Anuraga sharma
-
సిట్‌కు చట్టబద్ధత.. స్టేషన్ హోదా!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులను దర్యాప్తు చేస్తున్న సిట్‌కు మరిన్ని అధికారాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సిట్‌కు స్టేషన్ హోదా కల్పించడంతోపాటు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. దీంతో కేసులను సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకురావొచ్చని భావిస్తోంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. ప్రస్తుతం సిట్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ కేసుల దర్యాప్తు కోణంలోనే ఏర్పాటు చేశారు. దీనికి చట్టబద్ధమైన అధికారాలు లేవు. కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అధికారం లేదు. కేసులు నమోదు చేయాలన్నా.. నిందితులను కస్టడీకి తీసుకోవాలన్నా.. సమన్లు జారీ చేయాలన్నా సంబంధిత పోలీస్‌స్టేషన్ ద్వారానే చేయాల్సి వస్తోంది. దీంతో కేసుల దర్యాప్తు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో చట్టబద్ధత కల్పిస్తే సిట్ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అలాగే న్యాయస్థానాల్లో కూడా ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా ఉంటాయి. -
తెలంగాణలో నేరాలు తగ్గాయి: డీజీపీ
-
తెలంగాణలో నేరాలు తగ్గాయి: డీజీపీ
హైదరాబాద్: 2015వ సంవత్సరంలో తెలంగాణలో నమోదైన నేరాలపై డీజీపీ అనురాగ్ శర్మ సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరంతో పోలిస్తే 8 శాతం నేరాలు తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 92వేల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని చెప్పారు. ఈవ్టీజర్ల ఆటకట్టేంచేందుకు షీటీమ్స్‌ను రంగంలో దింపడంతో 825 మంది ఈవ్‌టీజర్స్‌ను అరెస్ట్ చేశామన్నారు. షీ టీమ్స్ బాగా పనిచేశాయని కొనియాడారు. గణాంకాల ప్రకారం చైన్ స్నాచింగ్‌లు తగ్గినట్టు తెలిపారు. అంతేకాక రికవరీ శాతం 54.96 గా ఉందని డీజీపీ అనురాగ్‌శర్మ వెల్లడించారు. -
మెదక్ జిల్లాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా రామచంద్రాపురం వద్ద ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌త్రివేది బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ సూచన మేరకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన పోలీసు స్టేషన్‌కు ఒక సీఐ, ఎనిమిది మంది సబ్ఇన్స్పెక్టర్లు, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 28 మంది కానిస్టేబుళ్ల సిబ్బందిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. -
కేంద్ర హోంశాఖకు ‘డీజీపీ’ల జాబితా
* ఐదుగురి పేర్లను సూచించిన రాష్ట్ర ప్రభుత్వం * ప్రస్తుత ఇన్చార్జి డీజీపీ అనురాగ్‌శర్మకు సైతం చోటు సాక్షి, హైదరాబాద్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సీనియర్ అధికారులతో కూడిన జాబితాను కేంద్ర హోంశాఖకు పంపించింది. ప్రస్తుతం ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్న అనురాగ్‌శర్మతో పాటు నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సీఆర్పీఎఫ్ డీజీ కె.