First Time Women Pilots To Command Chinook Helicopter Squadron Leaders Bhardwaj And Swati Rathore - Sakshi
Sakshi News home page

Indian Air Force: సవాలుకు సై

Sep 20 2022 12:10 AM | Updated on Sep 20 2022 10:12 AM

First Time Women Pilots To Command Chinook Helicopter Squadron Leaders Bhardwaj and Swati Rathore - Sakshi

స్వాతీ రాథోడ్‌, పారుల్‌ భరద్వాజ్‌

‘ఎగిరించకు లోహ విహంగాలను’ అన్నారు శ్రీశ్రీ ‘సాహసి’ కవితలో. ఈ సాహసులు మాత్రం రకరకాల లోహవిహంగాలను ఎగిరించడంలో తమ సత్తా చాటుతున్నారు. చండీగఢ్, అస్సాంలోని మోహన్‌బరీ చినూక్‌ హెలికాప్టర్‌ యూనిట్‌లలో తొలిసారిగా ఇద్దరు మహిళా ఫైటర్‌ పైలట్‌లు విధులు నిర్వహించబోతున్నారు....

మూడు సంవత్సరాల క్రితం...
‘ఇది చిరకాలం గుర్తుండే పోయే శుభసందర్భం’ అనే ఆనందకరమైన మాట ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ పారుల్‌ భరద్వాజ నోటి నుంచి వినిపించింది. రష్యా తయారీ ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ను నడిపిన తొలి ‘ఆల్‌ ఉమెన్‌ క్రూ’లో పారుల్‌ భరద్వాజ్‌ ఒకరు. ఆమెతోపాటు ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ హీన జైస్వాల్, ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌ అమన్‌ నిధి ఉన్నారు.

‘ఆల్‌ ఉమెన్‌ క్రూ’కు ఎంపిక కావడం అంత తేలికైన విషయం కాదు. రకరకాల పరీక్షలలో విజయం సాధించి దీనికి ఎంపికయ్యారు.
మొదట సికింద్రాబాద్‌లోని హకీంపేట్‌ హెలికాప్టర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో, ఆ  తరువాత బెంగళూరులో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
‘ఎంఐ–17వీ5 నడిపే మహిళా బృందంలో నేను భాగం అయినందుకు గర్వంగా ఉంది. దేశం కోసం ఏదైనా చేయాలనుకునేవారికి స్ఫూర్తినిచ్చే విషయం ఇది’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది పారుల్‌ భరద్వాజ్‌.

పంజాబ్‌లోని ముకేరియన్‌ పట్టణానికి చెందిన పారుల్‌ రకరకాల హెలికాప్టర్‌లను నడపడంలో సత్తా చాటింది.
తాజాగా... అధిక బరువు ఉన్న ఆయుధాలు, సరుకులను వేగంగా మోసుకెళ్లే మల్టీ–మిషన్‌ ‘చినూక్‌’ సారథ్య బాధ్యతను తొలిసారిగా ఇద్దరు మహిళలకు అప్పగించింది ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌. వారు... పరుల్‌ భరద్వాజ్, స్వాతీ రాథోడ్‌. చండీగఢ్, అస్సాంలోని మోహన్‌బరీలో ఈ ఇద్దరు విధులు నిర్వహిస్తారు.
గత సంవత్సరం రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ‘ఫ్లై– పాస్ట్‌’ లీడ్‌ చేసిన తొలి మహిళగా రికార్డ్‌ సృష్టించిన స్వాతి రాథోడ్‌ రాజస్థాన్‌లోని నగౌర్‌ జిల్లాలో జన్మించింది. పైలట్‌ కావాలనేది తన చిన్నప్పటి కల. ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్‌లో చేరడం తనను మరోస్థాయికి తీసుకువెళ్లింది. 2014లో పైలట్‌ కావాలనే తన కోరికను నెరవేర్చుకుంది స్వాతి రాథోడ్‌.

‘ఎం–17 నుంచి చినూక్‌లోకి అడుగుపెట్టడం ముందడుగుగా చెప్పుకోవాలి. వాయుసేనలో పనిచేస్తున్న మహిళలు తాము ఉన్నచోటే ఉండాలనుకోవడం లేదు. తమ ప్రతిభను నిరూపించుకొని ఉన్నతస్థాయికి చేరాలనుకుంటున్నారు. ఇది గొప్ప విషయం’ అంటున్నారు ఎయిర్‌ మార్షల్‌ అనీల్‌ చోప్రా.

ఎంఐ–17వీ5తో పోల్చితే చినూక్‌ పనితీరు పూర్తిగా భిన్నం. దీనికితోడు కొన్ని భయాలు కూడా!
అమెరికాకు చెందిన ఏరో స్పెస్‌ కంపెనీ ‘బోయింగ్‌’ తయారుచేసిన చినూక్‌ భద్రతపై ఇటీవల కాలంలో రకరకాల సందేహాలు వెల్లువెత్తాయి. వీటి ఇంజన్‌లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందనేది వాటిలో ఒకటి. అయితే దీన్ని ‘బోయింగ్‌’ సంస్థ ఖండించింది. ఎలాంటి సమస్యా ఉండదని స్పష్టం చేసింది.

అనుమానాలు, వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... చినూక్‌ను నడపడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఆ పనిని ఇష్టంగా స్వీకరించి సత్తా చాటడానికి సిద్ధం అయ్యారు పరుల్‌ భరద్వాజ్, స్వాతీ రాథోడ్‌లు. వీరికి అభినందనలు తెలియజేద్దాం.
అనుమానాలు, వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... చినూక్‌ను నడపడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఆ పనిని ఇష్టంగా స్వీకరించి సత్తా చాటడానికి సిద్ధం అయ్యారు పరుల్‌ భరద్వాజ్, స్వాతీ రాథోడ్‌లు. వీరికి అభినందనలు తెలియజేద్దాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement