హరప్పన్లు... వంకాయ కూర! | Eggplant curry as to Harappan pottery | Sakshi
Sakshi News home page

హరప్పన్లు... వంకాయ కూర!

Published Fri, Jan 15 2016 1:43 AM | Last Updated on Thu, Jul 11 2019 5:38 PM

హరప్పన్లు... వంకాయ కూర! - Sakshi

హరప్పన్లు... వంకాయ కూర!

‘‘వంకాయ వంటి కూరయు... పంకజముఖి సీత వంటి భామామణియున్... శంకరుని వంటి దైవము... లంకాధిపు వైరి వంటి రాజున్ కలడే’’ వంకాయ వంటి కూర, పద్మం వంటి ముఖం కలిగిన సీత వంటి స్త్రీ, శివుడి లాంటి దేవుడు, లంకాధిపతి రావణుడికి శత్రువైన రాముడి వంటి రాజు లేరన్నది ఈ చాటువు అర్థం. ఇంతకీ ఈ కూర మొట్టమొదట ఎవరు చేశారంటారు? అమ్మమ్మలు, నానమ్మలు వండిపెడితే సుష్టుగా లొట్టలేసుకు తిన్నాం గానీ... ఈ సందేహం మాత్రం ఎప్పుడూ రాలేదు కదా? అరుణిమా కశ్యప్... స్టీవ్ వెబర్, సోయితీ బెనర్జీలకు వచ్చింది. వాళ్ల శోధన... పాకశాస్త్ర ప్రయోగాల పుణ్యమా అని ఇప్పుడు వంకాయ కూర మూలాలు తెలిశాయి.

ఆశ్చర్యంగా అనిపించినా... ఈ వంటకం హరప్పన్ కాలం నాటిదట! హరప్పన్లు వంకాయ కూర తినేవారా? మీకెలా తెలుసు? వాళ్లేమైనా ‘కుక్ బుక్’ రాసిపెట్టారా? పోనీ వేదాల్లో ఈ వంటకం ప్రస్తావనేమైనా ఉందా? ఇవేనా మీ బుర్రల్లో మెదులుతున్న ప్రశ్నలు. హరప్పన్లు వంటల పుస్తకాలు రాయలేదుగానీ... వంట వండుకున్న పాత్రలు వదిలారుగా? అవిచాలు... అప్పుడెప్పుడో వాళ్లు ఏం వండుకున్నారో తెలుసుకునేందుకు అంటున్నారు అరుణిమా కశ్యప్, స్టీవ్ వెబర్‌లు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఈ ఇద్దరు పరిశోధకులు కొన్నేళ్ల క్రితం ఈ ప్రయోగాలు చేపట్టారు.

హరప్ప మట్టిపాత్రల అడుగుభాగాలను మైక్రోస్కోపుల సాయంతో నిశితంగా పరిశీలించినప్పుడు... అక్కడి రసాయన అవశేషాలను విశ్లేషించినప్పుడు ఆ కాలంలో వాడిన మసాలాలు, దినుసుల గురించి తెలిసిందట.  హరప్ప నాగరికత తవ్వకాలు జరుగుతున్న ఫర్మానా (ప్రస్తుత హర్యానా) ప్రాంతానికి చెందిన సంప్రదాయ వంటకాలను పరిశీలించి, పరిశోధన వ్యాసాలను క్షుణ్ణంగా పరిశోధించిన తరువాత వీరిద్దరూ ఆనాటి వంటకం వంకాయదని తేల్చారు.
 
మరి సొయితీ బెనర్జీ ఏం చేశారు? అరుణిమ, స్టీవ్‌ల మాదిరిగానే ఢిల్లీకి చెందిన ఈ రచయిత్రి కూడా ఆ కాలం నాటి వంటకాన్ని మళ్లీ వండే ప్రయత్నం చేశారు. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా. అరుణిమా, స్టీవ్‌లు పింగాణీ పాత్రలో వండితే... సోయితీ దేశీ స్టైయిల్లో మట్టి కుండలు, కట్టెలపొయ్యి వాడి వంకాయ కూర వండారు. చిత్రమైన విషయమేమిటంటే... హర్యానా ప్రాంతంలో ఇప్పుడు వంకాయ కూర చాలా అరుదుగా మాత్రమే వండుతారట. హరప్పన్ వంకాయ కూర మీ ఇంట్లో వండాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం వండేయండి.
 
ఇదిగో రెసిపీ..!
కావాల్సిన పదార్థాలు.. లేత వంకాయలు 15, అల్లం... 2 అంగుళాల సైజు, పసుపు కొమ్ము ఒకటి (లేదంటే పావు టేబుల్‌స్పూన్ పసుపు పొడి), జీలకర్ర... అర టేబుల్ స్పూన్, మామిడికాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు, చక్కెర రసం పొడి (చెరకు రసాన్ని ఆరబెట్టాక మిగిలే పొడి) లేదా చక్కెర, పబ్రి (హర్యానా ప్రాంతంలో లభిస్తుంది. మనం దీన్ని కొత్తిమీరతో సరిపెట్టుకోవచ్చు), రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, రుచికి తగినంత ఉప్పు.
 
వండే విధానం...: లేత వంకాయలను తొడిమల వరకూ నిలువుగా చీల్చి.. వాటిని ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టుకోవాలి. అల్లం + పసుపు కొమ్ము + జీలకర్రలను మరీ మెత్తగా కాకుండా రుబ్బిపెట్టుకోవాలి. ఈ మసాలాను మట్టికుండలో నువ్వుల నూనె వేసి అది వేడెక్కిన తరువాత కలుపుకోవాలి. రెండు నిమిషాల తరువాత వంకాయలు వేయాలి. దాదాపు పది నిమిషాలపాటు వేగనిచ్చి... పచ్చిమామిడికాయల ముక్కలు కలుపుకోవాలి. ఒక కప్పు నీళ్లు, చక్కెర రసం పొడి, ఉప్పు కలిపి వంకాయలు మెత్తబడే వరకూ ఉడకనివ్వాలి. చివరల్లో పబ్రి (మనమైతే కొత్తిమీర) వేసేస్తే హరప్పన్ వంకాయ కూర రెడీ. వేడివేడి సజ్జరొట్టెలతో ఈ కూర మరింత రుచికరంగా ఉంటుందట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement