విమానం బయటి కారణాల వల్లే కూలింది
ఈజిప్టులో కూలిన రష్యా విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలూ లేవని ఆ విమాన యాజమాన్య సంస్థ కొగలిమివా అధికారి అలెగ్జాండర్ స్మిరోవ్ సోమవారం తెలిపారు. ‘బయటి కారణాల వల్లే మా విమానం ప్రమాదానికి గురై గాలిలోనే విరిగి పోయి ఉండొచ్చు. విమానం అదుపు తప్పి కింద పడితుండడంతో ప్రమాదం గురించి పైలట్లు కంట్రోల్ రూమ్‌కు చెప్పే వ్యవధి లేకపోయింది.
ఆ సమయంలో విమానం దెబ్బతిని, ముందుకు సాగలేకపోయి ఉండొచ్చు’ అని చెప్పారు. విమానం ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ముక్కచెక్కలైనట్లు నిర్ధారణ అవుతోందని రష్యా విమానయాన సంస్థ అధికారి నె రద్కో ఆదివారం చెప్పారు. ప్రమాదంలో విమానంలోని మొత్తం 224 మందీ చనిపోగా, 144 మృతదేహాలను రష్యాకు తరలించారు.