'మాత్రలు కాదు.. నా తల్లి మరణమే కారణం'
ముంబయి: తన వద్ద ఏ మాత్రలు లేవని, ఎవరూ వాటిని ఇవ్వలేదని, అసలు తాను ఏ మాత్రలు వేసుకోలేదని షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఆమెతల్లి ఇంద్రాణి ముఖర్జియా పేర్కొంది. తన తల్లి మరణం గురించి తెలుసుకొని తీవ్ర విచారంలోకి కూరుకుపోయానని, దిగ్భ్రాంతికి లోనవ్వడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లానని చెప్పింది.
మోతాదుకు మించిన మాత్రలు వేసుకోవడం ద్వారా అపస్మారక స్థితిలోకి వెళ్లిందని భావించి ఆమెను జేజే ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్న అనంతరం మంగళవారం రాత్రి డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తన అస్వస్థతకు తల్లి మరణమే కారణమని చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఇంద్రాణిని బైకుల్లా మహిళా ఖైదీల జైలుకు తరలించారు.