కేంద్ర హోంశాఖకు ‘డీజీపీ’ల జాబితా
* ఐదుగురి పేర్లను సూచించిన రాష్ట్ర ప్రభుత్వం
* ప్రస్తుత ఇన్‌చార్జి డీజీపీ అనురాగ్‌శర్మకు సైతం చోటు
సాక్షి, హైదరాబాద్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సీనియర్ అధికారులతో కూడిన జాబితాను కేంద్ర హోంశాఖకు పంపించింది. ప్రస్తుతం ఇన్‌చార్జి డీజీపీగా కొనసాగుతున్న అనురాగ్‌శర్మతో పాటు నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సీఆర్‌పీఎఫ్ డీజీ కె.దుర్గాప్రసాద్, ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ కౌర్ మీనన్ పేర్లు ఇందులో ఉన్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్‌సీ) ఐదుగురు అధికారుల పనితీరు, సర్వీసులో వారికి లభించిన రివార్డులు వంటి వాటిని పరిగణలోకి తీసుకొని ముగ్గురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది.
వారిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాధికారం మేరకు డీజీపీగా నియమించుకోవచ్చు. ప్రస్తుతం డీజీపీ పదవిలో ఉన్న అనురాగ్‌శర్మ రాష్ట్ర ఆవిర్భావం నుంచి హెడ్ ఆఫ్ ద పోలీస్ ఫోర్స్ (డీజీపీ-హెచ్‌ఓపీఎఫ్)గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఐపీఎస్‌ల క్యాడర్ నియామకం ఆలస్యమైంది. ఐపీఎస్‌ల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వడంతో పూర్తిస్థాయి డీజీపీ కోసం సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురి పేర్లతో కూడిన జాబితాను పంపింది. రాష్ట్ర క్యాడర్‌కే చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్‌గా ఉన్న టి.పి.దాస్, ఐపీఎస్ సీనియారిటీలో ముందు వరుసలో ఉన్నా అతనికి స్థానం దక్కలేదు. అయితే ఈ ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో అతని పేరు చేర్చలేదని సమాచారం.
అనురాగ్‌శర్మకే డీజీపీ చాన్స్
ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మకే పోలీసు అత్యున్నత పదవి దక్కే అవకాశం ఉంది. సీనియారిటీలో మొదటి స్థానంలో ఉన్నఅరుణ బహుగుణ 1979 బ్యాచ్‌కు చెందినవారు. నేషనల్ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె కేంద్ర సర్వీసుల్లోనే కొనసాగడానికి సుముఖత చూపుతున్నారు. తర్వాత సీనియర్‌గా ఉన్న కె.దుర్గాప్రసాద్(1981వ బ్యాచ్) కూడా డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులో కొనసాగుతున్నారు. ఫోకల్ పోస్టింగ్ (రాష్ట్ర పరిధిలో ఎస్పీ, కమిషనర్ వంటి హోదాల్లో) చేసిన అనుభవం తక్కువ. తర్వాత వరుసలో ఉన్న ఏకే ఖాన్ ఏసీబీ డీజీగా కొనసాగుతున్నారు. 1981వ బ్యాచ్‌కు చెందిన ఖాన్‌కు సీనియారిటీతో పాటు అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుతం ‘ఓటుకు కోట్లు’ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఐదోస్థానంలో ఉన్న 1983 బ్యాచ్‌కు చెందిన ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ కౌర్ అనురాగ్‌కంటే జూనియర్ కావడంతో ఈ పోస్టు దక్కే అవకాశం లేకపోవచ్చని అధికారవర్గాలు చెపుతున్నాయి.