
నాటోపై ట్రంప్ యూ టర్న్!
వాషింగ్టన్: ఉత్తర అట్లాంటిక్ దేశాల కూటమి (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్– నాటో)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. నాటోకి కాలం చెల్లిపోయిందని ఇటీవల వ్యాఖ్యానించిన ట్రంప్.. తాజాగా నాటో ప్రాముఖ్యాన్ని కోల్పోలేదని మాటమార్చారు. సిరియా విషయంలో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్‌తో కలసి వైట్‌హౌజ్‌లో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ.. ‘నాటో పనితీరుపై గతంలో విమర్శలు చేశాను. కానీ ప్రస్తుతం వారు కూడా ఉగ్రవాదంపై పోరాడుతున్నారు. గతంలో దానికి కాలం చెల్లిందని చెప్పాను. కానీ నాటో ప్రాముఖ్యం కోల్పోలేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఐసిస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇరాకీయులకు నాటో సాయమందించాలని కోరారు. ఇప్పటి వరకు రష్యా–అమెరికా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని.. నాటో, అమెరికాతో కలసి రష్యా ముందుకు సాగితే అద్భుతంగా ఉంటుందన్నారు.
రానున్న కాలంలో నాటో మిత్రదేశాలతో కలసి పని చేస్తామని చెప్పారు. వలసలు, ఉగ్రవాదం లాంటి సమస్యలను నాటో దేశాలతో కలసి ఎదుర్కొంటామన్నారు. సిరియాలో ప్రజలు, చిన్నారులను సాయన ఆయుధాలతో ఊచకోత కోయడాన్ని ప్రతి దేశమూ ఖండించాలన్నారు. అక్కడి ఉగ్రవాదులను అంతమొందించి అంతర్యుద్ధానికి ముగింపు చెప్పాలని, శరణార్థులను తిరిగి సొంత గూటికి పంపాలన్నారు. కాగా, త్వరలో బ్రసెల్స్‌లో జరగనున్న నాటో సదస్సుకు ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉంది.