సాక్షి,హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్ మీనన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎపీఎస్‌పీఎఫ్) డెరైక్టర్ జనరల్‌గా ఉన్న అదనపు డీజీ తేజ్‌దీప్‌పై అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరపడానికి ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు ఏసీబీ డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్ సోమవారం మీడియాకు తెలిపారు. లీగల్ మెట్రాలజీ(తూనికలు, కొలతల శాఖ) కంట్రోలర్‌గా ఉన్న సమయంలో ఆమె అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే విభాగానికి చెందిన డిప్యూటీ కంట్రోలర్ శ్రీరాంకుమార్.. తూనికలు కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్లను వారు కోరుకున్నచోట పోస్టింగ్ ఇవ్వడానికిగాను లంచం తీసుకుంటుండగా 2008లో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే కంట్రోలర్ తేజ్‌దీప్ ఆదేశాల మేరకే తాను లంచం తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో శ్రీరాంకుమార్ వెల్లడించారు. ఈ ఘటనపై అప్పుడు ఏసీబీ డీజీగా ఉన్న ఆర్‌ఆర్ గిరీష్‌కుమార్ ప్రభుత్వానికి నివేదికను కూడా పంపించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత తేజ్‌దీప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఎట్టకేలకు ప్రభుత్వం ఇప్పుడు అనుమతించింది.
సీఐడీ కేసులోనూ త్వరలో చార్జిషీటు..!
సీఐడీలో కూడా తేజ్‌దీప్‌పై ఇప్పటికే ఒక కేసు పెండింగ్‌లో ఉంది. ఆమె హైదరాబాద్ నగర జాయింట్ పోలీసు కమిషనర్‌గా ఉన్నప్పుడు హరిత అనే మహిళను బెదరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై బాధితురాలు జాతీయ మానవహక్కు ల కమిషన్‌లోనూ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ హరితకు రూ.4 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని తేజ్‌దీప్‌ను ఆదేశించింది. కాగా హరితపై దాడికి సంబంధించిన కేసుపై సీఐడీ విభాగం విచారణను పూర్తి చేసింది. అప్పటి సీఐడీ అదనపు డీజీ రమణమూర్తి హయాంలో ఈ కేసుపై కోర్టులో చార్జిషీటును వేయడానికి ప్రభుత్వ అనుమతి కోరినా స్పందన రాలేదు. అయితే తాజాగా ఏసీబీ అధికారులు తేజ్‌దీప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపడానికి ప్రభుత్వం అనుమతించడంతో తమ వద్ద ఉన్న కేసుపైనా చార్జిషీటు వేయడానికి అనుమతి కోరడానికి సీఐడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తేజ్‌దీప్‌పై విచారణకు అనుమతి
Published Tue, Dec 3 2013 12:39 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement