టోక్యో: పశ్చిమాఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ తో చైనాకు ముప్పు పొంచి ఉందట. ఆఫ్రికా దేశాల నుంచి చైనా వర్కర్లు అధిక సంఖ్యలో స్వదేశానికి రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ఎబోలాతో ఆ దేశం జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. లండన్ లోని హైజిన్ -ట్రోపికల్ మెడిసిన్ కు డైరెక్టర్ గా ఉన్న పీటర్ పైలట్ చైనాకు భారీ ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడ్డాడు.' ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. ప్రాంతాల మార్పుతో ఈ వ్యాధి ఎక్కువ విస్తరిస్తోంది. అసలు ప్రజల్ని ప్రయాణాలు చేయకుండా ఆపడం జరగని పని' అని పీటర్ తెలిపాడు. ఎబోలా వైరస్ మిగతా దేశాల్లో ఉన్న చైనాలో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు.
చైనాలో ఎబోలాను అరికట్టేందుకు తీసుకునే చర్యలు చాలా పేలవంగా ఉన్నాయని తన పర్యటనను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం చైనాలో ఎబోలా ను ఎదుర్కొవడానికి నాణ్యతతో కూడిన వైద్య సదుపాయాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పీటర్ పేర్కొన్నాడు. గతంలో సార్స్ వ్యాధితో చైనాలోనే అధికంగా ప్రాణ నష్టం వాటిల్లిందన్నాడు. 2002 లో చైనాలో సార్స్ వ్యాధి బారిన 8,000 మంది పడగా,800 మంది వరకూ ప్రాణాలు కోల్పోయరని స్పష్టం చేశాడు.