దుర్గాప్రసాద్, ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ కౌర్ మీనన్ పేర్లు ఇందులో ఉన్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) ఐదుగురు అధికారుల పనితీరు, సర్వీసులో వారికి లభించిన రివార్డులు వంటి వాటిని పరిగణలోకి తీసుకొని ముగ్గురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది. వారిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాధికారం మేరకు డీజీపీగా నియమించుకోవచ్చు. ప్రస్తుతం డీజీపీ పదవిలో ఉన్న అనురాగ్‌శర్మ రాష్ట్ర ఆవిర్భావం నుంచి హెడ్ ఆఫ్ ద పోలీస్ ఫోర్స్ (డీజీపీ-హెచ్ఓపీఎఫ్)గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఐపీఎస్‌ల క్యాడర్ నియామకం ఆలస్యమైంది. ఐపీఎస్‌ల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వడంతో పూర్తిస్థాయి డీజీపీ కోసం సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురి పేర్లతో కూడిన జాబితాను పంపింది. రాష్ట్ర క్యాడర్‌కే చెందిన ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్‌గా ఉన్న టి.పి.దాస్, ఐపీఎస్ సీనియారిటీలో ముందు వరుసలో ఉన్నా అతనికి స్థానం దక్కలేదు. అయితే ఈ ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో అతని పేరు చేర్చలేదని సమాచారం. అనురాగ్‌శర్మకే డీజీపీ చాన్స్ ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మకే పోలీసు అత్యున్నత పదవి దక్కే అవకాశం ఉంది. సీనియారిటీలో మొదటి స్థానంలో ఉన్నఅరుణ బహుగుణ 1979 బ్యాచ్‌కు చెందినవారు. నేషనల్ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె కేంద్ర సర్వీసుల్లోనే కొనసాగడానికి సుముఖత చూపుతున్నారు. తర్వాత సీనియర్‌గా ఉన్న కె.దుర్గాప్రసాద్(1981వ బ్యాచ్) కూడా డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులో కొనసాగుతున్నారు. ఫోకల్ పోస్టింగ్ (రాష్ట్ర పరిధిలో ఎస్పీ, కమిషనర్ వంటి హోదాల్లో) చేసిన అనుభవం తక్కువ. తర్వాత వరుసలో ఉన్న ఏకే ఖాన్ ఏసీబీ డీజీగా కొనసాగుతున్నారు. 1981వ బ్యాచ్‌కు చెందిన ఖాన్‌కు సీనియారిటీతో పాటు అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుతం ‘ఓటుకు కోట్లు’ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఐదోస్థానంలో ఉన్న 1983 బ్యాచ్‌కు చెందిన ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ కౌర్ అనురాగ్కంటే జూనియర్ కావడంతో ఈ పోస్టు దక్కే అవకాశం లేకపోవచ్చని అధికారవర్గాలు చెపుతున్నాయి. -
నగరంలో 3620 కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీ
డీజీపీ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసు విభాగంలో 3620 కానిస్టేబుల్డ్రైవర్ పోస్టుల నియామకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుమతించారు. రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో నియామక ప్రకటన జారీ చేయనుంది. డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలు సమర్పించగా వాటిని యథాతథం గా ఆమోదించారు. నగర పోలీసు విభాగానికి ఇటీవల కొత్త వాహనాలను సమకూర్చిన నేపథ్యంలో అవసరమైన మేరకు డ్రైవర్ పోస్టుల భర్తీకి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పోలీసుశాఖ పరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలును సీఎం సమీక్షించారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ బృందాల పనితీరును కేసీఆర్ ప్రశంసించారు. నగరంలో పేకాట క్లబ్బులను మూసి వేయడంపట్ల సాధారణ ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు అన్ని అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. -
ఎవరి బాధ్యతలు వారే..
