
చూపులన్నీ అటే... హస్తినలో నేతల మకాం
హైదరాబాద్ : తెలంగాణ బిల్లు ఢిల్లీ చేరిన నేపథ్యంలో అందరి చూపులతో పాటు...ఇరుప్రాంతాల నేతలు హస్తన దారి పట్టారు. విభజనపై ఆంధ్రప్రదేశ్ పాత్ర ముగిసి హస్తిన పాత్రకు, దేశ రాజధాని మంత్రాంగానికి తెర లేచింది. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా బడా నాయకుల నుంచి చోటా మోటా నేతల వరకు ఢిల్లీలోనే మకాం వేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంత మంత్రులతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢిల్లీలో మంత్రాంగం సాగిస్తుండగా ఇప్పుడు టీడీపీ నేతలు కూడా వారితో జత కలిశారు.
బిల్లును సాఫీగా సాగిపోయేలా చేసేందుకు తెలంగాణ ప్రాంత నేతలు... ఎలాగైనా అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు శక్తియుక్తులు, ఎత్తులు పైఎత్తులకు తెర లేపారు. బిల్లుకు ఆమోదం సాధించుకునేందుకు తెలంగాణ ప్రాంత నేతలు.. ఎలాగైనా అడ్డుకోవాలని సీమాంధ్ర నేతలు ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు సోమవారం ఉదయమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు హస్తిన చేరింది. అంతకు ముందు చర్చ జరపడం కోసం ఎలాగైతే విమానంలో టీ.బిల్లు రాష్ట్రానికి వచ్చిందో... చర్చ అనంతరం కూడా బిల్లును అలాగే విమానంలో చేర్చారు.