సాక్షి, హైదరాబాద్: సాయుధ దళాలలో సంప్రదాయ పద్ధతులకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే.. కాలానుగుణంగా కొత్త ఆవిష్కరణలు తేవాల్సిన అవసరం ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. కొత్త ఆలోచనలు చేయకుండా చాలా కాలం ఒకే తరహా సంప్రదాయాలను అనుసరిస్తే వ్యవస్థలో జడత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. యువ అధికారులు తమలో నూతనత్వానికి, వినూత్న ఆలోచనలకు ఎప్పటికప్పుడు పదునుపెట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ( ఇఎ్క) జరిగింది. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 213 ఫ్లైట్ కేడెట్లు (వీరిలో 25 మంది మహిళలు) పాల్గొన్నారు.
గౌరవ వందనం స్వీకరించి..
పరేడ్‌కు సమీక్ష అధికారిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని యువ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. యువ కేడెట్లు భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లో విధుల్లోకి చేరడానికి సూచికగా వారందరికీ అధికారిక హోదా కల్పిస్తూ రాష్ట్రపతి కమిషన్ (అధికారిక బ్యాడ్జ్‌లను)ను ప్రదానం చేశారు. తర్వాత రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించారు. ‘‘నిరంతరం అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలు, ఆవిష్కర ణల మధ్య సమతుల్యత సాధించండి. సంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తే.. మనం ఎండిపోయిన సరస్సులా మారిపోతాం.
మనం ప్రవహించే నదిలా ఉండాలి. ఇందుకు సంప్రదాయంతోపాటు కొత్తదనాన్ని తీసుకురావాలి. వాయుసేన అధికారులుగా మీరు ఆకాశంలో ఎగురుతూ ఉండండి. ఎక్కు వ ఎత్తును తాకండి, కానీ నేలతో మీ సంబంధాన్ని కొనసాగించండి’’అని పిలుపునిచ్చారు. అకాడమీలో భారత వాయుసేనకు చెందిన అధికారులతోపాటు నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది అధికారులు, కోస్ట్ గార్డ్ (తీర రక్షక దళం) నుంచి 9 మంది, స్నేహపూర్వక దేశమైన వియత్నాం నుంచి ఇద్దరు అధికారులు కూడా ఫ్లయింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నుంచి అవార్డులు అందుకున్నారు.
శిక్షణలో టాపర్‌గా నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ రాష్ట్రపతి ఫలకాన్ని చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్‌ను రాజ్‌నాథ్ చేతులమీదుగా అందుకున్నారు. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లలో మెరిట్లో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అమరీందర్ జీత్ సింగ్‌కు రాష్ట్రపతి ఫలకం లభించింది. అంతకుముందు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, యువ కేడెట్లతో ప్రమాణం చేయించారు.
ఆకట్టుకున్న కవాతు
శిక్షణలో ప్రథమస్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ ఆదివారం నాటి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా యువ ఫ్లయింగ్ కేడెట్లు చేసిన కవాతు ఆకట్టుకుంది. పరేడ్ అనంతరం భారత వాయుసేన నిర్వహించిన వైమానిక ప్రదర్శన అలరించింది. సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృంద విన్యాసాలు, సుఖోయ్–30 ఎంకేఐ గగనతల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎయిర్‌ఫోర్స్ అధికారులతోపాటు యువ ఫ్లయింగ్ ఆఫీసర్ల తల్లిదండ్రులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment