
దించక్ పూజకు ఝలక్!
పాటలో స్కూటర్ నడుపుతూ.. హెల్మెట్ పెట్టుకోనందుకు పోలీసుల యాక్షన్
న్యూఢిల్లీ: దించక్ పూజ.. సోషల్ మీడియాలో ‘మ్యూజిక్ సెన్సేషన్’గా చెప్పుకొనే ఈమెకు చాలామంది అభిమానులే ఉన్నారు. ‘సెల్ఫీ మైనే లేలీ ఆజ్’ అంటూ ఈ అమ్మాయి పెట్టిన వీడియో పాటను ఏకంగా కోటిన్నరమందికిపైగా చూశారు. ఇలా ఒకటి రెండు పాటలతో ఫేమస్ అయిన ఈ అమ్మాయి తాజాగా ‘దిలోంక షూటర్ హై మేరే స్కూటర్.. దిలోంక షూటర్’ అంటూ మరో వీడియోపాటను తన యూట్యూబ్ పేజీలో పోస్టు చేసింది.
మూడు అంటే మూడు లైన్లు మాత్రమే ఉన్న ఈ పాటను.. అటు తిప్పి.. ఇటు తిప్పి మూడు నిమిషాలసేపు ఆమె పాడింది. ఆమె తాజా పాటపై పలువురు నెటిజన్లు విమర్శలు, సెటైర్లు గుప్పిస్తుండగా.. ఈ పాట ఆమెను చిక్కుల్లో పడేసే అవకాశం కనిపిస్తోంది. తన స్కూటర్.. ‘దిలోంక షూటర్’ ఆమె స్కూటర్ మీద తిరుగుతూ ఈ వీడియోలో కనిపించింది. అయితే, ఈ పాటలో ఆమె హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటర్ నడుపడం, రోడ్డుమీద గట్టిగా అరుస్తూ పాట పాడటంపై ఓ నెటిజన్ ఢిల్లీ పోలీసులకు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశాడు. ఢిల్లీ పోలీసులు కూడా వెంటనే స్పందించి.. దించక్ పూజపై చర్య తీసుకుంటామని తెలిపారు. అయితే, హెల్మెట్ పెట్టుకోనందుకు, రోడ్డుమీద గట్టిగా పాటలు పాడినందుకు ఆమెపై పోలీసులు ఏ చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.