విద్యుత్ ఉద్యోగుల వివాదం మళ్లీ మొదటికి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి స్థానికత ఆధారంగా ఏపీకి రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగుల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు తెలంగాణ, ఏపీ విద్యుత్ సంస్థల అధికారులు శనివారం జరిపిన మూడో దఫా చర్చలు విఫలమయ్యాయి. పరస్పర విరుద్ధ వాదనలు, అభిప్రాయాలు వ్యక్తంకావడంతో... ఇకపై చర్చలు వద్దని, న్యాయస్థానంలోనే తేల్చుకుందామని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఈ వివాదంపై ఫిబ్రవరి 1న హైకోర్టులో జరగనున్న విచారణకు సన్నద్ధమవుతున్నాయి.
కొన్ని అంశాలపైనే ఏకాభిప్రాయం
పుట్టిన ప్రాంతం ఆధారంగా స్థానికతను నిర్ధారిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో జన్మించిన 1,252 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు గత జూన్‌లో ఏపీకి రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. అయితే శనివారం జరి గిన చర్చల్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు కొంత వెనక్కితగ్గాయి. పుట్టిన ప్రాంతానికి బదులు ఆర్టికల్ 371డి ఆధారంగా ఉద్యోగుల స్థానికతను నిర్ణయించి విభజన జరిపేందుకు అంగీకరించాయి. అంటే 1 నుంచి 7వ తరగతి వరకు విద్యను ఏ రాష్ట్రంలో అభ్యసిస్తే సదరు ఉద్యోగులు ఆ రాష్ట్రానికి చెందినవారు అవుతారు.
ఆ లెక్కన రిలీవైన ఉద్యోగుల్లో దాదాపు 200 మంది వరకు తిరిగి తెలంగాణకు వచ్చేందుకు మార్గం ఏర్పడింది. అదేవిధంగా జనాభా దామాషా ప్రకారం ఏపీ, తెలంగాణల మధ్య 58:42 నిష్పత్తిలో పోస్టుల సంఖ్యను, కేడర్‌తో సంబంధం లేకుండా ఉద్యోగులందరినీ విభజించుకుందామని ఏపీ అధికారులకు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ప్రతిపాదించారు.
దాంతోపాటు జీవిత భాగస్వామి ఏ రాష్ట్రంలో పనిచేస్తే అదే రాష్ట్రానికి ఉద్యోగుల కేటాయింపుతో పాటు అనారోగ్యం, వైకల్యం కారణాలతో సడలింపులు ఇచ్చేందుకూ అంగీకరించారు. కానీ జనాభా దామాషా ప్రకారం కేడర్ టు కేడర్ ఉద్యోగుల విభజన జరగాలని ఏపీ ట్రాన్స్‌కో ఎండీ విజయానంద్ కోరారు. లేకుంటే ఏపీకి సీనియర్ అధికారులు ఎక్కువ మంది వచ్చేస్తారని, అది తమకు భారంగా మారుతుందని వాదించారు. దీనికి తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ఒప్పుకోక పోవడంతో చర్చలు విఫలమయ్యాయి.