
ట్రంప్ నగ్న విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు
మియామి: అమెరికాలో దొంగలు బరితెగించారు. డోనాల్డ్ ట్రంప్ నగ్న విగ్రహాన్ని మాయం చేశారు. మియామి పోలీస్ శాఖ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..
మియామి సిటీకి సమీపంలోని వెయిన్ వుడ్ లో ఉన్న ట్రంప్ నగ్న విగ్రహాన్ని గురువారం దొంగలు ఎత్తుకెళ్లారు. నలుగురైదుగురు వ్యక్తులు వచ్చి విగ్రహాన్ని ట్రక్కులోకి ఎక్కించడం చూశామని స్థానికులు పోలీసులకు చెప్పారు. ఒకరు మాత్రం అడుగు ముందుకేసి ట్రక్కు తాలూకు ఫొటోను తీసినట్లు చెప్పాడు. ట్రక్కు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా దాని యజమాని అలెజాండ్రో కోసం పోలీసులు గాలిస్తున్నారు. విగ్రహం చోరీలో ఇతని పాత్రకూడా ఉందని అనుమానిస్తున్న పోలీసులు అలెజాండ్రో ఫోటో, చిరునామాను ట్విట్టర్ లో ఉంచి 'ఇతణ్ని ఎక్కడైనా చూస్తే సమాచారం ఇవ్వండి' అంటూ ప్రజలకు సూచించింది.
అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి నచ్చని కొందరు ఆయన నగ్న విగ్రహాలు తయారుచేసి ప్రధాన నగరాల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తమనుతాము 'ఇన్‌డిక్లైన్ గ్రూప్'గా చెప్పుకున్న కొందరు చేపట్టిన వెరైటీ నిరసనను గంటల వ్యవధిలోనే పోలీసులు అడ్డుకున్నారు. న్యూయార్క్‌లో బిజీగా ఉండే యూనియన్ స్క్వేర్ సహా సీటెల్, క్లీవ్‌లాండ్, లాస్ ఏంజిల్స్, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాల్లోనూ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన నగ్న విగ్రహాలను తొలిగించారు. చట్టవ్యతిరేక చర్య కాబట్టి నగ్న విగ్రహాల్లో చాలా వాటిని స్థానిక అధికారులు ముక్కలు చేశారు. కానీ ఒక్క విగ్రహాన్ని మాత్రం పగలగొట్టలేదు. ఇప్పుడు దొంగలు ఎత్తుకెళ్లింది దానినే!
సదరు ట్రంప్ విగ్రహాం అక్టోబర్ 22న వేలం వేయనున్నారు. దాని విలువ 10 వేల నుంచి 20 వేల డాలర్లు పలకవచ్చని జూలియన్ ఆక్షన్స్ అంచనా వేస్తోంది. వేలం ద్వారా వచ్చిన డబ్బులను వలస వాదుల హక్కుల కోసం పోరాడుతున్న గ్రూప్‌నకు అందజేయనున్నారు. వలసలను అడ్డుకునేందుకు అమెరికా, మెక్సికో మధ్య గోడ కడతానని అనడం, అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉన్న లక్షలాది మందిని బయటకు పంపించేస్తానని ట్రంప్ తరచూ వ్యాఖ్యానిస్తున్న సంగంతి విదితమే.
If you know Pedro Rodriguez, contact us. He is being sought as a person of interest in the theft of a @realDonaldTrump statue in #Wynwood. pic.twitter.com/dTFjx1cxV9
— Miami PD (@MiamiPD) 22 September 2016