దినకరన్‌కు ఊరట
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌కు ఊరట లభించింది. ఎన్నికల అధికారికి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ కోర్టు గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దినకరన్ అనుచరుడు మల్లిఖార్జున్ కూడా న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. అన్నాడీఎంకే పార్టీ చిహ్నం ‘రెండాకుల’ కోసం ఈసీకి లంచం ఇవ్వచూపినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యవర్తి సుఖేశ్ చంద్రశేఖర్‌ను ఢిల్లీ క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. సుఖేశ్ చంద్రశేఖర్‌కు బెయిలిచ్చేందుకు ప్రత్యేక కోర్టు అంతకుముందు నిరాకరించింది.
కాగా, స్వర నామూనా ఇచ్చేందుకు దినకరన్ నిరాకరించారు. దినకరన్, చంద్రశేఖర్‌కు మధ్య ఫోన్‌లో జరిగిన సంభాషణల్లో మాటలను గుర్తించేందుకు స్వర నమూనా సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. దినకరన్ నిరాకరించడంతో స్వర నామూనా సేకరించలేకపోయారు. మరోవైపు రెండాకుల గుర్తు కోసం ఓ పన్నీరు సెల్వం, సీఎం ఎడపాటి పళనిస్వామి వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు రెండు వర్గాలు ఈసీకి ప్రమాణ పత్రాలు సమర్పించాయి.