రాష్ట్ర పోలీసుశాఖలో ఉన్నతస్థాయి పదోన్నతుల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో పదోన్నతుల అనంతరం పలువురు ఉన్నతాధికారులు బదిలీ అయ్యే అవకాశం ఉంది.
అనురాగ్‌శర్మకు త్వరలో డీజీగా పదోన్నతి... ఆపై బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖలో ఉన్నతస్థాయి పదోన్నతుల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో పదోన్నతుల అనంతరం పలువురు ఉన్నతాధికారులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 1982 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మకు డెరైక్టర్ జనరల్‌గా పదోన్నతి కల్పించి బదిలీ చేయొచ్చని సమాచారం. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం. మహేందర్‌రెడ్డిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న సీవీ ఆనంద్ రంగారెడ్డి జిల్లాకు చెందినవారైనందున సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సొంత జిల్లా నుంచి బదిలీచేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాల సమాచారం.
అనురాగ్ శర్మతోపాటు ఆయన బ్యాచ్‌కు చెందిన ఎస్వీ రమణమూర్తి కూడా డెరైక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందేవారిలో ఉన్నారు. ఐజీ నుంచి అదనపు డీజీగా పదోన్నతి పొందేవారిలో 1989 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు, ఉమేష్ షరాఫ్, కేఆర్‌ఎం కిషోర్‌కుమార్, సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఉన్నారు. అలాగే డీఐజీ నుంచి ఐజీ పదోన్నతి పొందే వారిలో 1996 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన చారుసిన్హా, అనిల్‌కుమార్, వీసీ సజ్జనార్, ఎన్ సంజయ్, భావనాసక్సేనా, ఎన్ నవీన్‌చంద్ , జీ సూర్యప్రకాశరావు ఉన్నారు. ఇదే బ్యాచ్‌కి చెందిన శంఖబ్రతబాగ్చీ కేంద్ర సర్వీసులకు వెళ్లినందున రాష్ట్రానికి వచ్చిన తరువాతే పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. 2000 సంవత్సరం ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఐదుగురు ఎస్పీలకు డీఐజీగా పదోన్నతి లభించనుంది.