ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు!
కైరో: ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో కూలిన రష్యా విమాన ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. విమాన ప్రమాద స్థలంలో సహాయక సిబ్బందికి బాధితుల ఆర్తనాదాలు వినిపించినట్టు మొదట వార్తలు వచ్చాయి. కానీ, ఆ ఆశలు నిలువలేదు. విమానంలోని 217 మంది ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది మృతిచెందారని రష్యా రాయబార కార్యాలయంలో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాద స్థలానికి చేరుకున్నసహాయక సిబ్బంది 100మంది మృతదేహాలను వెలికితీశారు. వెలికితీసిన మృతదేహాల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
'ప్రమాదంలో విమానం రెండుభాగాలుగా చీలిపోయింది. విమానం తోకభాగం చిన్నముక్కగా తెగిపడి కాలిపోయింది. పెద్ద పరిమాణంలో ఉన్న ముందుభాగం ఓ పర్వతాన్ని ఢికొట్టింది. ఇప్పటివరకు విమానంలో వంద మృతదేహాలు వెలికితీశాం. మిగితా మృతదేహాలు వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నాం' అని సహాయక బృందానికి చెందిన అధికారి తెలిపారు.
ప్రమాదస్థలికి చేరుకున్న వెంటనే కూలిన విమానంలోని ఓ భాగం నుంచి ఆర్తనాదాలు వినిపించాయని, దీంతో కొందరైన ప్రమాదంలో గాయాలతో బతికి ఉంటారని భావిస్తున్నామని సహాయక బృందానికి చెందిన అధికారి ఒకరు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే సహాయక చర్యలు ముందుకుసాగడంతో ప్రమాదంలో ఎవరూ బతికిలేనట్టు నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.