పదేళ్ల పాపాయి వర్షం కురిస్తే నాన్న చేత కాగితంతో పడవలు చేయించుకుని నీటిలో వదులుతూ మురిసిపోతుంది. వర్షం రాని రోజు కాగితంతో విమానాన్ని చేసే ఏటవాలుగా గాల్లోకి విసురుతుంది. ఎండాకాలం సెలవులు వచ్చాయంటే చాలు... జరిగిపోయిన క్లాసు నోట్‌బుక్‌ల పేజీలన్నీ గాల్లోకి ఎరిగే విమానాలయిపోతాయి. మరి ఈ అమ్మాయిల్లో ఎంతమంది విమానయాన రంగంలో అడుగుపెడుతున్నారు?
కాగితంతో విమానం చేయడం నేర్పించిన నాన్న విమానయానరంగం గురించి చెప్పడెందుకు? ఇక అమ్మకైతే ఒకటే భయం. మహిళాపైలట్‌లు, ఎయిర్ హోస్టెస్‌ల జీవితాల మీద వచ్చిన సినిమాలే గుర్తు వస్తాయామెకి. ఏవియేషన్ ఫీల్డ్‌లో ఆడపిల్లలు అనగానే పైలట్, ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగాలు తప్ప మరో ఉద్యోగాలుంటాయని కూడా పాతికేళ్ల కిందటి తల్లి ఊహకందకపోయి ఉండవచ్చు.
ఇక అమ్మాయిలకు ఎవరు చెప్తారు? విమానం ఎగరాలంటే రకరకాల విభాగాలు పని చేస్తాయని, ముప్‌పైరకాల విభాగాలు మహిళలకు అనువైన విభాగాలున్నాయని చెప్పేది ఎవరు? మనకు చదువులంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్)లే అనే ఒక పరదాలోపల జీవిస్తున్నామని తల్లిదండ్రులకు ఎవరు చెప్పాలి? మెటలర్జీ చదివితే విమానరంగంలో ఉద్యోగం చేయవచ్చని చెప్పగలిగిన వాళ్లే లేకపోతే పిల్లలు ఆ చదువుల వైపు ఎలా వెళ్లగలుగుతారు.
ఆకాశంలో ఎగిరే విమానాన్ని నియంత్రించే విభాగం నేలమీద ఉంటుందని, ఆ పనిని మహిళలు సమర్థవంతం గా నిర్వహిస్తున్నారని తెలిస్తే కదా... ఆడపిల్లలు ఆయా రంగాల్లో కెరీర్ కలలు కనేది. కనీసం కలలు కనడానికి తగినంత సమాచారం కూడా వాళ్ల దగ్గర లేకపోతే ఇక కలను నిజం చేసుకుంటారని ఎలా ఆశించాలి? ఇన్ని ప్రశ్నలు తలెత్తిన తర్వాత రాధా భాటియా ఆ ప్రశ్నలన్నింటికీ తనే సమాధానం కావాలనుకుంది.
బర్డ్ అకాడమీ ద్వారా కొత్తతరాన్ని చైతన్యవంతం చేస్తోంది. పాతికేళ్ల కిందట ఆమె మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ద్వారా యాభైవేల మందికి పైగా అమ్మాయిలు ఆకాశంలో కెరీర్‌ను నిర్మించుకున్నారు. ఆకాశాన్ని నియంత్రించే శక్తిగా భూమ్మీద నిలిచారు.
ప్రోత్సాహం చాలదు! దారి చూపించాలి!!
బర్డ్ అకాడమీ బాధ్యతకు ముందు రాధా భాటియా స్కూల్ టీచర్. ఓ సారి స్కూల్లో వర్క్‌షాప్ సందర్భంగా ఎనిమిది, తొమ్మిది తరగతుల పిల్లలను పెద్దయిన తర్వాత ఏమవుతారని అడిగినప్పుడు ఒక్కరు కూడా ఏవియేషన్ గురించి చెప్పలేదు. అందరూ చదువంటే డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్... వంటివే చెబుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలైతే టీచర్, డాక్టర్‌ల దగ్గరే ఆగిపోయారు. పిల్లలకు తెలిసిన రంగాలకంటే తెలియని రంగాలే ఎక్కువగా ఉన్నాయనిపించింది భాటియాకి.
మహిళను అవనిలో సగం, ఆకాశంలో సగం అని చెప్పే మోటివేట్ స్పీకర్‌లు, కథకులు ప్రోత్సహించడంతో తమ బాధ్యత పూర్తయిందనుకుంటున్నారు. అంతేతప్ప ఒక మార్గాన్ని సూచించే ప్రయత్నం జరగడం లేదని తెలిసింది అందుకే ఆ పని తనే∙మొదలు పెట్టారామె. అప్పటివరకు బర్డ్ అనేది ట్రావెల్ అండ్ టూరిజమ్, ఎయిర్‌ఫేర్ అండ్ టికెటింగ్, పాసెంబజర్ అండ్ బ్యాగేజ్ హ్యాండిలింగ్, ఎయిర్ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ హ్యాండిలింగ్, డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్ అండ్ కన్సెల్టెంట్ వంటి సర్టిఫికేట్ కోర్సులు, డిప్లమో కోర్సుల్లో శిక్షణ ఇచ్చే సంస్థ.