ఎవరికి వారే చార్జ్ తీసుకున్న ఇరు రాష్ట్రాల డీజీపీలు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రానికి చివరి డీజీపీగా వ్యవహరించిన ప్రసాదరావు సోమవారం రెండు రాష్ట్రాల డీజీపీలకు బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా.. ముందుగానే ఆయన వైదొలగడంతో సాధ్యం కాలేదు. సాధారణం గా డీజీపీగా పని చేస్తూ బదిలీ అయిన, పదవీ విరమణ పొందిన అధికారులు తమ బాధ్యతల్ని ఒక్కరికే అప్పగిస్తారు. కానీ, ఈసారి ప్ర సాదరావు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీజీపీలకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అయితే దీని కి ముందే సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బాధ్యతల స్వీకారం, అప్పగింతలకు సంబంధించిన చార్జ్ డైరీని తన నివాసానికి తెప్పించుకున్న ప్రసాదరావు తాను రిలీవ్ అవుతున్నట్లు సంతకం చేశారు. ఆపై సచివాలయానికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ హోం శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కేటాయించిన సీఐడీ భవనంలో జేవీ రాము డు, ప్రస్తుత డీజీపీ కార్యాలయంలో అనురాగ్‌శర్మ ఎవరికి వారే బాధ్యతల్ని స్వీకరించారు. ఎవరికి వారు తమ చాంబర్స్‌లోకి వెళ్లి సహాయకుల ద్వారా చార్జ్ డైరీలో బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సంతకాలు చేశారు. గుంటూరులో డీజీపీ క్యాంప్ కార్యాలయం! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ క్యాంపు ఆఫీస్ గుంటూరులో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రా జధాని విజయవాడ-గుంటూరు మధ్య ఉండనుంద ని, నాగార్జున వర్సిటీలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల్లోనే డీజీపీకి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. -
26 వరకు సెక్రటేరియట్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు
సాక్షి, హైదరాబాద్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 26 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సిటీ కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, బూర్గుల రామకృష్ణారావు భవన్, జీహెచ్ఎంసీ, కమిషనర్ ఆఫ్ ఫిషరీస్, మింట్ కాంపౌండ్, నిజాం కాలేజ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్‌రోడ్, ఐమాక్స్ థియేటర్, నాంపల్లి, అసెంబ్లీ పరిసరాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు, ధర్నాలను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26 వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు. -
నగర కొత్వాల్‌కు స్థానచలనం!
అనురాగ్‌శర్మకు త్వరలో డీజీగా పదోన్నతి... ఆపై బదిలీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖలో ఉన్నతస్థాయి పదోన్నతుల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో పదోన్నతుల అనంతరం పలువురు ఉన్నతాధికారులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 1982 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మకు డెరైక్టర్ జనరల్‌గా పదోన్నతి కల్పించి బదిలీ చేయొచ్చని సమాచారం. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం. మహేందర్‌రెడ్డిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న సీవీ ఆనంద్ రంగారెడ్డి జిల్లాకు చెందినవారైనందున సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సొంత జిల్లా నుంచి బదిలీచేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాల సమాచారం. అనురాగ్ శర్మతోపాటు ఆయన బ్యాచ్‌కు చెందిన ఎస్వీ రమణమూర్తి కూడా డెరైక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందేవారిలో ఉన్నారు. ఐజీ నుంచి అదనపు డీజీగా పదోన్నతి పొందేవారిలో 1989 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు, ఉమేష్ షరాఫ్, కేఆర్ఎం కిషోర్‌కుమార్, సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఉన్నారు. అలాగే డీఐజీ నుంచి ఐజీ పదోన్నతి పొందే వారిలో 1996 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన చారుసిన్హా, అనిల్‌కుమార్, వీసీ సజ్జనార్, ఎన్ సంజయ్, భావనాసక్సేనా, ఎన్ నవీన్‌చంద్ , జీ సూర్యప్రకాశరావు ఉన్నారు. ఇదే బ్యాచ్‌కి చెందిన శంఖబ్రతబాగ్చీ కేంద్ర సర్వీసులకు వెళ్లినందున రాష్ట్రానికి వచ్చిన తరువాతే పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. 2000 సంవత్సరం ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఐదుగురు ఎస్పీలకు డీఐజీగా పదోన్నతి లభించనుంది. -
అసెంబ్లీ వద్ద నిషేధాజ్ఞలు
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాల పునఃప్రారంభం నేపథ్యంలో శాసనసభ పరిసరాల్లోని రెండు కిలోమీటర్ల మేర నిషేధాజ్ఞలు విధిస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి ఈ నెల 22 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. అసెంబ్లీ పరిసరాల్లో సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసనలు, ప్రదర్శనలకు అనుమతి ఉండదు. ఎవరైనా నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అనురాగ్‌శర్మ హెచ్చరించారు.