భారత్‌లో వ్యాపారం ప్రారంభానికి ఢిల్లీ ఉత్తమం
వాషింగ్టన్: దేశీయంగా వ్యాపారాలను ప్రారంభించే ప్రక్రియ సులభతరంగా ఉండే విషయంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. మూసివేత ప్రక్రియ సులభతరంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ముందు స్థానంలో ఉంది. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం న్యూఢిల్లీలో వ్యాపారాన్ని ప్రారంభించేందుకు 32 రోజులు పడుతుండగా.. బెంగళూరులో 40 రోజులు పడుతోంది. న్యూఢిల్లీలో కంపెనీని రిజిస్టర్ చేసేందుకు 11 దశలు (ప్రభుత్వ విభాగాలను సంప్రదించడం మొదలైనవి), బెంగళూరులో 13 దశలు ఉంటున్నాయి.
మొత్తం మీద భారత్‌లో వ్యాపారం చేయడానికి వెసులుబాటు ఉన్న నగరాల్లో న్యూఢిల్లీ, పాట్నా, జైపూర్‌ల తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ఇక బిజినెస్ మూసివేతకు సంబంధించి సగటున ఏడేళ్ల వ్యవధితో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. అదే కోల్‌కతాలో మాత్రం ఇందుకు సగటున 10.8 ఏళ్లు పడుతుంది. వ్యాపారం మూసివేత సులభతరంగా ఉన్న ఇతర నగరాల్లో హైదరాబాద్ తర్వాత లూధియానా, ముంబై, అహ్మదాబాద్, భువనేశ్వర్ ఉన్నాయి.