Serial Killer Real Stories in Telugu: అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రొఫెషనల్‌ సీరియల్‌ కిల్లర్‌! - Sakshi
Sakshi News home page

93 మందిని చంపేశాడు; ‘అందులోనే అసలైన మజా’!

Published Tue, Dec 1 2020 1:13 PM | Last Updated on Thu, Feb 4 2021 8:38 PM

Serial Killer Went Undetected For At Least 40 Years In USA - Sakshi

సామ్యూల్‌ లిటిల్‌(ఫొటో క్రెడిట్‌: ఎఫ్‌బీఐ.జీవోవీ సైట్‌)

వాషింగ్టన్‌: బాగా చీకటి పడిపోయింది. మియామీలో రూట్‌ 27 సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపేశాడు సామ్యూల్‌ లిటిల్‌. అప్పటికే తన మాటలతో మాయ చేసిన మేరీ బ్రోస్లేను దగ్గరికి తీసుకున్నాడు. తన నెక్లెస్‌తో ఆటాడటం మొదలుపెట్టాడు. మేరీకి మద్యం సేవించడం అంటే మహా ఇష్టం. ఆ అలవాటును వదల్లేక కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకుంది. మనసుకు నచ్చిన వ్యక్తితో మందు తాగుతూ బార్‌లో ఎంజాయ్‌ చేయడమంటే తనకు ఉన్న సరదానే మేరీని, సామ్యూల్‌తో మాటలు కలిపేలా చేసింది. మేరీ కాస్త పొట్టిగానే ఉన్నా.. చూడగానే ఆకట్టుకునే రూపం తనది. సుమారు 80 పౌండ్ల బరువున్న తన శరీరం ఆమె భోజనప్రియురాలు అన్న సంగతిని చెప్పకనే చెబుతుంది. మేరీకి దగ్గరగా జరుగగానే సామ్యూల్‌ ఒక విషయాన్ని గమనించాడు.

ఆమె ఎడమ చేతికి చిటికిన వేలు లేదు. వంట చేస్తున్న చేస్తున్న సమయంలో వేలు తెగి పడిపోయిందన్న విషయం అప్పుడు మేరీ అతడికి చెప్పింది. జారి పడటం మూలాన తన నడుము భాగంలో సర్జరీ అయిన విషయాన్ని కూడా అతడితో పంచుకుంది. ఇద్దరూ కలిసి సరదాగా గడుపుతున్న సమయంలో తన గతం గురించి సామ్యూల్‌కు చెప్పింది. తనకు ఎవరూ లేరని, ఒంటరి మహిళనే విషయాన్ని తెలియజేసింది. మేరీని తదేకంగా చూస్తున్న సామ్యూల్‌కు ఈ మాట ఎంతో ఆనందాన్నిచ్చింది. పున్నమినాటి చంద్రకాంతి, అప్పటికే మెరిసిపోతున్న మేరీ మెడ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. పచ్చని పసిమి ఛాయ, మెడకు సరిపడా నెక్లెస్‌ సామ్యూల్‌ను ఆకర్షించాయి. అతడిలో దాగున్న రాక్షసుడు నిద్రలేచాడు.

ఇంక ఆలస్యం చేస్తే లాభం లేదనుకున్నాడు. తనను తాను తమాయించుకోలేకపోయాడు. వెంటనే మేరీ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా గొంతు నులిమి చంపేశాడు. ఊహించని పరిణామానికి కంగుతిన్న మేరీ గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. 1970 నాటి ఘటన ఇది. అప్పటికి సామ్యూల్‌కు ఇంచుమించు 30 ఏళ్లు ఉంటాయి. మేరీకి 33. సైకో కిల్లర్‌ సామ్యూల్‌ బారిన పడ్డ మొదటి బాధితురాలు ఆమె. మేరీ తర్వాత సుమారు 93 మంది మహిళలను అలాగే చంపేశాడు సామ్యూల్‌.

అందులో ఓ ట్రాన్స్‌జెండర్‌ కూడా ఉంది. ముప్పై ఏళ్లలో 19 రాష్ట్రాల్లో అతడు అనేక ఘాతుకాలకు పాల్పడ్డాడు. అయితే ఒక్కచోట కూడా తన వేలిముద్రలు గానీ, ఇతర సాక్ష్యాధారాలేవీ చిక్కకుండా జాగ్రత్తపడ్డాడు. డ్రగ్‌ బానిసలు, సెక్స్‌ వర్కర్లు, ఒంటరి మహిళలే అతడి లక్ష్యం. ఎవరూ లేని అనాథలు, అందునా నల్లజాతి మహిళలైతే మరీ మంచిది. ఎందుకంటే వారిని ఏం చేసినా అడిగే వారు ఎవరూ ఉండరనే ధైర్యం అతడిది. 

