనను మరోస్థాయికి తీసుకువెళ్లింది. 2014లో పైలట్ కావాలనే తన కోరికను నెరవేర్చుకుంది స్వాతి రాథోడ్. ‘ఎం–17 నుంచి చినూక్లోకి అడుగుపెట్టడం ముందడుగుగా చెప్పుకోవాలి. వాయుసేనలో పనిచేస్తున్న మహిళలు తాము ఉన్నచోటే ఉండాలనుకోవడం లేదు. తమ ప్రతిభను నిరూపించుకొని ఉన్నతస్థాయికి చేరాలనుకుంటున్నారు. ఇది గొప్ప విషయం’ అంటున్నారు ఎయిర్ మార్షల్ అనీల్ చోప్రా. ఎంఐ–17వీ5తో పోల్చితే చినూక్ పనితీరు పూర్తిగా భిన్నం. దీనికితోడు కొన్ని భయాలు కూడా! అమెరికాకు చెందిన ఏరో స్పెస్ కంపెనీ ‘బోయింగ్’ తయారుచేసిన చినూక్ భద్రతపై ఇటీవల కాలంలో రకరకాల సందేహాలు వెల్లువెత్తాయి. వీటి ఇంజన్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందనేది వాటిలో ఒకటి. అయితే దీన్ని ‘బోయింగ్’ సంస్థ ఖండించింది. ఎలాంటి సమస్యా ఉండదని స్పష్టం చేసింది. అనుమానాలు, వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... చినూక్‌ను నడపడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఆ పనిని ఇష్టంగా స్వీకరించి సత్తా చాటడానికి సిద్ధం అయ్యారు పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్‌లు. వీరికి అభినందనలు తెలియజేద్దాం. అనుమానాలు, వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... చినూక్‌ను నడపడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఆ పనిని ఇష్టంగా స్వీకరించి సత్తా చాటడానికి సిద్ధం అయ్యారు పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్‌లు. వీరికి అభినందనలు తెలియజేద్దాం. -
కదనరంగంలోకి మహిళా ‘ఫైటర్లు’
వైమానిక దళంలోకి తొలిసారిగా ముగ్గురు పైలట్లు చరిత్రలో సువర్ణాధ్యాయమన్న రక్షణ మంత్రి పరీకర్ గర్వకారణమని ప్రశంసించిన ప్రధాని హైదరాబాద్: సాయుధ బలగాల్లో లింగ సమానత్వానికి సూచికగా, భారత చరిత్రలో తొలిసారిగా.. ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్లు వైమానిక దళంలోకి అడుగుపెట్టారు. వైమానిక శిక్షణ పూర్తి చేసుకుని.. తొలిసారిగా కదనరంగంలో కాలుపెట్టనున్న మహిళలుగా అవని చతుర్వేది, భావనకాంత్, మోహనాసింగ్లు చరిత్రకెక్కారు. శనివారం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన ‘కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం’లో అధికారికంగా ఎయిర్‌ఫోర్స్‌లోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమం రక్షణ రంగంలో ఓ మైలురాయని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అభివర్ణించారు. ‘సాయుధ బలగాల చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం. రానున్న రోజుల్లో విడతల వారీగా సాయుధ బలగాల్లో లింగ సమానత్వాన్ని సాధిస్తాం. మాకున్న వసతులకు అనుగుణంగా వీలైనంత మందిని యుద్ధరంగంలోనూ సత్తాచాటే అవకాశం కల్పిస్తాం’ అని పరీకర్ అన్నారు. ఈ ముగ్గురు ఐఏఎఫ్‌లోని వివిధ విభాగాల ఫ్లైట్ క్యాడెట్ల ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ అవకాశం దక్కటం వీరి అదృష్టమని పరీకర్ అన్నారు. సూపర్ సోనిక్ యుద్ధ విమానాలను నడిపేకంటే ముందు.. వీరు ఏడాదిపాటు బీదర్ (కర్ణాటక)లో హాక్ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనింగ్ పొందనున్నారు. ఆరుగురు మహిళా క్యాడెట్లు ఫైటర్ పైలట్లుగా శిక్షణ పొందేందుకు పోటీ పడగా.. కేవలం ముగ్గురు మాత్రమే ఇందుకు ఎంపికయ్యారు. ‘విమానాల్లో ఒంటరి గా వెళ్లేందుకు కావాల్సిన శిక్షణ పొందాం. ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నాం. మేం చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఒంటరిగా విమానాల్లో వెళ్లటాన్ని ఆస్వాదిస్తాం’ అని ఈ ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్స్ తెలిపారు. ఫ్ల్లయింగ్ ఆఫీసర్లకు అవార్డులు: దుండిగల్‌లో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా.. 