ఆ తర్వాత దాదాపుగా ముప్‌పైవిభాగాల్లో శిక్షణ ఇచ్చేటట్లు మెరుగుపరిచారు రాధాభాటియా. ఈ సంస్థ ద్వారా బాలికల్లో ఏవియేషన్ పట్ల చైతన్యం కలిగించడంతోపాటు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో బర్డ్ సంస్థ నుంచి ఏడాదికి మూడు వేల మందికి శిక్షణ ఇస్తున్నారు. ఏవియేషన్ రంగంలో విజయవంతంగా కెరీర్‌ను అభివృద్ధి చేసుకున్న మహిళలు కొత్తతరానికి మార్గదర్శనం చేస్తున్నారు. బర్డ్ కార్పొరేట్ ఆఫీస్ ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని కన్నాట్ హౌస్‌లో ఉంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కొచ్చిలలో శిక్షణ విభాగాలున్నాయి.
ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి కల గనడానికి కూడా సాధ్యం కాని విమానయాన రంగం అమ్మాయిల కళ్ల ముందు వాలింది. ఒకప్పుడు గగన కుసుమంగా ఉన్న ఈ రంగం ఇప్పుడు స్నేహహస్తం చాచింది. అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఇక అమ్మాయిల వంతు.
ఇన్ని ఉద్యోగాలా!
విమానయాన రంగంలో పైలట్, ఎయిర్‌లైన్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ విభాగం, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్, టెక్నీషియన్, ఫ్లైట్ అటెండెంట్, క్యాబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్, కమర్షియల్ మార్కెటింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫ్లైట్ డిస్పాచర్, ఎయిర్ స్టేషన్ ఏజెంట్, పాసింజర్ సర్వీస్ ఏజెంట్, రాంప్ స్కిప్పర్ అండ్ ఎగ్జిక్యూటివ్, ఏవియేషన్ మెటలర్జిస్ట్, క్రూ షెడ్యూల్ కో ఆర్డినేటర్, ఎయిర్ టికెట్ ఏజెంట్, మీట్ అండ్ గ్రీట్ ఏజెంట్, ఏవియేషన్ డాక్టర్, ఏవియేషన్ సైకాలజిస్ట్, ఏవియేషన్ ఆటార్నీ, సీఆర్‌ఎమ్ ఎగ్జిక్యూటివ్, క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్, ఎయిర్‌లైన్స్ ఫుడ్ సర్వీసెస్, సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్... ఇన్ని రకాల ఉద్యోగాలుంటాయి. ఇవన్నీ మహిళలు చేయడానికి అనువైన ఉద్యోగాలే.
హైదరాబాద్‌లో ఈ నెల చివరి వారంలో నాలుగు రోజుల పాటు జరిగిన వింగ్స్ ఇండియా 2022లో భాగంగా ఏవియేషన్ రంగంలో ఉద్యోగాల పట్ల బాలికలు, యువతులకు అవగాహన కల్పించడానికి హైదరాబాద్‌కి వచ్చింది బర్డ్ అకాడమీ. -రాధా భాటియా
బాలికల విమానయానం
ఉమన్ ఇన్ ఏవియేషన్ ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా ఇండియా విభాగాన్ని 2016లో ప్రారంభించారు. కెరీర్ చాయిస్ ఎంతలా ఉందో వివరించడానికి, కొత్త తరాన్ని చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించిన అనుబంధ విభాగం ఇది. ఉమెన్ ఇన్ ఏవియేషన్ 2015 నుంచి ఏటా ‘గర్ల్స్ ఇన్ ఏవియేషన్ డే (జిఐఏడి)’ నిర్వహిస్తోంది.
మొదటి ఏడాది 32 ఈవెంట్‌లలో 3,200 మంది పాల్గొన్నారు. 2019 నాటికి జిఐఏడిలో 18 దేశాల నుంచి ఇరవై వేలకు పైగా పాల్గొన్నారు. 119 ఈవెంట్‌లు జరిగాయి. 2020లో ‘ఏవియేషన్ ఫర్ గర్ల్స్’ యాప్ రూపొందించింది. 60 దేశాల నుంచి వేలాది మంది అమ్మాయిలు ఈ యాప్ ద్వారా వేడుకల్లో పాల్గొన్నారు. 2022లో సెప్టెంబర్ 24వ తేదీన జరగనుంది.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment