పెద్ద నోట్ల రద్దు: రూ.1500 కోట్లు మటాష్!
పెద్ద నోట్ల రద్దు: రూ.1500 కోట్లు మటాష్!
Published Sat, Nov 26 2016 7:03 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
హైదరాబాద్ : పెద్ద నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న హఠాత్తు నిర్ణయానికి తెలంగాణ రెవెన్యూలు భారీగానే తుడిచిపెట్టుకుపోనున్నాయట. నెలకు రూ.1000 నుంచి రూ.1500 కోట్ల రెవెన్యూలను ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుందని అంచనావేస్తున్నట్టు రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అయితే ఎన్ని నెలలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదని వ్యాఖ్యానించారు. తక్కువ విలువైన కరెన్సీనోట్లు వచ్చినప్పటికీ, సమస్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ సంక్షోభం మూడు లేదా ఆరు నెలల వరకు ఉండొచ్చనని.. ఇదంతా కేంద్రప్రభుత్వం చేతులోనే ఉందని రాజేందర్ అసహనం వ్యక్తంచేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్, మోటార్ వెహికిల్, కమర్షియల్ ట్యాక్స్ వసూలల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ప్రధాని నరేంద్రమోదీని కలిసి చర్చించారని, తమ సమస్యలకు పరిష్కారం కూడా కోరినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆదాయం తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్రానికి చెల్లించాల్సిన రుణాలను కొంతకాలం వాయిదా వేయాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేసినట్టు చెప్పాయి. అదేవిధంగా పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలు సోమవారం చేస్తున్న ఆక్రోష దివస్లో టీఆర్ఎస్ పాల్గొనడం లేదని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించారు. పెద్దనోట్ల రద్దు వెనుకాల ఉన్న ప్రధాని ఉద్దేశ్యాన్ని తాము అభినందిస్తున్నామని, కానీ అమలులోనే సంస్కరణలు చేయాల్సినవసరం ఉందన్నారు.
Advertisement