russian airliner
-
విమానం బయటి కారణాల వల్లే కూలింది
ఈజిప్టులో కూలిన రష్యా విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలూ లేవని ఆ విమాన యాజమాన్య సంస్థ కొగలిమివా అధికారి అలెగ్జాండర్ స్మిరోవ్ సోమవారం తెలిపారు. ‘బయటి కారణాల వల్లే మా విమానం ప్రమాదానికి గురై గాలిలోనే విరిగి పోయి ఉండొచ్చు. విమానం అదుపు తప్పి కింద పడితుండడంతో ప్రమాదం గురించి పైలట్లు కంట్రోల్ రూమ్‌కు చెప్పే వ్యవధి లేకపోయింది. ఆ సమయంలో విమానం దెబ్బతిని, ముందుకు సాగలేకపోయి ఉండొచ్చు’ అని చెప్పారు. విమానం ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ముక్కచెక్కలైనట్లు నిర్ధారణ అవుతోందని రష్యా విమానయాన సంస్థ అధికారి నె రద్కో ఆదివారం చెప్పారు. ప్రమాదంలో విమానంలోని మొత్తం 224 మందీ చనిపోగా, 144 మృతదేహాలను రష్యాకు తరలించారు. -
కూలిన రష్యా విమానం దృశ్యాలు విడుదల
రష్యా విమానం కూలుతున్నప్పటి దృశ్యాలతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. రష్యా విమానం కూలుతుండగా ఆఖరి క్షణాల్లో తీసిన వీడియో ఇదని ఆ సంస్థ పేర్కొంది. ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో రష్యా విమానం కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని మొత్తం 224మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానం తామే కూల్చేశామని, సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై రష్యా బాంబు దాడులకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడ్డామని ఈజిప్టులోని ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థ ప్రకటించింది. ఈ వాదనను ఇటు ఈజిప్టు, అటు రష్యా కొట్టిపారేస్తున్నాయి. విమాన ప్రమాద ఘటనలో ఉగ్రవాద లింకు లేదని స్పష్టం చేశాయి. అయితే, ఆ విమానాన్ని తామే కూల్చామని చెప్తూ.. ఆధారంగా కూలుతున్న దృశ్యాలతో ఓ వీడియో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ విడుదల చేసింది. క్షిపణితో తామే విమానాన్ని కూల్చేశామని ప్రకటించింది. మరోవైపు విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన బ్లాక్ బాక్స్‌ను దర్యాప్తు అధికారులు నిపుణులకు పంపించారు. హృదయవిదారకం! ఈజిప్టులో కూలిన విమాన ప్రయాణికులకు సంబంధించిన ఫొటోలు హృదయాలను కలిచివేస్తున్నాయి. ఈ విమానంలో ప్రయాణించిన పది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా అలెక్సీ గ్రోవోవ్, తాతియనా దంపతులు కూడా ఈ ప్రమాదంలో అసువులు బాసారు. తాతియానా ఫొటోలను బట్టి ఆమె గర్భవతి అయి ఉండవచ్చునని తెలుస్తున్నది. ఎర్రసముద్ర పర్యాటక నగరమైన షర్మెల్ షేక్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్కు బయల్దేరిన ఈ విమానంలో ప్రయాణించిన వారిలో అత్యధికులు పర్యాటకులు. రష్యాకు చెందిన వారు. పర్యాటక ప్రాంతంలో విహరించిన అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో చనిపోయిన 217 మందిలో 17 మంది బాలలు, 138 మంది మహిళలు ఉన్నారు. -
ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు!
కైరో: ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో కూలిన రష్యా విమాన ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. విమాన ప్రమాద స్థలంలో సహాయక సిబ్బందికి బాధితుల ఆర్తనాదాలు వినిపించినట్టు మొదట వార్తలు వచ్చాయి. కానీ, ఆ ఆశలు నిలువలేదు. విమానంలోని 217 మంది ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది మృతిచెందారని రష్యా రాయబార కార్యాలయంలో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాద స్థలానికి చేరుకున్నసహాయక సిబ్బంది 100మంది మృతదేహాలను వెలికితీశారు. వెలికితీసిన మృతదేహాల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. 'ప్రమాదంలో విమానం రెండుభాగాలుగా చీలిపోయింది. విమానం తోకభాగం చిన్నముక్కగా తెగిపడి కాలిపోయింది. పెద్ద పరిమాణంలో ఉన్న ముందుభాగం ఓ పర్వతాన్ని ఢికొట్టింది. ఇప్పటివరకు విమానంలో వంద మృతదేహాలు వెలికితీశాం. మిగితా మృతదేహాలు వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నాం' అని సహాయక బృందానికి చెందిన అధికారి తెలిపారు. ప్రమాదస్థలికి చేరుకున్న వెంటనే కూలిన విమానంలోని ఓ భాగం నుంచి ఆర్తనాదాలు వినిపించాయని, దీంతో కొందరైన ప్రమాదంలో గాయాలతో బతికి ఉంటారని భావిస్తున్నామని సహాయక బృందానికి చెందిన అధికారి ఒకరు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే సహాయక చర్యలు ముందుకుసాగడంతో ప్రమాదంలో ఎవరూ బతికిలేనట్టు నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. -
ఆ విమానాన్ని కూల్చేయలేదు!
