పాక్లో దిలీప్ కుమార్ రహస్య పర్యటన!
భారతదేశంలో తన పర్యటన ముగియగానే పాక్ విదేశాంగ శాఖ మాజీమంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరీ ఒక్కసారిగా విషం చిమ్మారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ భారత ప్రభుత్వం కోసం రెండు సార్లు పాకిస్థాన్లో రహస్యంగా పర్యటించారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయంగా దిలీప్ కుమార్ భార్య సైరాబానుయే తనకు చెప్పారని అన్నారు. భారత ప్రభుత్వం ప్రత్యేకంగా సమకూర్చిన విమానంలో ఆయన ఇస్లామాబాద్కు వెళ్లారని చెప్పారు. బహుశా జియా ఉల్ హక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒకసారి దిలీప్ కుమార్ పాక్కు వచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మరోసారి ఈమధ్యనే వచ్చి వెళ్లారన్నారు.
తాను మహాత్మాగాంధీ శిష్యులు కొందరిని మణిభవన్లో కలిశానని చెప్పారు. భారతదేశం నుంచి పాకిస్థాన్కు రావాల్సిన బకాయిల కోసం మహాత్మాగాంధీ నిరవధిక నిరాహార దీక్ష చేశారన్న విషయం పాకిస్థాన్లో కూడా చాలామందికి తెలియదని కసూరీ అన్నారు. తర్వాత జిన్నాహౌస్కు వెళ్లానని, కానీ అది చూడగానే తన హృదయం ద్రవించిపోయిందని చెప్పారు. దానికి ఏమాత్రం మరమ్మతులు చేయకుండా, అలాగే శిథిలావస్థలో వదిలేశారన్నారు. దాన్ని ముంబైలోని పాక్ కాన్సులేట్గా ఉపయోగించుకోవచ్చని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. జిన్నా భారతదేశంలో ఉన్న చివరిరోజు ముంబైలో దిలీప్కుమార్ను కలిశారని తెలిపారు.