
ఆ విమానం.. గాల్లోనే రెండు ముక్కలు!
విమానం గాల్లో ఉండగానే దానికి మంటలు అంటుకుని.. రెండు ముక్కలైపోయింది! అవును.. రెండు నెలల క్రితం కూలిపోయిన ఈజిప్షియన్ ఎయిర్లైన్స్ విమానం గురించిన ఈ దిగ్భ్రాంతికర వాస్తవం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాక్పిట్ సమీపంలో లేదా లోపల మంటలు చెలరేగడంతో.. విమానం గాల్లో ఉండగానే రెండు ముక్కలై మధ్యధరా సముద్రంలో కూలిపోయి ఉంటుందని ఈజిప్టు విచారణాధికారుల బృందం చెప్పింది. అయితే మంటలు చెలరేగడానికి కారణం ఏమిటన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. విమానంలో సాంకేతిక లోపం వల్ల వచ్చాయా, లేక ఏదైనా విద్రోహ చర్య అందుకు కారణమా అనేది తెలియాల్సి ఉంది.
ఎయిర్బస్ ఎ320 రకానికి చెందిన ఈ విమానం ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలను వెల్లడించారు. మే 19వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 66 మందీ మరణించిన విషయం తెలిసిందే.