విమాన ప్రమాదస్థలి గుర్తింపు
కైరో: రష్యా ప్యాసింజర్ విమానం కూలిన ప్రదేశాన్ని ఈజిప్టు సైనిక విమానాలు గుర్తించాయి. 224 మంది ప్రయాణికులతో వెళుతున్న రష్యా విమానం ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో శనివారం కూలిపోయింది. 'విమానం కూలిన ప్రదేశాన్ని సైనిక విమానాలు గుర్తించాయి. ప్రమాదస్థలం నుంచి మృతులను తరలించేందుకు, గాయపడ్డవారికి సాయం చేసేందుకు 45 అంబులెన్సులను అక్కడికి తరలించాం' అని ఈజిప్టు ప్రభుత్వం తెలిపింది. విమాన ప్రమాదం గురించి తెలియగానే ఈజిప్టు ప్రధానమంత్రి ఇస్మాయిల్ షరీఫ్ క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. విమాన ప్రమాదం పరిణామాలు, తదుపరి చర్యలపై ఆయన సహచర మంత్రులతో చర్చించారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే దానిపై అధికారికంగా ఎలాంటి వివరాలు తెలియజేయలేదు.
రష్యాకు చెందిన ఎయిర్ బస్ ఎ- 321 విమానం ఈజిప్టులోని షర్మ్- ఎ- షేక్ రిసార్టు నుంచి రష్యాకు బయల్దేరింది. సినాయ్ ద్వీపకల్పం చేరుకోగానే విమానానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని కైరోలో అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించారని, కానీ అటువైపు వెళ్తుండగానే సమస్య తీవ్రమైందని రష్యా వర్గాలు చెబుతున్నాయి. విమానం టేకాఫ్ తీసుకున్న 23 నిమిషాలకే ఈజిప్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్ పరిధి నుంచి దాటిపోయిందని, ఆ తర్వాత అది సినాయ్ ద్వీపకల్పంలోని కొండల ప్రాంతంలో కూలిందని భావిస్తున్నారు.