ఇక హత్యలతో పాటు చిన్నా చితక దొంగతనాలు, దోపిడీలు చేసే సామ్యూల్‌ అప్పుడప్పుడూ అరెస్టైనా వెంటనే బెయిలు మీద బయటకు వచ్చేవాడు. కానీ పోలీసులు మాత్రం అతడిపై నిఘా వేసే ఉంచారు. అలా ఒకానొక హత్య కేసులో లభించిన ప్రాథమిక ఆధారాలతో 2014లో అతడిని అరెస్టు చేశారు. డీఎన్‌ఏ టెక్నాలజీని ఉపయోగించి నేరాన్ని రుజువు చేయడంతో స్థానిక కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష(లు) విధించింది. అప్పటి నుంచి కాలిఫోర్నియాలోని జైలులో సామ్యూల్‌ శిక్ష అనుభవిస్తున్నాడు.

అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రొఫెషనల్‌ సీరియల్‌ కిల్లర్‌గా పేరొందిన సామ్యూల్‌ కేసుకు సంబంధించిన వివరాలు, అతడి గతం గురించి తెలుసుకునేందుకు వార్తా మాధ్యమాలు ఇంటర్వ్యూ అడుగగా అతడు నిరాకరించాడు. అయితే ఇటీవల బయటకు వచ్చిన సుమారు 700 గంటల వీడియోటేప్‌ ఇంటర్వ్యూ(పోలీసులతో)ల్లో సామ్యూల్‌ నేరం చేసిన విధానం గురించి ఒళ్లు గగుర్పొడిచే విషయాలు పంచుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

చిన్న తనంలోనే తల్లి వదిలేసింది..
దక్షిణ అట్లాంటాకు సుమారు 100 మైళ్ల దూరంలో గల రెనాల్డ్స్‌(జార్జియా)లో 1940, జూన్‌ 7న సామ్యూల్‌ లిటిల్‌ జన్మించాడు. టీనేజర్‌ అయిన అతడి తల్లి పసివాడుగా ఉన్నపుడే తనను బంధువుల ఇళ్లలో వదిలివెళ్లింది. అప్పటి నుంచి ఒహియోలో పెరిగిన సామ్యూల్‌కు ఒంటరితనం అలవాటైంది. ఐదో తరగతిలో ఉన్నపుడు ఓ టీచర్‌ తన మెడను రుద్దుకున్నపుడు గమనించిన అతడికి అప్పటి నుంచి ఎవరి మెడను చూసినా గట్టిగా నొక్కిపట్టాలని, గొంతు నులమాలనే కోరిక పుట్టిందట. అప్పటి నుంచి తన పక్కనే ఉన్న సహ విద్యార్థినిని చంపడానికి అనేకసార్లు ప్రయత్నించి విఫలం అయినట్లు సామ్యూల్‌ వెల్లడించాడు.

ఇక పదమూడేళ్ల వయస్సులో తొలిసారిగా ఓ సైకిల్‌ను దొంగతనం చేయడం సహా పలుమార్లు దొమ్మీలకు పాల్పడటంతో అతడు జువైనల్‌ జైలులో జీవితం గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత సీరియల్‌ కిల్లర్‌గా మారి పదుల సంఖ్యలో హత్యలు చేశాడు. మృతుల ఒంటిపై ఉన్న బంగారం వంటి విలువైన వస్తువులు లాక్కోవడం, మృతదేహాలను పొదల్లో పడేసి అక్కడి నుంచి జారుకునేవాడు. 

ఈ విషయం గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘గతంలో నాకు మజా దొరికిన ప్రదేశాలకు వెళ్లి మళ్లీ మళ్లీ అదే తరహాలో హత్య చేయాలని ఉండేది. ఎన్నిపళ్లు కోసుకుని తింటే అంత మజా కదా. దానిని వదులుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు. శ్వేతజాతి టీనేజర్‌ను నేనెప్పుడూ వేధించలేదు. ఎవరూ లేని వాళ్లే నా టార్గెట్‌’’ అని పేర్కొన్నట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది. ప్రస్తుతం 80 ఏళ్ల వయస్సున్న సామ్యూల్‌, 2005లో చివరిసారిగా టుపెలోలో హత్య చేసినట్లు రికార్డుల్లో ఉన్నట్లు తెలిపింది. మేరీ బ్రెస్లీ(శ్వేతజాతి మహిళ‌), మార్తా కన్నింగ్‌హాం(బ్లాక్‌ మదర్‌), మేరీ ఆన్‌ జెంకిన్స్, జొలాండా జోన్స్‌ సహా ఎంతో మంది సామ్యూల్‌ బాధితుల్లో ఉన్నారు.

వీరిలో చాలా మంది మృతదేహాల్లో కొకైన్‌ వంటి మత్తుపదార్థాల నమూనాలు లభించడం గమనార్హం. అంతేగాక వారందరినీ అయితే కొంతమంది మాత్రం ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు ఛేదించలేక ఇప్పుడు సామ్యూల్‌తో ఆ నేరాలు చేసినట్లు ఒప్పిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ సామ్యూల్‌ మాత్రం తాను యువకుడిగా ఉన్న సమయంలో ఎలా హత్యలు చేశానన్న అంశం గురించి ఈ వయస్సులో కూడా పూసగుచ్చినట్లు వివరించడం శోచనీయం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement