విద్యా వ్యాపారంపై కేంద్రం కన్ను.. | Education Business On Central focus | Sakshi
Sakshi News home page

విద్యా వ్యాపారంపై కేంద్రం కన్ను..

Published Fri, Oct 30 2015 3:13 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

విద్యా వ్యాపారంపై కేంద్రం కన్ను.. - Sakshi

విద్యా వ్యాపారంపై కేంద్రం కన్ను..

* కోచింగ్ ఫీజులపై దృష్టి సారించిన సేవల పన్ను విభాగం
* పన్నులు కట్టాలంటూ పలు విద్యాసంస్థలకు నోటీసులు
* సానియా మీర్జా రెమ్యునరేషన్స్‌పైనా ఆరా
* ఓ వ్యాపారి రూ.140 కోట్లు బకాయి ఉన్నట్లు గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా జోరుగా సాగుతున్న విద్యా ‘వ్యాపారం’పై కేంద్ర సేవల పన్ను విభాగం కన్నేసింది.

సాధారణ విద్యతో పాటు నడుస్తున్న ప్రత్యేక కోచింగ్‌లు, వాటి పేరిట వసూలు చేస్తున్న ఫీజులపై దృష్టి సారించింది. ఈ క్రమంలో నారాయణ విద్యా సంస్థలు రూ.200 కోట్లు చెల్లించాలని గుర్తించిన అధికారులు ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేశారు. గాయత్రి విద్యా సంస్థలు రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు నిర్ధారించి తాఖీదులు ఇచ్చారు. వీటితో పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెమ్యునరేషన్స్‌పై సేవల పన్ను విభాగం ఆరా తీసింది. ఇక హైదరాబాద్‌కు చెందిన కూనం రాఘవరెడ్డి అనే వ్యాపారి రూ.140 కోట్లు బకాయి ఉన్నట్లు నిర్ధారించింది.

వాణిజ్య సేవల మేరకే..
సాధారణ విద్యా రంగానికి సర్వీసు ట్యాక్స్ నుంచి మినహయింపు ఉంది. అయితే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు సాధారణ విద్యతో పాటు ఐఐటీ, ఐఐఎం, సివిల్ సర్వీసెస్‌లకూ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొని, అదనంగా భారీ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇది పూర్తిగా వాణిజ్య వ్యవహారమని సర్వీసు ట్యాక్స్ విభాగం నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే సాధారణ విద్యకు ఆయా బోర్డులు నిర్ధారించిన ఫీజులకు మినహాయింపునిచ్చిన అధికారులు... కోచింగ్‌ల పేరుతో వసూలు చేస్తున్న ఫీజులకు సర్వీసు ట్యాక్స్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.

దీనిపై ఏటా 12.36 శాతం (ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 14 శాతం) పన్ను చొప్పున 2010-11 నుంచి 2013-14 వరకు నారాయణ విద్యా సంస్థలు రూ.200 కోట్లు కట్టాలని లెక్క తేల్చారు. ఈ మొత్తాన్ని నిర్ణీత కాలంలోపు చెల్లించాలంటూ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. ఇదే తరహాలో గాయత్రి విద్యా సంస్థలు ఐదేళ్ళుగా సర్వీసు ట్యాక్స్ చెల్లించట్లేదని గుర్తించిన అధికారులు రూ.40 కోట్లు కట్టాలని నోటీసులిచ్చారు. మరికొన్ని విద్యా సంస్థలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.

సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ కమిషనరేట్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఐఆర్‌ఎస్ అధికారి రేవెళ్ళ కల్యాణ్ పరోక్షంగా నారాయణ విద్యా సంస్థలకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆయన వైఖరి కారణంగానే వీరు బకాయిపడిన పన్ను చెల్లించట్లేదని సమాచారం. దీనిపై కల్యాణ్‌ను వివరణ కోరగా.. తాము తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నామంటూ సమాచారం ఇచ్చేందుకు నిరాకరించారు. మరోవైపు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా లావాదేవీలను సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ కమిషనరేట్ పరిశీలిస్తోంది.

ఆమె తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికై దాదాపు రూ.2 కోట్లు రెమ్యునరేషన్‌ల రూపంలో అందుకున్నారు. దీంతో పాటు ఇతర వాణిజ్య సంబంధిత లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థ కేఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.140 కోట్లు సర్వీస్ ట్యాక్స్ బకాయిలున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ సంస్థ డెరైక్టర్ కూనం రాఘవరెడ్డిని ఆగస్టులో అరెస్టు చేసిన విషయం విదితమే. ఆర్థిక చట్టం ప్రకారం రూ.50 లక్షలకు మించి సేవా పన్ను బకాయిపడిన వారిని అరెస్టు చేసే అధికారం సర్వీసు ట్యాక్స్ విభాగానికి ఉంది. ఈ కేసుల్లో నేరం రుజువైతే గరిష్టంగా ఏడేళ్ళ వరకు జైలు శిక్షపడుతుంది.
 
వాణిజ్య సేవలైతే పన్ను
వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సేవా పన్ను పరిధిలోకి వస్తారు. వారు విధిగా ఆ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అందువల్లే వాణిజ్య సంస్థలు, హోటళ్ళు తదితర సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా సర్వీసు ట్యాక్స్‌ను చేర్చి వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్ సొమ్మును సేవా పన్ను విభాగానికి చెల్లించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement