- వైమానిక దళంలోకి తొలిసారిగా ముగ్గురు పైలట్లు
- చరిత్రలో సువర్ణాధ్యాయమన్న రక్షణ మంత్రి పరీకర్
- గర్వకారణమని ప్రశంసించిన ప్రధాని
హైదరాబాద్: సాయుధ బలగాల్లో లింగ సమానత్వానికి సూచికగా, భారత చరిత్రలో తొలిసారిగా.. ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్లు వైమానిక దళంలోకి అడుగుపెట్టారు. వైమానిక శిక్షణ పూర్తి చేసుకుని.. తొలిసారిగా కదనరంగంలో కాలుపెట్టనున్న మహిళలుగా అవని చతుర్వేది, భావనకాంత్, మోహనాసింగ్‌లు చరిత్రకెక్కారు. శనివారం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన ‘కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం’లో అధికారికంగా ఎయిర్‌ఫోర్స్‌లోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమం రక్షణ రంగంలో ఓ మైలురాయని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అభివర్ణించారు. ‘సాయుధ బలగాల చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం. రానున్న రోజుల్లో విడతల వారీగా సాయుధ బలగాల్లో లింగ సమానత్వాన్ని సాధిస్తాం. మాకున్న వసతులకు అనుగుణంగా వీలైనంత మందిని యుద్ధరంగంలోనూ
సత్తాచాటే అవకాశం కల్పిస్తాం’ అని పరీకర్ అన్నారు. ఈ ముగ్గురు ఐఏఎఫ్‌లోని వివిధ విభాగాల ఫ్లైట్ క్యాడెట్ల ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ అవకాశం దక్కటం వీరి అదృష్టమని పరీకర్ అన్నారు. సూపర్ సోనిక్ యుద్ధ విమానాలను నడిపేకంటే ముందు.. వీరు ఏడాదిపాటు బీదర్ (కర్ణాటక)లో హాక్ అడ్వాన్స్‌డ్ జెట్ ట్రైనింగ్ పొందనున్నారు. ఆరుగురు మహిళా క్యాడెట్లు ఫైటర్ పైలట్లుగా శిక్షణ పొందేందుకు పోటీ పడగా.. కేవలం ముగ్గురు మాత్రమే ఇందుకు ఎంపికయ్యారు. ‘విమానాల్లో ఒంటరి గా వెళ్లేందుకు కావాల్సిన శిక్షణ పొందాం. ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నాం. మేం చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఒంటరిగా విమానాల్లో వెళ్లటాన్ని ఆస్వాదిస్తాం’ అని ఈ ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్స్ తెలిపారు.
ఫ్ల్లయింగ్ ఆఫీసర్లకు అవార్డులు: దుండిగల్‌లో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా.. 22 మంది మహిళలుసహా మొత్తం 130 మంది క్యాడెట్లకు పరీకర్ ‘ప్రెసిడెంట్ కమిషన్’ పతకాలు ప్రదానం చేశారు. వీరిని ఫ్లయింగ్ ఆఫీసర్లుగా నియమించనున్నారు. వీరితోపాటు 93 మంది యువ పైలట్లు, ఏడుగురు నేవిగేటర్లు, తొమ్మిది మంది నేవీ అధికారులు, ఓ కోస్టు గార్డు అధికారి కూడా వైమానిక శిక్షణను పూర్తి చేసుకున్నారు. వైమానిక శిక్షణలో అన్ని విభాగాల్లో ముందు వరసలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ ఆదర్శ్ హూడాకు ‘ప్రెసిడెంట్స్ ప్లేక్’, ‘చీఫ్ ఆఫ్ ఎయిర్ స్వార్డ్ ఆఫ్ ఆనర్’ అవార్డులను పరీకర్ అందజేశారు. నేవిగేషన్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో అత్యుత్తమ ప్ర తిభ కనబరిచిన ఫ్ల్లైయింగ్ ఆఫీసర్లు సాహిల్ యాదవ్, నరేంద్ర కుశ్వాహలకు ‘ప్రెసిడెంట్ ప్లేక్’ అవార్డును ప్ర దానం చేశారు. పైలట్లు చేసిన వైమానిక విన్యాసాలు, ‘ఆకాశ్ గంగ’టీం చేసిన స్కై డైవింగ్ ఆకట్టుకున్నాయి. భారతీయ వైమానిక దళంలోకి ముగ్గురు మహిళా ఫైటర్లను ప్రవేశపెట్టడం గర్వంగా, సంతోషంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘తొలి బ్యాచ్ మహిళా ఫైటర్లు శిక్షణ పూర్తి చేసుకుని కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉండటం ఆనందంగా ఉంది. వారికి మరింత శక్తి రావాలి’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
ఫ్లైట్ క్యాడెట్ అవని చతుర్వేది
స్వస్థలం: మధ్యప్రదేశ్‌లోని సాత్నా..