కైరో: రష్యా విమాన ప్రమాద ఘటనలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల హస్తముందని వస్తున్న వార్తలను ఈజిప్టు భద్రతా వర్గాలు ధ్రువీకరించడం లేదు. ఈ విమానాన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కూల్చివేశారని చెప్పడానికి ఎలాంటి సంకేతాలు లేవని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. రష్యా విమానం కూలిన సినాయ్ ప్రాంతంలో ఐఎస్ఐఎస్ గ్రూపు బలంగా ఉంది. రెండేళ్ల కిందట ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఆ ఉగ్రవాద సంస్థ ఇక్కడున్న ఈజిప్టు సైనికులు, పోలీసులు వందలమందిని చంపేసింది. ఈ నేపథ్యంలో సినాయ్ ద్వీపకల్పం మీదుగా వెళుతున్న విమానాన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే కూల్చివేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
విమాన ప్రమాదస్థలి గుర్తింపు
కైరో: రష్యా ప్యాసింజర్ విమానం కూలిన ప్రదేశాన్ని ఈజిప్టు సైనిక విమానాలు గుర్తించాయి. 224 మంది ప్రయాణికులతో వెళుతున్న రష్యా విమానం ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో శనివారం కూలిపోయింది. 'విమానం కూలిన ప్రదేశాన్ని సైనిక విమానాలు గుర్తించాయి. ప్రమాదస్థలం నుంచి మృతులను తరలించేందుకు, గాయపడ్డవారికి సాయం చేసేందుకు 45 అంబులెన్సులను అక్కడికి తరలించాం' అని ఈజిప్టు ప్రభుత్వం తెలిపింది. విమాన ప్రమాదం గురించి తెలియగానే ఈజిప్టు ప్రధానమంత్రి ఇస్మాయిల్ షరీఫ్ క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. విమాన ప్రమాదం పరిణామాలు, తదుపరి చర్యలపై ఆయన సహచర మంత్రులతో చర్చించారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే దానిపై అధికారికంగా ఎలాంటి వివరాలు తెలియజేయలేదు. రష్యాకు చెందిన ఎయిర్ బస్ ఎ- 321 విమానం ఈజిప్టులోని షర్మ్- ఎ- షేక్ రిసార్టు నుంచి రష్యాకు బయల్దేరింది. సినాయ్ ద్వీపకల్పం చేరుకోగానే విమానానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని కైరోలో అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించారని, కానీ అటువైపు వెళ్తుండగానే సమస్య తీవ్రమైందని రష్యా వర్గాలు చెబుతున్నాయి. విమానం టేకాఫ్ తీసుకున్న 23 నిమిషాలకే ఈజిప్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్ పరిధి నుంచి దాటిపోయిందని, ఆ తర్వాత అది సినాయ్ ద్వీపకల్పంలోని కొండల ప్రాంతంలో కూలిందని భావిస్తున్నారు. -
ఈజిప్టులో కూలిన రష్యా విమానం
కైరో : గగనతలంలో పెను విషాదం చోటు చేసుకుంది. రష్యా విమానం ఈజిప్ట్‌లో కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సిబ్బంది, 217 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. రష్యాకు చెందిన ఫ్లయిట్ నెంబర్ 7K9268 ఎయిర్‌బస్-321 విమానం......... మాస్కో కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో.... ఈజిప్టులోని షర్మ్-అల్-షేక్ విమానాశ్రంయో టేకాఫ్ తీసుకుంది. దాదాపు ఆరేడు గంటల ప్రయాణం తర్వాత ఆ ఫ్లయిట్ రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ చేరాల్సి ఉంది. కానీ అరగంట కూడా గడవకముందే ఆ విమానం కూలిపోయింది. షర్మ్-అల్-షేక్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన విమానం... సెయింట్ పీటర్స్ బర్గ్ చేరనే లేదు. టేకాఫ్ తీసుకున్న 23 నిమిషాలకే..... ఈజిప్ట్ ఏటీసీతో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. దీంతో అధికారుల్లో ఆందోళన పెరిగిపోయింది. కానీ కొద్ది సేపటికి... విమానానికి టర్కీ ఏటీసీతో సంబంధాలు ఏర్పడ్డాయని ప్రచారం జరిగింది. దీంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఐతే