పాక్‌పై ట్రంప్ ప్రశంసలు.. తూచ్!
పాకిస్థాన్ అద్భుతమైన దేశమని, పాకిస్తానీలు అద్భుతమైన తెలివిమంతులని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించినట్టు ఆ దేశ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ఉత్తదేనని తేలిపోయింది. ఈ విషయంలో పాక్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనకు కౌంటర్ ఇస్తూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ బుధవారం ఫోన్‌చేసి అభినందించారు. ఈ సందర్భంగా షరీఫ్‌తోపాటు, పాకిస్థాన్‌పై, పాకిస్థానీలపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించినట్టు పాక్ ప్రధాని కార్యాలయం అట్టహాసంగా ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన ట్రంప్.. అధ్యక్షుడైన వెంటనే తన వైఖరి మార్చుకున్నారా? అన్న విస్మయం వ్యక్తమైంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్ అని, దీనిని నిరోధించగలిగేది ఒక్క భారత్ మాత్రమేనని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అధికారిక బృందం స్పందిస్తూ.. పాక్ పీవోఎం ప్రకటన అతిశయోక్తులతో, అలంకారాలతో నిండి ఉందని, ట్రంప్ పాక్‌పై ప్రశంసలేమీ చేయలేదని వివరణ ఇచ్చింది. ‘ట్రంప్, నవాజ్ షరీఫ్ ఈ రోజు మాట్లాడారు. భవిష్యత్తులో పాకిస్థాన్, అమెరికా అనుబంధాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలన్న దానిపై వారి సంభాషణ ఫలప్రదంగా సాగింది’ అని మాత్రమే ట్రంప్ తన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక విదేశీ నేతతో సంభాషణపై అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఇలా ప్రకటన ఇవ్వడం అత్యంత అరుదు.
ప్రధాని షరీఫ్‌తో దీర్ఘకాలం కొనసాగే అనుబంధాన్ని ట్రంప్ కోరుతున్నట్టు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. భారత్‌తో సంఘర్షణ విషయంలో ఇరువర్గాలు కోరితేనే.. తాను ఏదైనా పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు. నిజానికి ట్రంప్‌తో చైనా, రష్యా అధినేతలు కూడా ఫోన్ సంభాషణలు నిర్వహించారు. దీని గురించి ఆయా దేశాల కార్యాలయాలు ప్రతికా ప్రకటనను విడుదల చేశాయి. దీనిపై ఎలాంటి కౌంటర్ ఇవ్వని ట్రంప్ పాక్ పీఎంవో ప్రకటనపై మాత్రం వివరణ ఇచ్చారు. ట్రంప్ అన్న మాటల కన్నా పాక్ ఎక్కువ ఊహించుకున్నదని, ఈ విషయంలో ఆ దేశ ప్రకటన సరికాదని అమెరికా అధికారులు అంటున్నారు.