ముందుంది మంచికాలం
గ్రేటర్ నోయిడా: రాబోయే మూడేళ్లలో భారత్ క్రమంగా మళ్లీ అధిక వృద్ధి బాటలోకి మళ్లగలదని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. 2012-13, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో మందగమనానికి అంతర్జాతీయ పరిణామాలే కారణమని చెప్పారు. పెట్రోటెక్ 2014 సదస్సులో పాల్గొన్న సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయాలు తెలిపారు.
2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తడానికి ముందు భారత్ తొమ్మిది శాతం స్థాయిలో వృద్ధిని సాధించిన విషయాన్ని చిదంబరం ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచ ఎకానమీ కోలుకుంటోందని, కొత్తగా తీసుకుంటున్న చర్యల ప్రభావంతో భారత్ కూడా క్రమంగా అధిక వృద్ధి బాట పట్టగలదని చిదంబరం పేర్కొన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరపు వృద్ధి అంచనాలు (సవరించినవి) మెరుగ్గా ఉండగలవని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 31న ప్రభుత్వం వీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటును (దేశంలోకి వచ్చే, వెళ్లే విదేశీ మారకం) 50 బిలియన్ డాలర్లకు కట్టడి చేయగలమని చిదంబరం చెప్పారు. భారీ స్థాయిలో ఉన్న చమురు దిగుమతులను నియంత్రించడం ఇందుకు తోడ్పడగలదన్నారు. గత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో ఇది రికార్డు స్థాయిలో 88.2 బిలియన్ డాలర్లకు ఎగిసిన సంగతి తెలిసిందే.
ఇంధన రంగంలో అపార అవకాశాలు..
అపార అవకాశాలు ఉన్న భారత ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఇన్వెస్టర్లను చిదంబరం ఆహ్వానించారు. వారికి కావాల్సిన సహకారం అందించగమన్నారు. అలాగే, చమురు కంపెనీలు, చమురు ఉత్పత్తి దేశాలతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీతో చమురుకు కూడా డిమాండ్ పెరగగలదని, ఫలితంగా ధరల్లో మళ్లీ భారీ హెచ్చుతగ్గులు తలెత్తవచ్చని చిదంబరం చెప్పారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు అధిక ధరల కారణంగా వర్ధమాన దేశాలు కనీసం 1-2 శాతం దాకా తమ వృద్ధి రేటును నష్టపోయాయన్నారు. చమురు ఉత్పత్తి, వినియోగ దేశాల మధ్య అసమానతలు ఉన్నంత కాలం ఇంధన భద్రతపై ఆందోళన తప్పదని చిదంబరం చెప్పారు.