ఈజిప్టులో కూలిన రష్యా విమానం
కైరో : గగనతలంలో పెను విషాదం చోటు చేసుకుంది. రష్యా విమానం ఈజిప్ట్‌లో కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సిబ్బంది, 217 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. రష్యాకు చెందిన ఫ్లయిట్ నెంబర్ 7K9268 ఎయిర్‌బస్-321 విమానం......... మాస్కో కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో.... ఈజిప్టులోని షర్మ్-అల్-షేక్ విమానాశ్రంయో టేకాఫ్ తీసుకుంది. దాదాపు ఆరేడు గంటల ప్రయాణం తర్వాత ఆ ఫ్లయిట్ రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ చేరాల్సి ఉంది. కానీ అరగంట కూడా గడవకముందే ఆ విమానం కూలిపోయింది.
షర్మ్-అల్-షేక్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన విమానం... సెయింట్ పీటర్స్ బర్గ్ చేరనే లేదు. టేకాఫ్ తీసుకున్న 23 నిమిషాలకే..... ఈజిప్ట్ ఏటీసీతో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. దీంతో అధికారుల్లో ఆందోళన పెరిగిపోయింది. కానీ కొద్ది సేపటికి... విమానానికి టర్కీ ఏటీసీతో సంబంధాలు ఏర్పడ్డాయని ప్రచారం జరిగింది. దీంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఐతే ఈ సంతోషం ఎంతో సేపు నిలవలేదు.
రాడార్ నుంచి అదృశ్యమై రెండు కిలోమీటర్లు ప్రయాణించిందో లేదో విమానం ప్రమాదానికి గురైంది. గంటకు 93 నాటికల్ మైళ్ల వేగంతో.... భూమికి 28 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే సిబ్బంది..... విమానాన్ని కైరో విమానాశ్రయంలో దింపేందుకు ట్రై చేశారు. ఆ ప్రయత్నం జరుగుతుండగానే......... ఊహించని విషాదం చోటు చేసుకుంది. సినయ్ ద్వీప కల్పం వద్ద విమానం కుప్పకూలిపోయింది. విమానంలో దాదాపు 217 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులలో 17 మంది పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది పర్యాటకులే ఉన్నారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఈజిప్ట్ ప్రధాని షరీఫ్ ఇస్మాయిల్..... మంత్రులతో భేటీ అయ్యారు. వివరాలు సేకరించిన ప్రధాని కార్యాలయం... రష్యా విమానం ప్రమాదానికి గురైందని నిర్దారించింది. ప్రమాద కారణాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు కేబినెట్ స్థాయి కమిటీని నియమించారు. మరోవైపు విమానం కూలిపోయిన ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సినాయ్‌లో విమాన శకలాల్ని గుర్తించిన అధికారులు మృతదేహాలను తరలించేందుకు 45 అంబులెన్స్‌లతో పాటు సహాయక సిబ్బందిని పంపించారు.
ఇదిలాఉంటే ప్రమాదంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సాంకేతిక లోపం వల్లే విమానం కుప్పకూలి పోయిందని రష్యా అధికారులు వాదిస్తుండగా ప్రమాదం వెనక ఉగ్రవాద హస్తం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. సినయ్ ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులకు గట్టి పట్టుందని, పైగా సిరియాలో ఐసిస్ ఉగ్ర మూకలపై రష్యా వైమానిక దాడులు చేస్తోందని, ఈ నేపథ్యంలో ఐసిస్ టెర్రరిస్టులే రష్యా విమానాన్ని కూల్చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించింది. ఇప్పటి వరకూ వంద మృతదేహాలను సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకోగా, వాటిలో ఏడుగురు చిన్నారుల మృతదేహాలు కూడా ఉన్నాయి.
సాంకేతిక సమస్యలంటున్న రష్యా టీవీ
ఈ విమానం ఈజిప్టులోని షర్మ్- ఎ- షేక్ రిసార్టు నుంచి రష్యాకు బయల్దేరింది. అక్కడినుంచి బయల్దేరగానే సాంకేతిక సమస్యలు తలెత్తాయని, రిసార్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే దీన్ని పైలట్ గుర్తించారని రష్యా టీవీ వర్గాలు చెబుతున్నాయి. కైరోలో అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించారని, కానీ అటువైపు వెళ్తుండగానే సమస్య తీవ్రమైందని అన్నారు. సైప్రస్‌లోని లార్నా ప్రాంతంలో విమానం కూలిందని వెల్లడించారు.