కూలిన రష్యా విమానం దృశ్యాలు విడుదల
రష్యా విమానం కూలుతున్నప్పటి దృశ్యాలతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. రష్యా విమానం కూలుతుండగా ఆఖరి క్షణాల్లో తీసిన వీడియో ఇదని ఆ సంస్థ పేర్కొంది. ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో రష్యా విమానం కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని మొత్తం 224మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానం తామే కూల్చేశామని, సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై రష్యా బాంబు దాడులకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడ్డామని ఈజిప్టులోని ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థ ప్రకటించింది.
ఈ వాదనను ఇటు ఈజిప్టు, అటు రష్యా కొట్టిపారేస్తున్నాయి. విమాన ప్రమాద ఘటనలో ఉగ్రవాద లింకు లేదని స్పష్టం చేశాయి. అయితే, ఆ విమానాన్ని తామే కూల్చామని చెప్తూ.. ఆధారంగా కూలుతున్న దృశ్యాలతో ఓ వీడియో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ విడుదల చేసింది. క్షిపణితో తామే విమానాన్ని కూల్చేశామని ప్రకటించింది. మరోవైపు విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన బ్లాక్ బాక్స్‌ను దర్యాప్తు అధికారులు నిపుణులకు పంపించారు.
హృదయవిదారకం!
ఈజిప్టులో కూలిన విమాన ప్రయాణికులకు సంబంధించిన ఫొటోలు హృదయాలను కలిచివేస్తున్నాయి. ఈ విమానంలో ప్రయాణించిన పది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా అలెక్సీ గ్రోవోవ్, తాతియనా దంపతులు కూడా ఈ ప్రమాదంలో అసువులు బాసారు. తాతియానా ఫొటోలను బట్టి ఆమె గర్భవతి అయి ఉండవచ్చునని తెలుస్తున్నది. ఎర్రసముద్ర పర్యాటక నగరమైన షర్మెల్ షేక్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయల్దేరిన ఈ విమానంలో ప్రయాణించిన వారిలో అత్యధికులు పర్యాటకులు. రష్యాకు చెందిన వారు. పర్యాటక ప్రాంతంలో విహరించిన అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో చనిపోయిన 217 మందిలో 17 మంది బాలలు, 138 మంది మహిళలు ఉన్నారు.