లాటరీలో రూ. 2 వేల కోట్లు!
అమెరికాలో ట్రక్కు డ్రైవర్‌కు జాక్‌పాట్
లాస్ ఏంజిలెస్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ పోస్టల్ డెలివరీ ట్రక్కు డ్రైవర్ ను అదృష్టం రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. లాటరీలో జాక్‌పాట్ రూపంలో సుమారు రూ. 2 వేల కోట్లకు యజమానిని చేసింది. స్టీవ్ ట్రాన్ అనే డెలివరీ ట్రక్కు డ్రైవర్ గత డిసెంబర్ తొలి వారంలో మెగా మిలియన్స్ అనే సంస్థ రూ. 4 వేల కోట్లకు నిర్వహించే లాటరీ కోసం ఐదు టికెట్లు కొనుగోలు చేశాడు. డిసెంబర్ 17న లాటరీ డ్రా అనే విషయం మరచిపోయి కుటుంబంతో కలసి విహారయాత్రకు వెళ్లాడు. జాక్‌పాట్ ఇద్దరికి తగిలిందని...వారిలో ఓ మహిళ టికెట్‌ను చూపించి ఆమె వాటా లాటరీ సొమ్ము తీసుకుందన్న వార్త తెలుసుకొని మరో అదృష్టవంతుడు ఎవరై ఉంటారో అని అనుకున్నాడు.
అయితే గత సోమవారం రాత్రి నిద్రలోంచి ఒక్కసారిగా లేచి తాను కొన్న టికెట్ల నంబర్లను లాటరీ డ్రాలో వచ్చిన నంబర్లతో సరిపోల్చుకొని మరో విజేత తానేననే విషయం తెలుసుకున్నాడు. మర్నాడే లాటరీ నిర్వాహకులకు టికెట్‌ను చూపగా జాక్‌పాట్ సొమ్మును ఏ రూపంలో అందుకోవాలో వారంలో చెప్పాలని నిర్వాహకులు కోరారు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు యజమానికి సందేశం పంపాడు.