
లీటర్ డీజిల్ పై 50 పైసలు పెంపు
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: డీ జిల్ ధర మళ్లీ ఎగబాకింది. లీటరుకు 50 పైసలు పెరిగింది. స్థానిక పన్నులు, విలువ ఆధారిత పన్ను(వ్యాట్) దీనికి జతకానుండడంతో ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులుంటాయి. పెరిగిన ధర శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో పన్నులతో కలిపి లీటరు ధర 57 పైసలు పెరిగి 54.91కు చేరింది. హైదరాబాద్‌లో ధర 59.21 నుంచి రూ.59.82కు పెరిగింది. పెట్రోల్ ధర మాత్రం పెరగలేదు. డీజిల్ ఖరీదు గత నెల 4న 50 పైసలు పెరగడం తెలిసిందే.
డీజిల్ అమ్మకాలపై నష్టాలను పూడ్చుకోవడానికి ప్రతి నెలా లీటరుపై 50 పైసల వరకు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించడంతో చమురు కంపెనీలు ధర పెంచుతుండడం విదితమే. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో కంపెనీలు సబ్సిడీయేతర వంటగ్యాస్(ఎల్పీజీ) సిలిండర్ ధరను రూ.107 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,241 నుంచి రూ.1,134కు తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 112.50 తగ్గి రూ. 1,215కు చేరింది. గృహేతర వినియోగ సిలిండర్ ధరలు కూడా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా తగ్గాయి. గత ఏడాది జనవరి నుంచి డీజిల్ ధర పెరడగడం ఇది 13వ సారి.