నేపథ్యం: ఆర్మీ అధికారుల కుటుంబం
చదువు: బీటెక్(కంప్యూటర్ సైన్స్)
ఆర్మీలో పనిచేస్తున్న తన సోదరుడే స్ఫూర్తిగా వైమానిక దళంలోకి అడుగుపెట్టారు.
ఫ్లైట్ క్యాడెట్ భావనా కాంత్
స్వస్థలం: బిహార్‌లోని దర్బంగా..
నేపథ్యం: తండ్రి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి
చదువు: బీఈ(మెడికల్ ఎలక్ట్రానిక్స్)
దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఫైటర్ పైలట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఫ్లైట్ క్యాడెట్ మోహనాసింగ్
స్వస్థలం: రాజస్థాన్‌లోని జున్‌జును..
నేపథ్యం: తండ్రి ఐఏఎఫ్‌లో అధికారి
చదువు: బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్)
దేశం కోసం సేవ చేయడంలో కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలని భావనతో ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రవేశించారు.
వైమానిక దళంలో మహిళల ప్రస్థానం ఇదీ..
వైద్య విభాగంలో కాకుండా భారత వైమానిక దళంలోకి మహిళలను తీసుకోవడం 1992లో ప్రారంభమైంది. ప్రస్తుతం సాయుధ దళాల్లో సుమారు 3,500 మంది మహిళలు ఉంటే.. వైమానిక దళంనే సుమారు 1,500 మంది వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు. వీరిలో 94 మంది పైలట్లు.. మరో 14 మంది నేవిగేటర్లు. మిగిలిన వారు అడ్మినిస్ట్రేటర్లుగా, లాజిస్టిక్స్, అకౌంట్స్ తదితర విభాగాల్లో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకూ మహిళలను రవాణా విమానాలు, హెలికాఫ్టర్లకు మాత్రమే పైలట్లుగా అనుమతించారు. 84 ఏళ్ల భారత వైమానిక దళం చరిత్రలో తొలిసారిగా ముగ్గురు మహిళలకు ఫైటర్ పైలట్లుగా ఇప్పుడు అవకాశం కల్పించారు. ఇప్పటికీ పదాతి దళాల్లోని సాయుధులుగా.. యుద్ధ నౌకల్లోనూ.. యుద్ధ ట్యాంకర్లలోనూ మహిళలకు ప్రవేశం లేదు. తొలుత ఐదు నుంచి పదేళ్ల స్వల్ప సర్వీస్ కమిషన్ విధానంలో మహిళలకు వైమానిక దళంలో అవకాశాలు కల్పించారు. 2008లో కొత్త విధానం తీసుకొచ్చిన కేంద్రం కొన్ని ఆర్మ్స్ అండ్ సర్వీసుల్లో పర్మినెంట్ కమిషన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీంతో గత ఏడేళ్ల కాలంలో సుమారు 340 మంది మహిళా అధికారులు పర్మినెంట్ కమిషన్‌ను ఎంచుకున్నారు. వీరు 54 ఏళ్ల వయసు వచ్చే వరకూ వైమానిక దళంలో సేవలందించవచ్చు. కాగా, ప్రస్తుతం అమెరికా, పాకిస్థాన్, చైనా, యూఏఈ, ఇజ్రయెల్‌కు మాత్రమే మహిళా ఫైటర్ పైలట్లు ఉన్నారు.