ఇరాక్లో తాజాగా జరిగిన అల్లర్లలో 8 మంది మరణించగా 25 మంది గాయపడ్డారు. రాజధాని బాగ్దాద్కు 400 కిలోమీటర్ల దూరంలోని మోసుల్ నగరంలో ఓ కార్పెంటర్ దుకాణంలో ఉన్న ముగ్గురు కార్మికులను సాయుధులు కాల్చిచంపారు. మరో సంఘటనలో పోలీసు పెట్రోలింగ్ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో బాంబు పేలడంతో ఓ పోలీసు సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు, మరో ఇద్దరు గాయపడ్డారు. అలాగే, అల్-బజ్ ప్రాంతంలో మరో బాంబు పేలుడులో ఓ పిల్లాడు సహా ఇద్దరు మరణించారు.
అదే ప్రాంతంలో రోడ్డుపక్కన ఓ పోలీసు ఇంటి సమీపంలో బాబు పేలింది. దీంతో పోలీసు, మరో ఐదుగురు పౌరులకు గాయాలయ్యాయి. దియాలా రాష్ట్రంలో బాంబు పేలుడు జరిగిన ఓ పౌరుడు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు.
ఇంకా పలు ప్రాంతాల్లో కూడా బాంబులు పేలాయి. ప్రధానంగా పోలీసులను లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్ల వద్ద, పెట్రోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో బాంబులు పేలుస్తున్నారు. అలాగే, జనం ఎక్కువగా సంచరించే మార్కెట్లలోనూ బాంబు పేలుళ్లు సంభవిస్తున్నాయి.
ఒక్క జూలై నెలలోనే ఇరాక్లో జరిగిన వివిధ ఉగ్రవాద దాడులు, హింసాత్మక సంఘటనలలో వెయ్యిమంది ఇరాకీలు మరణించగా, మరో 2,300 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు ఐక్యరాజ్యసమితి ఇటీవలే వెల్లడించింది. గడిచిన ఐదేళ్లలో ఇవే అత్యధిక మరణాలు.