చార్మీ పెళ్లి కాలేదు, మినహాయింపు ఇవ్వండి..
►పిటిషన్‌పై ముగిసిన వాదనలు, 2.30 గంటలకు తీర్పు
►రక‍్త నమూనా సేకరణకు చార్మీకి మినహాయింపు ఇవ్వండి
►స్వచ్ఛందంగానే శాంపుల్స్
హైదరాబాద్ : సినీనటి చార్మీ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. చార్మీ తరపు న్యాయవాది విష్ణువర్థన్ రెడ్డి వాదనలు వినిపించారు. డ్రగ్స్ కేసులో చార్మి నిందితురాలు కాదని, అలాగే సాక్షి కూడా కాదని, అలాంటిది ఆమెకు నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం చార్మీకి నోటీసులు ఇచ్చారని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే బలవంతంగా రక్త నమూనాలు సేకరించడం రాజ్యాంగ విరుద్ధమంటూ.. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ విషయాన్ని ప్రస్తావించారు.
చార్మికి ఇంకా పెళ్లి కాలేదని, బలవంతపు రక్త నమునా సేకరణ నుంచి ఆమెను ఉపసంహరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే బలవంతంగా ఎవరి వద్ద నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం లేదని, స్వచ్ఛందంగానే వాళ్లే ఇస్తున్నారని ప్రభుత్వ తరఫు లాయర్ తెలిపారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారమే డ్రగ్స్ కేసు విచారణ జరుగుతోందని, అంతేకాకుండా ప్రతిదీ వీడియో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. చార్మి అనుమతి ఇస్తే ఆమె ఇంటికే వెళ్లి విచారణ చేస్తామన్నారు. పూరీ జగన్నాథ్ అనుమతితోనే రక్త నమూనాలు సేకరించామని, అలాగే నిన్న నటుడు నవదీప్ నిరాకరించినందునే శాంపిల్స్ తీసుకోలేదన్నారు.
కాగా డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్నచార్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమె బుధవారం సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం న్యాయవాది, మహిళా అధికారుల సమక్షంలోనే తన విచారణ జరిపేలా ఎక్సైజ్ అధికారులను ఆదేశించాలని కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
తన నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకోకుండా ఆదేశించాలన్నారు. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టకుండా, బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సేకరించకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. పిటిషన్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్, సిట్ సూపరింటెండెంట్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.