![బిగ్‌బాస్‌లో షాకింగ్ ఘటన.. సూసైడ్‌యత్నం!](/styles/webp/s3/article_images/2017/09/17/81501921061_625x300.jpg.webp?itok=5UuTypIR)
బిగ్‌బాస్‌లో షాకింగ్ ఘటన.. సూసైడ్‌యత్నం!
బిగ్‌బాస్ షో.. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ప్రారంభమైన ఈ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇటు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్‌బాస్ షో ఇప్పుడిప్పుడు గాడిన పడుతుండగా.. అటు కమల్ హాసన్ వ్యాఖ్యతగా ఉన్న తమిళ బిగ్‌బాస్ మాత్రం అనూహ్య పరిణామాలకు వేదికగా మారింది. తమిళ బిగ్‌బాస్ సభ్యురాలైన ఒవియా ఏకంగా స్విమ్మింగ్‌పూల్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.
తమిళ బిగ్‌బాస్ హౌజ్‌మేట్లు అయిన ఒవియా, ఆరావ్ కొంతకాలంగా రొమాంటిక్‌గా గడిపారు. ఇటీవల ఒవియాను ఆరావ్ దూరం పెడుతుండటంతో మానసికంగా కుంగిపోయినట్టు కనిపించిన ఒవియా.. షో నుంచి తప్పుకొనేందుకు శుక్రవారం అనూహ్యరీతిలో తమ లివింగ్ క్వార్టర్స్‌కు సమీపంలో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకేసింది. ముక్కు మూసుకొని తల నీళ్లలోపల ఉంచి.. ఆత్మహత్యాయత్నం చేసింది. కిచెన్‌లో ఉన్న ఆరావ్‌తోపాటు ఇతర కంటెస్టెంట్స్ వెంటనే అప్రమత్తమై.. ఆమెను స్విమ్మింగ్‌పూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో ఒకింత ఉద్వేగపూరితమైన వాతావరణం నెలకొంది.
బిగ్‌బాస్ షోతో తమిళనాడులో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిపోయిన ఒవియా.. హౌజ్‌లోకి వెళ్లిన తొలిరోజుల్లోనే ఆరావ్‌తో ప్రేమలో పడింది. అతన్ని ప్రేమిస్తున్నానంటూ పలుసార్లు తెలిపింది. తొలుత ఆమెతో సన్నిహితంగా ఉన్న ఆరావ్... ఆ తర్వాత క్రమంగా దూరం పెట్టాడు. ఆమె మంచి స్నేహితురాలు మాత్రమేనని, అంతుకుమించి తనకు స్పెషల్ ఫీలింగ్స్ లేవని చెప్పుకొచ్చాడు. దీంతో అతని జీవితంలోకి మళ్లీ వెళ్లబోనని పేర్కొన్న ఒవియా.. ఆ తర్వాత మానసికంగా కుంగిపోయింది. ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటపడి ఆమె కోలుకుంటుందని హౌజ్‌మేట్స్ భావించినా.. అది జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఒవియా స్మిమ్మింగ్‌పూల్‌లో దూకడం కలకలం రేపింది. ఆమె షోనుంచి తప్పుకున్నారని, పోలీసులు కూడా ఈ ఘటన విషయంలో జోక్యం చేసుకున్నారని కథనాలు వస్తున్నాయి. నెక్ట్స్ ఎపిసోడ్‌లో ఆమె ఉంటుందా? లేక షో నుంచి తప్పుకున్నదా? అన్నది కూడా నిర్వాహకులు ఇంకా వెల్లడించలేదు.