ఆ 'మాస్టర్ మైండ్' హతం!
ఢాకా: ఢాకా కేఫే దాడి వెనుక 'మాస్టర్ మైండ్స్' ను పోలీసులు మట్టుబెట్టారు. బంగ్లాదేశ్ లో ఈ ఉదయం (శనివారం)భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మిలిటెంట్లకు, రక్షకబలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురిని హతమార్చినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. రాజధాని ఢాకాకు సమీపంలోని నారాయణ గంజ్ లోని ఒక భవనంలో తలదాచుకున్నారన్న సమాచారంతో దాడిచేశామని కౌంటర్ టెర్రరిజం యూనిట్ అదనపు డిప్యూటీ కమిషనర్ సానోర్ హోస్సైన్ తెలిపారు. ప్రధాన సూత్రధారి, బంగ్లాదేశ్ జాతీయుడైన కెనడా నివాసి తమీమ్ అహ్మద్ చౌదరి సహా అతని అనుచరులు మరో ఇద్దరిని కాల్చి చంపినట్టు వెల్లడించారు.
బంగ్లాదేశ్ లోని నిషేధిత జమాతుల్ ముజాహిద్దీన్ (జెఎంబీ) కార్యకర్త ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడిని నిర్వహించామని యూనిట్ ఛీప్ మోనిరుల్ ఇస్లాం తెలిపారు. కెనడాలో నివసించే తమీమ్ ఒక నెట్ వర్క్ ను డెవలప్ చేశాడని, 2013లో బంగ్లాదేశ్ వచ్చి కార్యకలాపాలు మొదలు పెట్టాడని పోలీసులు తెలిపారు.
ఢాకాలోని కేఫ్ పై గత నెలలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో ఒక భారతీయ యువతితో సహా 22 మంది మరణించారు. మరోవైపు తమీమ్ అహ్మద్ ఆచూకీపై సమాచారం ఇచ్చిన వారికి ఇటీవల భారీ బహుమతిని (రెండు మిలియన్ల టాకాలు) కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.