ఈ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. రాడార్ నుంచి అదృశ్యమై రెండు కిలోమీటర్లు ప్రయాణించిందో లేదో విమానం ప్రమాదానికి గురైంది. గంటకు 93 నాటికల్ మైళ్ల వేగంతో.... భూమికి 28 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే సిబ్బంది..... విమానాన్ని కైరో విమానాశ్రయంలో దింపేందుకు ట్రై చేశారు. ఆ ప్రయత్నం జరుగుతుండగానే......... ఊహించని విషాదం చోటు చేసుకుంది. సినయ్ ద్వీప కల్పం వద్ద విమానం కుప్పకూలిపోయింది. విమానంలో దాదాపు 217 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులలో 17 మంది పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది పర్యాటకులే ఉన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఈజిప్ట్ ప్రధాని షరీఫ్ ఇస్మాయిల్..... మంత్రులతో భేటీ అయ్యారు. వివరాలు సేకరించిన ప్రధాని కార్యాలయం... రష్యా విమానం ప్రమాదానికి గురైందని నిర్దారించింది. ప్రమాద కారణాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు కేబినెట్ స్థాయి కమిటీని నియమించారు. మరోవైపు విమానం కూలిపోయిన ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సినాయ్‌లో విమాన శకలాల్ని గుర్తించిన అధికారులు మృతదేహాలను తరలించేందుకు 45 అంబులెన్స్‌లతో పాటు సహాయక సిబ్బందిని పంపించారు. ఇదిలాఉంటే ప్రమాదంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సాంకేతిక లోపం వల్లే విమానం కుప్పకూలి పోయిందని రష్యా అధికారులు వాదిస్తుండగా ప్రమాదం వెనక ఉగ్రవాద హస్తం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. సినయ్ ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులకు గట్టి పట్టుందని, పైగా సిరియాలో ఐసిస్ ఉగ్ర మూకలపై రష్యా వైమానిక దాడులు చేస్తోందని, ఈ నేపథ్యంలో ఐసిస్ టెర్రరిస్టులే రష్యా విమానాన్ని కూల్చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించింది. ఇప్పటి వరకూ వంద మృతదేహాలను సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకోగా, వాటిలో ఏడుగురు చిన్నారుల మృతదేహాలు కూడా ఉన్నాయి. సాంకేతిక సమస్యలంటున్న రష్యా టీవీ ఈ విమానం ఈజిప్టులోని షర్మ్- ఎ- షేక్ రిసార్టు నుంచి రష్యాకు బయల్దేరింది. అక్కడినుంచి బయల్దేరగానే సాంకేతిక సమస్యలు తలెత్తాయని, రిసార్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే దీన్ని పైలట్ గుర్తించారని రష్యా టీవీ వర్గాలు చెబుతున్నాయి. కైరోలో అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించారని, కానీ అటువైపు వెళ్తుండగానే సమస్య తీవ్రమైందని అన్నారు. సైప్రస్‌లోని లార్నా ప్రాంతంలో విమానం కూలిందని వెల్లడించారు. -
రష్యా విమానానికి తప్పిన ప్రమాదం
ఈజిప్టు నుంచి రష్యా వెళ్తున్న విమానం ఒకటి కాసేపు గల్లంతు కావడంతో ఒక్కసారిగా అంతటా ఆందోళన నెలకొంది. అయితే కాసేపటి తర్వాత అది సురక్షితంగా ఈజిప్టు ఆకాశమార్గాన్ని దాటి వెళ్లిందని ఈజిప్షియన్ అధికారులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో అందులో దాదాపు 212 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. రష్యాకు చెందిన ఈ విమానం ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పం మీదుగా వెళ్తుండగా ఈజిప్టుకు చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరిధిలోకి ఈ విమానం సిగ్నల్స్ కాసేపు అందలేదు. దాంతో విమానం గల్లంతైనట్లే అందరూ భావించారు. అయితే కాసేపటి తర్వాత మళ్లీ విమానం సురక్షితమేనని ఈజిప్షియన్ అధికారుల నుంచి సమాచారం వచ్చింది.