'ఓటుకు కోట్లు కేసు విచారణ కొనసాగుతోంది'
హైదరాబాద్ : అవినీతి నిరోధక వారోత్సవాలు డిసెంబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ బుధవారం హైదరాబాద్లో వెల్లడించారు. ఈ వారంపాటు యువత, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, కళాకారుల బృందాలతో అవగాహన కల్పిస్తామన్నారు. అవినీతిని నిర్మూలిద్దాం, దేశాన్ని అభివృద్ధి చేద్దామన్న నినాదంతో ముందుకెళ్తామని చెప్పారు.
అవినీతిపై సమాచారాన్ని 1064కు ఫోన్ కాల్ చేయాలని ఈ సందర్భంగా ఏకే ఖాన్ ప్రజలకు సూచించారు. ఓటుకు కోట్లు కేసులో ఇద్దరు ఎమ్మెల్యేల స్వర పరీక్షల నివేదిక కోర్టుకు అందిందని చెప్పారు. ఆ నివేదిక తమకు అందించేందుకు ఇప్పటికే కోర్టు అనుమతి కోరామన్నారు. దశల వారీగా ఓటుకు కోట్లు కేసులో విచారణ కొనసాగుతోందని ఖాన్ పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ల్యాబరేటరీ నివేదిక అందాక తదుపరి చర్యలు చేపడతామని ఏకే ఖాన్ తెలిపారు.