tejdeep kaur menon
-
'నేను డీజీపీ బరిలో ఉన్నా'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ నియామకంపై సీనియర్ ఐపీఎస్ అధికారిని తేజ్‌దీప్ కౌర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... తాను డీజీపీ బరిలో ఉన్నానని తెలిపారు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఇంచార్జ్ డీజీపీని నియమిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డీజీపీ కోసం తుది జాబితా వచ్చే వరకూ వేచి చూడాల్సిందే అని అన్నారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీ కాలం నవంబర్ 11తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఇంచార్జ్ డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తేజ్‌దీప్ కౌర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
కేంద్ర హోంశాఖకు ‘డీజీపీ’ల జాబితా
* ఐదుగురి పేర్లను సూచించిన రాష్ట్ర ప్రభుత్వం * ప్రస్తుత ఇన్చార్జి డీజీపీ అనురాగ్‌శర్మకు సైతం చోటు సాక్షి, హైదరాబాద్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సీనియర్ అధికారులతో కూడిన జాబితాను కేంద్ర హోంశాఖకు పంపించింది. ప్రస్తుతం ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్న అనురాగ్‌శర్మతో పాటు నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సీఆర్పీఎఫ్ డీజీ కె.దుర్గాప్రసాద్, ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ కౌర్ మీనన్ పేర్లు ఇందులో ఉన్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) ఐదుగురు అధికారుల పనితీరు, సర్వీసులో వారికి లభించిన రివార్డులు వంటి వాటిని పరిగణలోకి తీసుకొని ముగ్గురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది. వారిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాధికారం మేరకు డీజీపీగా నియమించుకోవచ్చు. ప్రస్తుతం డీజీపీ పదవిలో ఉన్న అనురాగ్‌శర్మ రాష్ట్ర ఆవిర్భావం నుంచి హెడ్ ఆఫ్ ద పోలీస్ ఫోర్స్ (డీజీపీ-హెచ్ఓపీఎఫ్)గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఐపీఎస్‌ల క్యాడర్ నియామకం ఆలస్యమైంది. ఐపీఎస్‌ల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వడంతో పూర్తిస్థాయి డీజీపీ కోసం సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురి పేర్లతో కూడిన జాబితాను పంపింది. రాష్ట్ర క్యాడర్‌కే చెందిన ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్‌గా ఉన్న టి.పి.దాస్, ఐపీఎస్ సీనియారిటీలో ముందు వరుసలో ఉన్నా అతనికి స్థానం దక్కలేదు. అయితే ఈ ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో అతని పేరు చేర్చలేదని సమాచారం. అనురాగ్‌శర్మకే డీజీపీ చాన్స్ ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మకే పోలీసు అత్యున్నత పదవి దక్కే అవకాశం ఉంది. సీనియారిటీలో మొదటి స్థానంలో ఉన్నఅరుణ బహుగుణ 1979 బ్యాచ్‌కు చెందినవారు. నేషనల్ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె కేంద్ర సర్వీసుల్లోనే కొనసాగడానికి సుముఖత చూపుతున్నారు. తర్వాత సీనియర్‌గా ఉన్న కె.దుర్గాప్రసాద్(1981వ బ్యాచ్) కూడా డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులో కొనసాగుతున్నారు. ఫోకల్ పోస్టింగ్ (రాష్ట్ర పరిధిలో ఎస్పీ, కమిషనర్ వంటి హోదాల్లో) చేసిన అనుభవం తక్కువ. తర్వాత వరుసలో ఉన్న ఏకే ఖాన్ ఏసీబీ డీజీగా కొనసాగుతున్నారు. 1981వ బ్యాచ్‌కు చెందిన ఖాన్‌కు సీనియారిటీతో పాటు అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుతం ‘ఓటుకు కోట్లు’ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఐదోస్థానంలో ఉన్న 1983 బ్యాచ్‌కు చెందిన ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ కౌర్ అనురాగ్కంటే జూనియర్ కావడంతో ఈ పోస్టు దక్కే అవకాశం లేకపోవచ్చని అధికారవర్గాలు చెపుతున్నాయి. -
‘తేజ్‌దీప్ కేసులో వారంలో చార్జిషీటు వేయండి’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేమనే అభిప్రాయం ప్రజల్లో కలగరాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్ కౌర్ మీనన్‌పై నమోదైన కేసులో వారం లోపు చార్జిషీట్ దాఖలు చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని డీజీపీకి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తేజ్‌దీప్ కౌర్ మరికొందరు తన ఇంట్లోకి వచ్చి తన పట్ల దురుసుగా ప్రవర్తించి దూషించారంటూ జి.హరిత అనే మహిళ 2003లో బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి పదేళ్లయినా, కేసులో దర్యాప్తు పూర్తయినా కూడా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదన్న కారణం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. -
తేజ్‌దీప్‌పై విచారణకు అనుమతి
సాక్షి,హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్ మీనన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎపీఎస్పీఎఫ్) డెరైక్టర్ జనరల్‌గా ఉన్న అదనపు డీజీ తేజ్‌దీప్‌పై అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరపడానికి ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు ఏసీబీ డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్ సోమవారం మీడియాకు తెలిపారు. లీగల్ మెట్రాలజీ(తూనికలు, కొలతల శాఖ) కంట్రోలర్‌గా ఉన్న సమయంలో ఆమె అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే విభాగానికి చెందిన డిప్యూటీ కంట్రోలర్ శ్రీరాంకుమార్.. తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్లను వారు కోరుకున్నచోట పోస్టింగ్ ఇవ్వడానికిగాను లంచం తీసుకుంటుండగా 2008లో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే కంట్రోలర్ తేజ్‌దీప్ ఆదేశాల మేరకే తాను లంచం తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో శ్రీరాంకుమార్ వెల్లడించారు. ఈ ఘటనపై అప్పుడు ఏసీబీ డీజీగా ఉన్న ఆర్ఆర్ గిరీష్‌కుమార్ ప్రభుత్వానికి నివేదికను కూడా పంపించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత తేజ్‌దీప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఎట్టకేలకు ప్రభుత్వం ఇప్పుడు అనుమతించింది. సీఐడీ కేసులోనూ త్వరలో చార్జిషీటు..! సీఐడీలో కూడా తేజ్‌దీప్‌పై ఇప్పటికే ఒక కేసు పెండింగ్‌లో ఉంది. ఆమె హైదరాబాద్ నగర జాయింట్ పోలీసు కమిషనర్‌గా ఉన్నప్పుడు హరిత అనే మహిళను బెదరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై బాధితురాలు జాతీయ మానవహక్కు ల కమిషన్లోనూ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ హరితకు రూ.4 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని తేజ్‌దీప్‌ను ఆదేశించింది. కాగా హరితపై దాడికి సంబంధించిన కేసుపై సీఐడీ విభాగం విచారణను పూర్తి చేసింది. అప్పటి సీఐడీ అదనపు డీజీ రమణమూర్తి హయాంలో ఈ కేసుపై కోర్టులో చార్జిషీటును వేయడానికి ప్రభుత్వ అనుమతి కోరినా స్పందన రాలేదు. అయితే తాజాగా ఏసీబీ అధికారులు తేజ్‌దీప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపడానికి ప్రభుత్వం అనుమతించడంతో తమ వద్ద ఉన్న కేసుపైనా చార్జిషీటు వేయడానికి అనుమతి కోరడానికి సీఐడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
ఎస్పీఎఫ్ పదోన్నతి పరీక్షల్లో అక్రమాలు
12 మందిని సస్పెండ్ చేసిన అదనపు డీజీ సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగంలో అంతర్గత పదోన్నతుల కోసం జరిగిన రాత పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన 12 మందిపై అదనపు డీజీ తేజ్‌దీప్‌కౌర్ మీనన్ సస్పెన్షన్ వేటువేశారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్ నుంచి హెడ్‌కానిస్టేబుల్, హెడ్ నుంచి ఏఎస్ఐ, ఏఎస్ఐ నుంచి సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ) పోస్టుల్లో పదోన్నతులు కల్పించేందుకు అర్హులైన అభ్యర్థులకు ఇటీవల అమీన్పూర్ అకాడమీలో 45 రోజుల శిక్షణ అనంతరం రాత పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అర్హత సాధిస్తేనే పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. దీంతో కొందరు అభ్యర్థులు తమకు బదులుగా తమ సీనియర్లతో పరీక్షలు రాయించారు. ఆ పరీక్షల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించిన ఉన్నతాధికారి కూడా వారికి పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం ఎస్పీఎఫ్ అదనపు డీజీ తేజ్‌దీప్ కౌర్ దృష్టికి రావడంతో తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నారు.