22 మంది మహిళలుసహా మొత్తం 130 మంది క్యాడెట్లకు పరీకర్ ‘ప్రెసిడెంట్ కమిషన్’ పతకాలు ప్రదానం చేశారు. వీరిని ఫ్లయింగ్ ఆఫీసర్లుగా నియమించనున్నారు. వీరితోపాటు 93 మంది యువ పైలట్లు, ఏడుగురు నేవిగేటర్లు, తొమ్మిది మంది నేవీ అధికారులు, ఓ కోస్టు గార్డు అధికారి కూడా వైమానిక శిక్షణను పూర్తి చేసుకున్నారు. వైమానిక శిక్షణలో అన్ని విభాగాల్లో ముందు వరసలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ ఆదర్శ్ హూడాకు ‘ప్రెసిడెంట్స్ ప్లేక్’, ‘చీఫ్ ఆఫ్ ఎయిర్ స్వార్డ్ ఆఫ్ ఆనర్’ అవార్డులను పరీకర్ అందజేశారు. నేవిగేషన్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో అత్యుత్తమ ప్ర తిభ కనబరిచిన ఫ్ల్లైయింగ్ ఆఫీసర్లు సాహిల్ యాదవ్, నరేంద్ర కుశ్వాహలకు ‘ప్రెసిడెంట్ ప్లేక్’ అవార్డును ప్ర దానం చేశారు. పైలట్లు చేసిన వైమానిక విన్యాసాలు, ‘ఆకాశ్ గంగ’టీం చేసిన స్కై డైవింగ్ ఆకట్టుకున్నాయి. భారతీయ వైమానిక దళంలోకి ముగ్గురు మహిళా ఫైటర్లను ప్రవేశపెట్టడం గర్వంగా, సంతోషంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘తొలి బ్యాచ్ మహిళా ఫైటర్లు శిక్షణ పూర్తి చేసుకుని కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉండటం ఆనందంగా ఉంది. వారికి మరింత శక్తి రావాలి’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ఫ్లైట్ క్యాడెట్ అవని చతుర్వేది స్వస్థలం: మధ్యప్రదేశ్‌లోని సాత్నా.. నేపథ్యం: ఆర్మీ అధికారుల కుటుంబం చదువు: బీటెక్(కంప్యూటర్ సైన్స్) ఆర్మీలో పనిచేస్తున్న తన సోదరుడే స్ఫూర్తిగా వైమానిక దళంలోకి అడుగుపెట్టారు. ఫ్లైట్ క్యాడెట్ భావనా కాంత్ స్వస్థలం: బిహార్‌లోని దర్బంగా.. నేపథ్యం: తండ్రి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి చదువు: బీఈ(మెడికల్ ఎలక్ట్రానిక్స్) దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఫైటర్ పైలట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ్లైట్ క్యాడెట్ మోహనాసింగ్ స్వస్థలం: రాజస్థాన్‌లోని జున్జును.. నేపథ్యం: తండ్రి ఐఏఎఫ్‌లో అధికారి చదువు: బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్) దేశం కోసం సేవ చేయడంలో కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలని భావనతో ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రవేశించారు. వైమానిక దళంలో మహిళల ప్రస్థానం ఇదీ.. వైద్య విభాగంలో కాకుండా భారత వైమానిక దళంలోకి మహిళలను తీసుకోవడం 1992లో ప్రారంభమైంది. ప్రస్తుతం సాయుధ దళాల్లో సుమారు 3,500 మంది మహిళలు ఉంటే.. వైమానిక దళంనే సుమారు 1,500 మంది వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు. వీరిలో 94 మంది పైలట్లు.. మరో 14 మంది నేవిగేటర్లు. మిగిలిన వారు అడ్మినిస్ట్రేటర్లుగా, లాజిస్టిక్స్, అకౌంట్స్ తదితర విభాగాల్లో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకూ మహిళలను రవాణా విమానాలు, హెలికాఫ్టర్లకు మాత్రమే పైలట్లుగా అనుమతించారు. 84 ఏళ్ల భారత వైమానిక దళం చరిత్రలో తొలిసారిగా ముగ్గురు మహిళలకు ఫైటర్ పైలట్లుగా ఇప్పుడు అవకాశం కల్పించారు. ఇప్పటికీ పదాతి దళాల్లోని సాయుధులుగా.. యుద్ధ నౌకల్లోనూ.. యుద్ధ ట్యాంకర్లలోనూ మహిళలకు ప్రవేశం లేదు. తొలుత ఐదు నుంచి పదేళ్ల స్వల్ప సర్వీస్ కమిషన్ విధానంలో మహిళలకు వైమానిక దళంలో అవకాశాలు కల్పించారు. 2008లో కొత్త విధానం తీసుకొచ్చిన కేంద్రం కొన్ని ఆర్మ్స్ అండ్ సర్వీసుల్లో పర్మినెంట్ కమిషన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీంతో గత ఏడేళ్ల కాలంలో సుమారు 340 మంది మహిళా అధికారులు పర్మినెంట్ కమిషన్‌ను ఎంచుకున్నారు. వీరు 54 ఏళ్ల వయసు వచ్చే వరకూ వైమానిక దళంలో సేవలందించవచ్చు. కాగా, ప్రస్తుతం అమెరికా, పాకిస్థాన్, చైనా, యూఏఈ, ఇజ్రయెల్‌కు మాత్రమే మహిళా ఫైటర్ పైలట్లు ఉన్నారు.